ఆఫీసులకొస్తాం.. మహాప్రభో

కరోనా పరిణామాల నేపథ్యంలో ఇంకా పలు కంపెనీలు హైబ్రిడ్‌  (కొన్ని రోజులు కార్యాలయం, మరికొన్ని రోజులు ఇంటి నుంచి) పని విధానాన్ని అనుసరిస్తున్నా..

Updated : 24 Mar 2023 09:17 IST

సహోద్యోగులతో అనుబంధం కోసమే
సామాజిక సంబంధాల పెంపునకూ
లింక్డ్‌ ఇన్‌ నివేదిక

ముంబయి: కరోనా పరిణామాల నేపథ్యంలో ఇంకా పలు కంపెనీలు హైబ్రిడ్‌  (కొన్ని రోజులు కార్యాలయం, మరికొన్ని రోజులు ఇంటి నుంచి) పని విధానాన్ని అనుసరిస్తున్నా.. 78 శాతం మంది భారతీయ వృత్తినిపుణులు కార్యాలయానికి వెళ్లడానికే మొగ్గుచూపుతున్నారు. సామాజిక సంబంధాల పెంపుతో పాటు తమ సహోద్యోగులతో అనుబంధాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తుండడమే ఇందుకు నేపథ్యమని లింక్డ్‌ ఇన్‌ తన నివేదికలో పేర్కొంది. 18 ఏళ్లకు పైబడిన 1,001 మంది భారతీయ సిబ్బంది నుంచి సేకరించిన వివరాలతో లింక్డ్‌ ఇన్‌ ఈ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం..

* గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కార్యాలయానికి రావడం సానుకూలంగా ఉందని 86 శాతం మంది అభిప్రాయపడ్డారు.

* కార్యాలయానికి రావడానికి చెబుతున్న కారణాల్లో సామాజిక సంబంధాలు(43%) మొదటి ప్రాధాన్యతగా ఉండగా.. సహచరులతో నేరుగా సంభాషించడం (42% మంది); పని ప్రదేశంలో అనుబంధాలను పెంచుకోవడం(41%) రెండు, మూడో కారణాలుగా ఉన్నాయి.

* ‘డెస్క్‌-బాంబింగ్‌’ అనే కొత్త ధోరణి కార్యాలయాల్లో కనిపిస్తోంది. (సహోద్యోగులతో సంభాషించడం కోసం.. చెప్పకుండా వారి దగ్గరకు వెళ్లడాన్ని డెస్క్‌ బాంబింగ్‌గా అభివర్ణిస్తున్నారు.) యువ ఉద్యోగుల్లో (జెన్‌జడ్‌) అధిక శాతం (62%) మంది ఈ తరహా సంభాషణలకు మొగ్గుచూపుతున్నారు. ఈ చర్చల వల్ల ఎంతో ప్రయోజనాలున్నాయని 60% మంది అంటున్నారు.

* కరోనా అనంతరం కార్యాలయాలు తిరిగి ప్రారంభమైనా, ఉద్యోగులు భౌతికంగా రానందున వారి వృత్తిజీవితాలకు ఇబ్బంది కలగొచ్చన్న భావనలు కలిగాయి. అయితే ఎక్కడి నుంచైనా పని (రిమోట్‌ వర్కింగ్‌) వల్ల ఎటువంటి ప్రభావం పడబోదని 63% మంది తెలిపారు. ఇంటి నుంచి పనిచేస్తున్నపుడు, ఎక్కువగా శ్రమిస్తే మినహా గుర్తింపు రాదని 71% మంది అంగీకరించారు.

* కార్యాలయానికి వెళ్లడానికి అతితక్కువ ప్రాధాన్యం ఉండే రోజు శుక్రవారమేనని 79% మంది అన్నారు. ఆ రోజు కుటుంబం, స్నేహితులతో గడపడానికి సగం మంది ఇష్టపడుతున్నారు. శుక్రవారం కోసం ఎదురుచూస్తున్న వారు.. గురువారాన్ని సరికొత్త శుక్రవారంగా భావిస్తున్నారు.

* 46% మంది శుక్రవారం త్వరగా పని పూర్తి చేసి, వారాంతాన్ని గడపాలని అనుకుంటున్నారు.

* పనిప్రదేశాల్లో ‘టీ విరామం’ వల్ల అనుబంధాలు పెరుగుతాయని 72% మంది భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని