Karvy Group: ఆ సొమ్ము ఏమైనట్లు?

కార్వీ గ్రూపు కుంభకోణంలో సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) ఒకదాని తర్వాత మరొకటిగా తుది ఉత్తర్వులు జారీ చేస్తోంది.

Updated : 30 Apr 2023 09:39 IST

కార్వీ గ్రూపు కుంభకోణంలో తేలని రూ.1442 కోట్ల లెక్క
కేఎస్‌బీఎల్‌ నుంచి కార్వీ రియాల్టీ, కార్వీ కేపిటల్‌కు బదిలీ
ఆ సంస్థల నుంచి నిధులు ఎక్కడికి మళ్లించారో తేలలేదు  
ఆ సొమ్ము వస్తేనే 3 లక్షల మంది బాధితులకు న్యాయం
ఈనాడు - హైదరాబాద్‌

కార్వీ గ్రూపు కుంభకోణంలో సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) ఒకదాని తర్వాత మరొకటిగా తుది ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఇప్పటి వరకు కార్వీ కేపిటల్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌), కార్వీ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఈ వ్యవహారంలో సెబీ దర్యాప్తు దాదాపుగా ముగిసినట్లుగా కనిపిస్తోంది.

* తన వద్ద ట్రేడింగ్‌/ డీమ్యాట్‌ ఖాతాలు నిర్వహిస్తున్న మదుపరులకు చెందిన ఈక్విటీ షేర్లను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి,  కేఎస్‌బీఎల్‌ సమీకరించిన అప్పుల నుంచి రూ.1094 కోట్ల నగదు కార్వీ రియాల్టీకి బదిలీ అయినట్లు తేలింది. ఆ సొమ్ము అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది, ఎలా దుర్వినియోగం అయ్యిందనే విషయం ఇంకా వెలుగు చూడలేదు.

* అదే విధంగా కార్వీ కేపిటల్‌ అనే మరొక అనుబంధ కంపెనీకి, కేఎస్‌బీఎల్‌ రూ.348 కోట్లు తరలించినట్లు నిర్థారణ అయింది.

* అంటే ఈ 2 కంపెనీలకు మళ్లించిన రూ.1442 కోట్ల సొమ్ము ఏమైంది, ఎటు వెళ్లింది.. అనే విషయం మాత్రం తెలియలేదు.

మూలమే ఇది

తనవి కానివి, పూర్తిగా మదుపరులకు చెందిన షేర్లను తనఖా పెట్టడం ద్వారా కేఎస్‌బీఎల్‌ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి, ఆ సొమ్మును దుర్వినియోగం చేయడమే ఈ కుంభకోణానికి మూలం. అప్పుగా తెచ్చిన సొమ్ములో కొంత కార్వీ రియాల్టీకి, కార్వీ కేపిటల్‌కు బదిలీ చేసిన విషయం సెబీ ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. ఆ తర్వాత ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ నిర్వహించిన ‘ఫోరెన్సిక్‌ ఆడిట్‌’ లోనూ ఈ విషయం రుజువైంది. ‘ఈ సొమ్ము చివరికి ఎక్కడ తేలింది.. దానికి బాధ్యులు ఎవరు.. ఆ సొమ్మును వెనక్కి తెప్పించే అవకాశం ఉందా’ అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదు. కార్వీ బాధితులు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఎంతో మందికి ఇంకా వారి షేర్లు, సొమ్ము రావలసి ఉంది. కేఎస్‌బీఎల్‌ అనుబంధ కంపెనీలకు బదిలీ అయిన సొమ్ము వ్యవహారం తేలితే, దాన్ని వెనక్కి తెప్పించి, బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కొందరిపై నిషేధం, జరిమానా

ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు సెబీ, పలు చర్యలు తీసుకుంది. తొలుత బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవడం కోసం కేఎస్‌బీఎల్‌ తనఖా పెట్టిన మదుపరుల షేర్లను బ్యాంకుల నుంచి ఆయా మదుపరుల ఖాతాకు బదిలీ చేయించింది. కార్వీ కుంభకోణం వెలుగులోకి రాగానే ఈ చర్య తీసుకుంది. తదుపరి కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ లైసెన్సును సస్పెండ్‌ చేసింది.

* తాజాగా కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌తో పాటు సంస్థ సీఎండీ    సి.పార్థసారథిని ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నుంచి నిషేధించి, రూ.21 కోట్ల జరిమానా విధించింది.

* కేఎస్‌బీఎల్‌లో స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్న బీడీ నారంగ్‌, జ్యోతి ప్రసాద్‌లను రెండేళ్ల పాటు కీలకమైన పదవులు చేపట్టకుండా నిషేధించడంతో పాటు, వారిపై రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించింది.

* కేఎస్‌బీఎల్‌కు సీఈఓగా వ్యవహరించిన రాజీవ్‌ రంజన్‌ సింగ్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కేఎస్‌బీఎల్‌కు అనుబంధ సంస్థ అయిన కార్వీ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌పై సస్పెన్షన్‌ విధిస్తూ సెబీ మరొక ఉత్తర్వు జారీ చేసింది.  

* అదే సమయంలో మరొక డైరెక్టర్‌ మేక యుగంధర్‌కు ఈ కుంభకోణంతో సంబంధం లేదని సెబీ నిర్థారించింది. కేఎస్‌బీఎల్‌ చేసిన తప్పులు, తీసుకున్న అప్పులతో తనకు బాధ్యత లేదని, పైగా కంపెనీలో చోటుచేసుకుంటున్న లొసుగులపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని తాను కోరినా, ఎవరూ పట్టించుకోలేదని  యుగంధర్‌ చెప్పిన విషయాన్ని సెబీ పరిగణనలోకి తీసుకుంది. మరొక డైరెక్టర్‌ ఆషిష్‌ అగర్వాల్‌నూ వదలిపెట్టింది.

న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచన

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ బాధితుల్లో కొంతమందికి నిధులు, షేర్లు వెనక్కి వచ్చినా, ఇంకా 3 లక్షల మందికి పైగా బాధితులు ఉన్నట్లు సెబీ తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంతమందికి న్యాయం జరగాలంటే కార్వీ రియాల్టీ, కార్వీ కేపిటల్‌కు బదిలీ చేసిన సొమ్ము ఏమైందో, ఎక్కడుందో తేల్చి.. వెనక్కి తెప్పించాలి. అది ఎప్పుడు జరుగుతుందో.. ఎంతవరకూ సాధ్యమో కూడా స్పష్టత లేదు. అప్పటి వరకు బాధితులకు ఎదురుచూపులు తప్పేటట్లు లేదు. కార్వీ బాధితులు గత మూడేళ్లుగా తీవ్ర వేదనకు గురవుతున్నారు. రూ.1442 కోట్లను 3 నెలల్లోగా కార్వీ రియాల్టీ, కార్వీ కేపిటల్‌ వెనక్కి ఇవ్వని పక్షంలో ఈ కంపెనీలను ఎన్‌ఎస్‌ఈ ఆఫ్‌ ఇండియా తన నియంత్రణలోకి తీసుకుంటుందని సెబీ తాజాగా స్పష్టం చేసింది. ఈ చర్యతో తమ సొమ్ము వెనక్కి వస్తే సరి.. లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కొంతమంది బాధితులు స్పష్టం చేస్తున్నారు. కేఎస్‌బీఎల్‌ బదిలీ చేసిన సొమ్ము ఎక్కడ ఉందో కనిపెట్టి, వెనక్కి తెప్పించి తమకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని