ఐటీసీ లాభంలో 22% వృద్ధి

ఐటీసీ మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.5,225.02 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.4,259.68 కోట్లతో పోలిస్తే ఇది 22.66% అధికం.

Updated : 19 May 2023 06:22 IST

దిల్లీ: ఐటీసీ మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.5,225.02 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.4,259.68 కోట్లతో పోలిస్తే ఇది 22.66% అధికం. అన్ని విభాగాల్లో బలమైన వృద్ది నమోదుకావడం కలిసొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.17,754.02 కోట్ల నుంచి 7% వృద్ధితో రూ.18,799.18 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు సైతం రూ.12,632.29 కోట్ల నుంచి 2.18% పెరిగి రూ.12,907.84 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం ఆదాయం 7.75% అధికమై రూ.19,667.94 కోట్లకు చేరింది. సిగరెట్లతో కలిపి మొత్తం ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగ ఆదాయం రూ.11,325.63 కోట్ల నుంచి 15.07% పెరిగి రూ.13,033.43 కోట్లకు చేరింది. సిగరెట్ల వ్యాపారం 12.61% వృద్ధితో రూ.8,082.26 కోట్లకు పెరిగింది. ఎఫ్‌ఎమ్‌సీజీయేతర విభాగ ఆదాయం రూ.4,148.62 కోట్ల నుంచి 19.34% పెరిగి రూ.4,951.17 కోట్లుగా నమోదైంది. ఐటీసీ హోటల్‌ విభాగ ఆదాయం రెండింతలు పెరిగి రూ.808.72 కోట్లకు చేరింది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి.: 2022-23లో ఐటీసీ రూ.19,427.68 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2021-22లో ఆర్జించిన రూ.15,485.65 కోట్లతో పోలిస్తే ఇది 25.45% ఎక్కువ. మొత్తం కార్యకలాపాల ఆదాయం 17.34% వృద్ధి చెంది రూ.75,826.58 కోట్లకు చేరింది. ఐటీసీ నిర్వహణ ఆదాయం రూ.75,000 కోట్లను మించడం ఇదే మొదటిసారి. అన్ని విభాగాల ఆదాయం రూ.83,897.14 కోట్లుగా నమోదైంది.

డివిడెండ్‌ రూ.9.50: గత ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.6.75 తుది డివిడెండ్‌, రూ.2.75 ప్రత్యేక డివిడెండ్‌ను డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. మధ్యంతర డివిడెండ్‌ రూ.6నూ కలిపితే 2022-23లో మొత్తం డివిడెండ్‌ రూ.15.50కు చేరింది. స్వతంత్ర డైరెక్టర్‌గా అల్క భరుచా, పూర్తి స్థాయి డైరెక్టర్‌గా హేమంత్‌ మాలిక్‌ల నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది.
* ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు డీలాపడింది. ఇంట్రాడేలో 2.23% పడ్డ షేరు రూ.418.10 వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 1.87% నష్టంతో రూ.419.65 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.9,942.41 కోట్లు తగ్గి రూ.5.21 లక్షల కోట్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని