ఎగుమతుల పెంపుపై కావేరీ సీడ్‌ దృష్టి

కొత్త విపణుల్లోకి ప్రవేశించేందుకు, ఇప్పటికే తమ ఎగుమతులు జరుగుతున్న దేశాల్లో తన ఉనికిని బలోపేతం చేసుకునేందుకు కావేరీ సీడ్‌ కంపెనీ ప్రయత్నిస్తోంది.

Published : 29 May 2023 03:00 IST

కంపెనీ ఈడీ మిథున్‌ చంద్‌

దిల్లీ: కొత్త విపణుల్లోకి ప్రవేశించేందుకు, ఇప్పటికే తమ ఎగుమతులు జరుగుతున్న దేశాల్లో తన ఉనికిని బలోపేతం చేసుకునేందుకు కావేరీ సీడ్‌ కంపెనీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ తమ విత్తనాలను వియత్నాం, బంగ్లాదేశ్‌, నేపాల్‌, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు సంస్థ ఎగుమతి చేస్తోంది. ‘ఆగ్నేయాసియా దేశాలు, ఈజిప్ట్‌, ఘనా వంటి ఆఫ్రికా దేశాలకూ మా వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నామ’ని కావేరీ సీడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సి.మిథున్‌ చంద్‌ వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఎగుమతుల పరిమాణం 35%, ఆదాయం 42.44% పెరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం  కంపెనీ మొత్తం ఆదాయంలో ఎగుమతుల వాటా 2 శాతమే. బంగ్లాదేశ్‌లో వ్యాపారం బాగున్నందున, అక్కడ అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మిథున్‌ వెల్లడించారు.

100 ఎకరాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం: కావేరీ గ్రూప్‌ 100 ఎకరాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోందని కంపెనీ వైస్‌ ఛైర్మన్‌ జి.పవన్‌ తెలిపారు. సుస్థిర వ్యవసాయాన్ని సులభతరం చేసే ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కావేరీ మైక్రోటెక్‌కు ప్రత్యేకత ఉందని, సూక్ష్మ పోషక, జీవ ఎరువుల వ్యాపారాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. పత్తి, మొక్కజొన్న, వరి, గోధుమలు, కూరగాయల విత్తనాల్లో కంపెనీ మంచి వృద్ధి సాధించిందని మిథున్‌ చంద్‌ తెలిపారు. చిరు ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున, ఆ విభాగ వృద్ధి ప్రోత్సాహకరంగా ఉందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని