ప్రీపెయిడ్‌ కార్డులనూ టీసీఎస్‌ నుంచి మినహాయించాలి

సరళీకృత చెల్లింపు పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) కింద మూలం వద్ద 20 శాతం పన్ను వసూలు (టీసీఎస్‌)పై స్పష్టత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి విదేశీ నగదు మార్పిడి పరిశ్రమ విజ్ఞప్తి చేసింది.

Published : 03 Jun 2023 01:51 IST

విదేశీ నగదు మార్పిడి పరిశ్రమ విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: సరళీకృత చెల్లింపు పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) కింద మూలం వద్ద 20 శాతం పన్ను వసూలు (టీసీఎస్‌)పై స్పష్టత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి విదేశీ నగదు మార్పిడి పరిశ్రమ విజ్ఞప్తి చేసింది. జులై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంటున్నా, ఇప్పటికీ వీటిపై సరైన సూచనలు లేవని పేర్కొంది. గత నెల 19న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో.. విదేశాల్లో క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఉపయోగించి చేసే లావాదేవీలపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షల వరకూ మినహాయింపు ఉంటుందని వెల్లడించింంది. విదేశీ కరెన్సీ, బ్యాంకుల ద్వారా వైర్‌ బదిలీలు, ప్రీ-పెయిడ్‌ ఫారెక్స్‌ కార్డులు, ఇతర అంతర్జాతీయ చెల్లింపు అవకాశాలతో చేసే చిన్న విలువ లావాదేవీలపై వివరణ ఇవ్వలేదని ఆల్‌ ఇండియా అసోసియేషన్‌ ఆఫ్‌ అథరైజ్డ్‌ మనీ ఛేంజర్స్‌, మనీ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్స్‌ ప్రధాన కార్యదర్శి భాస్కర్‌ రావు అన్నారు. రూ.7 లక్షల లోపు లావాదేవీలకు ఒకే విధంగా టీసీఎస్‌ ఉండేలా ప్రభుత్వం పరిశీలిస్తుందని పరిశ్రమ ఆశిస్తోందని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లేవారిలో 60 శాతం మంది డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను తీసుకెళ్లరని, ఎక్కువగా ప్రీపెయిడ్‌ కార్డులు, నగదు రూపంలో విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకెళ్తారని పేర్కొన్నారు. 20 శాతం టీసీఎస్‌ నిబంధన వీరిపై భారంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షల లోపు నిబంధన డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో పాటు ఇతర చెల్లింపు పద్ధతులకూ వర్తింపచేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని