విమానయాన పరిశ్రమ లాభం రూ.80,000 కోట్లకు పైనే
అంతర్జాతీయ విమానయాన పరిశ్రమ ఈ ఏడాది 9.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.80,360 కోట్లకు పైగా) నికర లాభాన్ని నమోదు చేసే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) అంచనా వేసింది.
ఒక్కో ప్రయాణికుడిపై 2.25 డాలర్ల ఆర్జన
2023పై ఐఏటీఏ అంచనా
ఇస్తాంబుల్: అంతర్జాతీయ విమానయాన పరిశ్రమ ఈ ఏడాది 9.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.80,360 కోట్లకు పైగా) నికర లాభాన్ని నమోదు చేసే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) అంచనా వేసింది. ప్రయాణికుల రద్దీ పెరుగుతుండడం, ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటుండడం ఇందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే ఆదాయాలు 803 బి.డాలర్లు(సుమారు రూ.65.4 లక్షల కోట్లు)గా నమోదు కావచ్చని ఒక్కో ప్రయాణికుడిపై సగటున 2.25 డాలర్లను విమానయాన సంస్థలు ఆర్జించే అవకాశం ఉందని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ తెలిపారు. ఐఏటీఐ వార్షిక సాధారణ సమావేశంలో వాల్ష్ మాట్లాడుతూ.. సరఫరాపరమైన సమస్యల వల్ల విమానయాన సంస్థల వ్యయాలు పెరగడంతో పాటు మరిన్ని విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చే సామర్థ్యం తగ్గుతోందని పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు సస్టెయిన్‌బుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (బయో విమాన ఇంధనం/ ఎస్‌ఏఎఫ్)కు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలు, క్లెయిమ్ సిస్టమ్ ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక అనిశ్చితులతో కూడిన పరిస్థితులు ఉన్నప్పటికీ.. విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిందని, 2019 స్థాయిలో 90 శాతానికి పైగా ఇది చేరుకుందని తాజా గణాంకాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఐఏటీఏ అనేది 300కి పైగా విమానయాన సంస్థల బృందం. ఇందులో పలు భారత్‌కు చెందినవీ ఉన్నాయి.
సవాళ్లున్నాయ్:
కరోనా మహమ్మారి పరిణామాల అనంతరం.. విమానయాన పరిశ్రమ పుంజుకున్నప్పటికీ వ్యయాల ఒత్తిళ్లు, సరఫరాపరమైన సమస్యల రూపంలో ఇంకా సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. సరఫరా సమస్యలను పరిష్కరించే విషయంలో విమానాల తయారీ సంస్థలు (ఓఈఎంలు) ఇప్పటికీ చురుకుగా వ్యవహరించడం లేదని వాల్ష్ తెలిపారు. దీని వల్ల విమానయాన సంస్థల సర్వీసుల సామర్థ్యంపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. దీనికి తప్పకుండా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని వివరించారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకునే మార్గాల అవసరాన్ని ప్రస్తావిస్తూ.. శూన్య ఉద్గార లక్ష్యాన్ని సాధించడంలో ఎస్‌ఏఎఫ్‌ది కీలక పాత్ర అవుతుందని పేర్కొన్నారు. ఎస్‌ఏఎఫ్ ఉత్పత్తి మార్గాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో ఇద్దరు భారత సంస్థల సీఈఓలు: భారత విమానయాన విపణిలో అపార అవకాశాలున్నాయని విల్లీ వాల్ష్ తెలిపారు. ఐఏటీఏ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో (బీఓజీ) భారత విమానయాన సంస్థలకు చెందిన ఇద్దరు సీఈఓలు ఉండటాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి అని, భారత్‌లో ఉన్న అవకాశాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
భారత్‌లో కార్యకలాపాలను విస్తరిస్తాం: లుఫ్తాన్సా
భారత్‌లో కార్యకలాపాల విస్తరణపై దృష్టి సారించినట్లు లుఫ్తాన్సా సీఈఓ కార్స్‌టెన్ స్పోహర్ తెలిపారు. ‘భారత్‌లో మా స్థానాన్ని బలోపేతం చేసుకున్నాం. దీనిని మరింత పెంచుకోవాలని అనుకుంటున్నాం. ఎయిరిండియాతో కొత్త భాగస్వామ్యం ఇందుకు దోహదం చేయనుంద’ని పేర్కొన్నారు. భారత్‌లో రెండంచెల వ్యూహంతో ముందుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
* విమాన ప్రయాణికుడు తప్పుగా ప్రవర్తించిన ఘటన గతేడాది ప్రతి 568 విమానాలకు గాను ఒకటి చోటుచేసుకుందని ఐఏటీఏ తెలిపింది. 2021లో ఈ సంఖ్య 835గా ఉందని పేర్కొంది. విమాన ప్రయాణికుల దుష్ప్రవర్తన సంఘటనలు భారత్ సహా పలు దేశాల్లో ఇటీవల బాగా పెరిగాయని తన విశ్లేషణలో ఐఏటీఏ పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన, దుర్భాషలాడటం, మత్తు లేదా మద్యం తీసుకోవడం లాంటివి ఇందులో ఎక్కువగా ఉన్నాయని వివరించింది.
* 2018 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి 700 కోట్ల టికెట్లపై విశ్లేషణ చేయగా.. పన్నులు, రుసుములు రూపేణా 38,000 కోట్ల డాలర్లను విమానయాన సంస్థలు చెల్లించాయని వాల్ష్ తెలిపారు. దేశీయ విమాన సర్వీసులనూ కలిపితే.. ఇది 50,000 కోట్ల డాలర్లకు పెరుగుతుందని తెలిపారు. అందువల్ల అంతర్జాతీయ విమాన సర్వీసులకు పన్నులు వర్తించడం లేదనే వాదనలో నిజం లేదని పేర్కొన్నారు. విధాన రూపకర్తలు ఊహాగానాల కంటే కూడా వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యమని వాల్ష్ పేర్కొన్నారు.
వైడ్ బాడీ విమానాల కొరత
భారత్ అధికంగా అభివృద్ధి చెందుతోన్న విమానయాన విపణి అని, అంతర్జాతీయ మార్గాల్లో సేవల విస్తరణకు చాలానే అవకాశాలు ఉన్నాయని ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. అయితే దేశంలో ఎక్కువ వెడల్పు ఉండే(వైడ్- బాడీ) విమానాల కొరత ఉందని పేర్కొన్నారు. దేశీయ విమానయాన సంస్థల వద్ద ఈ తరహా విమానాల సంఖ్య 50 కంటే తక్కువగానే ఉందని పేర్కొన్నారు.
10 కోట్ల మంది ప్రయాణికుల లక్ష్యం: ఇండిగో సీఈఓ
2024 మార్చితో ముగిసే సంవత్సరంలో 10 కోట్ల మంది ప్రయాణికులను చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండిగో తెలిపింది. మరిన్ని దేశీయ, అంతర్జాతీయ మార్గాలకు సేవలను విస్తరించనుండడం వల్ల ఇది సాధ్యం కాలగదని సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ధీమా వ్యక్తం చేశారు. 2022-23లో 8.6 కోట్ల మంది ప్రయాణికులు ఇండిగో విమానాల్లో ప్రయాణించారు. అలాగే 2023-24 చివరినాటికి తమ వద్ద మొత్తం విమానాల సంఖ్య ప్రస్తుతమున్న 300 నుంచి 350కు పెరగొచ్చని భావిస్తున్నట్లు ఎల్బర్స్ తెలిపారు. అలాగే టికెట్ ఛార్జీల విషయంలో స్వీయ నియంత్రణ విధానం ఉండాలంటూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చేసిన సూచనను పరిశీలిస్తామని పేర్కొన్నారు. ‘భారత విమానయాన విపణిలో సాధారణంగానే అధిక పోటీ ఉంటుంది. అందువల్ల టికెట్ ధరలు అందుకు తగినట్లుగానే ఉంటాయ’ని ఎల్బర్స్ స్పష్టం చేశారు.
విమాన టికెట్ ఛార్జీలపై స్వీయనియంత్రణ ఉండాలి
విమానయాన సంస్థలకు మంత్రి సింథియా సూచన
దిల్లీ: విమాన టికెట్ ధరలు సమంజసమైన రీతిలో ఉండేలా ఓ విధానాన్ని రూపొందించాలని విమానయాన సంస్థలకు ప్రభుత్వం సూచించింది. ఇటీవల కొన్ని మార్గాల్లో టికెట్ ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ సూచన చేసింది. ముఖ్యంగా ఇంతకుమునుపు గోఫస్ట్ నడిపిన విమాన సర్వీసులకు సంబంధించి కొన్ని మార్గాల్లో టికెట్ ధరలు బాగా పెరగడంపై విమానయాన సంస్థల అడ్వయిజరీ గ్రూపుతో నిర్వహించిన సమావేశంలో పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆందోళన వ్యక్తం చేశారు. విమాన టికెట్లపై స్వీయ నియంత్రణ విధానాన్ని రూపొందించుకోవడం అవసరమని, దానిని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) పర్యవేక్షిస్తుండాలని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నప్పుడు.. మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ విమాన టికెట్ ఛార్జీలు పెరగకుండా పర్యవేక్షించాలని, కఠిన నియంత్రణ అవసరమని సూచించింది. ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనపై స్పందిస్తూ.. బాధిత కుటుంబాల కోసం ఉచితంగా కార్గో సేవలను అందించాలని విమానయాన సంస్థలకు సూచించినట్లు పేర్కొంది. కాగా.. ప్రస్తుతం విమాన ఛార్జీల నియంత్రణ ప్రభుత్వం చేతిలో లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: షూటింగ్లో రెండు స్వర్ణాలు.. టెన్నిస్‌లో రజతం
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. 19,550 ఎగువన నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు
-
Asifabad: బడికెళ్లాలంటే.. ఈత రావాలి
-
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు కొనసాగింపు