హైదరాబాద్‌లో కో-వర్కింగ్‌ కేంద్రాలు

కో-వర్కింగ్‌ సేవల సంస్థ ఆఫీస్‌, హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో కార్యకలాపాలను విస్తరించనుంది. దీని కోసం నూజివీడు సీడ్స్‌ (ఎన్‌ఎస్‌ఎల్‌) తో ఒప్పందం కుదుర్చుకుంది.

Updated : 07 Jun 2023 03:57 IST

నూజివీడు సీడ్స్‌తో ‘ఆఫీస్‌’ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: కో-వర్కింగ్‌ సేవల సంస్థ ఆఫీస్‌, హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో కార్యకలాపాలను విస్తరించనుంది. దీని కోసం నూజివీడు సీడ్స్‌ (ఎన్‌ఎస్‌ఎల్‌) తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ప్రస్తుతం బెంగళూరులో 23 కేంద్రాలు, హైదరాబాద్‌లో 14 కేంద్రాలు నిర్వహిస్తోంది. తాజా ఒప్పందం వల్ల ఈ 2 నగరాల్లో మరికొన్ని కేంద్రాలను ప్రారంభించనుంది. బంజారాహిల్స్‌లోని 25,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ‘ఎన్‌ఎస్‌ఎల్‌ ఐకాన్‌’ భవనంలో ఒక కో-వర్కింగ్‌ సదుపాయాన్ని ప్రారంభించనున్నట్లు వివరించింది. ఎన్‌ఎస్‌ఎల్‌తో కలిసి బెంగళూరులో ఒక భవనాన్ని నిర్మిస్తున్నామంది.  


మ్యాగ్నైట్‌ ఎస్‌యూవీలు లక్ష విక్రయించాం: నిస్సాన్‌

చెన్నై: జపాన్‌కు చెందిన నిస్సాన్‌ అనుబంధ నిస్సాన్‌ మోటార్‌ ఇండియా తమ స్పోర్ట్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) ‘మ్యాగ్నైట్‌’ మోడల్‌లో 1,00,000వ కారును మంగళవారం విపణిలోకి విడుదల చేసింది. ఫ్రాన్స్‌ సంస్థ రెనోతో కలిసి నిస్సాన్‌ సంయుక్తంగా నెలకొల్పిన రెనో నిస్సాన్‌ ఆటోమోటివ్‌ ఇండియాకు తమిళనాడులో ఉన్న ప్లాంటులో ఈ కారును తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఎరుపు రంగులోని ఈ కారును కంపెనీ అధికారులు ఆవిష్కరించారు. భారత్‌లో అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అందించేందుకు కట్టుబడి ఉన్నామనడానికి మ్యాగ్నైట్‌ లక్ష కార్ల తయారీ ఘనతే ఓ నిదర్శనమని నిస్సాన్‌ మోటార్‌ ఇండియా తెలిపింది.


ఎల్‌ఐసీ ఎండీ పదవులకు ఇద్దరి ఎంపిక

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డైరెక్టర్లను ఎంపిక చేసే ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో(ఎఫ్‌ఎస్‌ఐబీ) తాజాగా ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) పదవులకు సత్‌ పాల్‌ భానూ, ఆర్‌ దొరై స్వామి పేర్లను సూచించింది. ‘2023 ఏప్రిల్‌ 29 నుంచి ఖాళీగా ఉన్న ఎండీ పదవికి సత్‌ పాల్‌ భానూను; 2023 సెప్టెంబరు 1న ఖాళీ అయ్యే ఎండీ స్థానానికి ఆర్‌ దొరై స్వామిని బ్యూరో సిఫారసు చేస్తున్నట్లు’  పేర్కొంది. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ సీఎండీ పదవికి ఎమ్‌ రాజేశ్వరి సింగ్‌ పేరును; జీఐసీ రీ సీఎండీ హోదాకు రామస్వామి నారాయణన్‌ను సిఫారసు చేసింది.  


ఫండ్‌ వ్యాపారంలోకి బజాజ్‌ ఫిన్‌సర్వ్‌

ముంబయి: వివిధ ఆర్థిక సేవలనందిస్తున్న బజాజ్‌ఫిన్‌సర్వ్‌ తాజాగా మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. వచ్చే కొన్నేళ్లలో భారీ స్థాయిలో ఈ విభాగాన్ని నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా తొలుత ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌, లిక్విడ్‌, మనీ మార్కెట్‌ ఉత్పత్తుల్లో 3 పథకాలను ఈ నెలాఖరుకు ఆవిష్కరించనుంది. నియంత్రణ అనుమతులపై ఆధారపడి త్వరలో మరో 4 పథకాలనూ తీసుకురానున్నట్లు గ్రూప్‌ ఛైర్మన్‌, ఎండీ సంజీవ్‌బజాజ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం తమ గ్రూప్‌ 8 అనుబంధ కంపెనీల ద్వారా 7 కోట్ల మంది వినియోగదార్లకు సేవలందిస్తోందని బజాజ్‌ పేర్కొన్నారు. గ్రూప్‌ తొమ్మిదో సంస్థ అయిన బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ప్రస్తుతం ఈ వ్యాపారం చేస్తున్న 40 మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలతో పోటీ పడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని