Air India: కొత్త శకం దిశగా ఎయిరిండియా

ఎయిరిండియా.. ఒకప్పుడు భారీ నష్టాల్లో, అప్పుల్లో కూరుకుపోయిన సంస్థ. టాటా గ్రూప్‌ చేతికి వెళ్లిన అనంతరం గట్టిగా రెక్కలు విదిల్చి మరింత వేగంగా గాల్లో దూసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా ‘విహాన్‌.ఏఐ’ పేరిట గతేడాదే అయిదేళ్ల ప్రణాళికనూ సిద్ధం చేసింది.

Updated : 09 Jul 2023 08:27 IST

ఎయిరిండియా.. ఒకప్పుడు భారీ నష్టాల్లో, అప్పుల్లో కూరుకుపోయిన సంస్థ. టాటా గ్రూప్‌ చేతికి వెళ్లిన అనంతరం గట్టిగా రెక్కలు విదిల్చి మరింత వేగంగా గాల్లో దూసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగా ‘విహాన్‌.ఏఐ’ పేరిట గతేడాదే అయిదేళ్ల ప్రణాళికనూ సిద్ధం చేసింది. ఇటీవల 470 విమానాలకు భారీ ఆర్డరు సైతం పెట్టింది. సంస్థ సీఈఓ కాంప్‌బెల్‌ అన్నట్లు ఈ కంపెనీ పునరుజ్జీవం.. టీ20 మ్యాచ్‌లా కాకుండా, టెస్ట్‌ మ్యాచ్‌లా జరగనుంది. అది కూడా బలంగా.

ఎయిరిండియా ఒక కొత్త శకం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. నెట్‌వర్క్‌, విమానాలు..ఈ రెండింటిలో వేగంగా వృద్ధి చెందడంపై దృష్టి సారిస్తోంది. వినియోగదార్లలో విశ్వాసం పెంచేందుకు కచ్చితమైన సమయపాలనపైనా దృష్టి పెట్టింది. గతేడాది ప్రకటించిన అయిదేళ్ల పునరుజ్జీవ ప్రణాళిక ‘విహాన్‌.ఏఐ’లో తొలి దశను ఇటీవలే పూర్తి చేసింది. అందులో భాగంగా.. చట్టపరమైన చిక్కులను తొలగించడంపై దృష్టి సారించింది. ఇక టేకాఫ్‌ దశలో భాగంగా.. పలు చర్యలను తీసుకుంటోంది.

1. నెట్‌వర్క్‌ పునర్నిర్మాణం

టాటా గ్రూప్‌ తనకున్న నాలుగు విమానయాన సంస్థలు ఒకదానికొకటి పోటీకాకుండా ఉండడం కోసం మార్గాల నెట్‌వర్క్‌లో మార్పులు చేపడుతోంది. దీని ప్రకారం.. భువనేశ్వర్‌, బగ్దోగ్రా, సూరత్‌ విమానాశ్రయాల్లో ఇక నుంచి ఎయిరేషియా ఇండియా సేవలు అందిస్తుంది. దిల్లీ/ముంబయి నుంచి కోచి, త్రివేండ్రం, విశాఖ, నాగ్‌పుర్‌లకు అనుసంధానం పెంచుతోంది. దేశీయ- అంతర్జాతీయ విమానాల అనుసంధానాన్ని ఈ రెండు మెట్రో నగరాల నుంచి చేస్తోంది. తద్వారా ఆకర్షణీయ ధరల్లో టికెట్లు ఉంచేలా జాగ్రత్తలు పడుతోంది. నెట్‌వర్క్‌ విస్తరణలో భాగంగా ఎయిరిండియాలో.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఏఐఎక్స్‌ కనెక్ట్‌, విస్తారాలను విలీనం చేసే ప్రక్రియలో ఉంది.

2. వినియోగదారు సంతృప్తి కోసం..

విమానం లోపల ఆహార, పానీయాలను అందించే విషయంలో ఏప్రిల్‌లో కొత్త నిర్ణయాలు తీసుకుంది. అన్ని అంతర్జాతీయ విమానాల్లో సరికొత్తగా రుచులను అందించనుంది. ఆరోగ్యకరమైన ఆహారాలనే ట్రెండీగా అందజేస్తోంది. పానీయాల విషయంలో ప్రీమియం బ్రాండ్లను ప్రవేశపెట్టింది. వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ను ఎయిరిండియా.కామ్‌కు మార్చడంతో పాటు.. సాంకేతికంగా అప్‌గ్రేడ్‌ చేసింది. రెండు దశాబ్దాల నాటి సాంకేతికతను పక్కనపడేసి.. వినియోగదార్లకు సరికొత్త ఫీచర్లను అందిస్తోంది. నెట్‌ ప్రమోటర్‌ స్కోర్‌(ఎన్‌పీఎస్‌) ఆధారిత     ఫీడ్‌బ్యాక్‌ను గత మూడు నెలల్లో మొత్తం ప్రయాణానికి విస్తరించింది. అన్ని వైడ్‌బాడీ విమానాల్లో కొత్త సీట్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యవస్థలతో ఇంటీరియర్స్‌ను మార్చడం కోసం 400 మి.డాలర్లను ఖర్చుపెట్టనుంది.

3. సిబ్బంది నియామకం..

2023లో 4200 మందికి పైగా కేబిన్‌సిబ్బంది, 900 మంది పైలట్లను నియమించుకోవాలని చూస్తోంది. దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించాలంటే వీరు తప్పనిసరి. ప్రస్తుతం 1600 మంది పైలట్లు 113 విమానాలను నడుపుతున్నారు. సిబ్బంది కొరత వల్ల అపుడపుడు.. సుదూర ప్రాంత విమానాలు ఆలస్యం కావడమో..రద్దు కావడమో జరుగుతోంది. ప్రతీ నెలా 50 మంది పైలట్లు, 550 మంది కేబిన్‌ సిబ్బందిని నియమించుకుంటున్నట్లు మే నెలలో సీఈఓ కాంప్‌బెల్‌ తెలిపారు. మే 2023 వరకు 5000 మంది కొత్త ఉద్యోగులను తీసుకున్న ఈ సంస్థ.. నాన్‌-ఫ్లైయింగ్‌ కార్యకలాపాలకు, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌కు మరిన్ని నియామకాలు చేపడుతోంది. ఎయిరిండియాకున్న మొత్తం 15,000 మంది ఉద్యోగుల్లో 30 శాతం మందిని గత 18 నెలల్లోనే నియమించుకోవడం విశేషం.

4. 70 బి. డాలర్లతో కొత్త విమానాలు..

70 బిలియన్‌ డాలర్ల విలువైన 250 ఎయిర్‌బస్‌, 220 బోయింగ్‌ విమానాలకు గత నెలలో ఆర్డరు పెట్టింది. ఇందులో 70 పెద్ద (వైడ్‌ బాడీ) విమానాలున్నాయి. అంతే కాదు..  అదనంగా 70 విమానాలను కొనుగోలు చేసే ఆప్షన్‌తో బోయింగ్‌తో సంతకాలు చేసింది. ఇందులో యాభై 737 మాక్స్‌ విమానాలు,     ఇరవై 787 డ్రీమ్‌లైనర్లు ఉంటాయి. ఈ ఏడాది చివర్లో ఎయిర్‌బస్‌ తన ఏ350 వైడ్‌ బాడీ విమానాలతో డెలివరీని ప్రారంభిస్తుంది. 2025 మధ్యలో ఎక్కువ భాగం డెలివరీలు అవుతాయి. ప్రస్తుతం పదకొండు బీ777, ఇరవై ఐదు ఏ320 విమానాలను లీజు పద్ధతిలో తీసుకోవడం మొదలుపెట్టింది. ప్రస్తుతం సంస్థ వద్ద 122 విమానాలుండగా.. ఈ ఏడాది చివరకు ఆరు ఏ350, ఎనిమిది బీ777 విమానాలు రానున్నాయి.


ఈ అయిదింటిపై దృష్టి

* వినియోగదార్లకు అత్యుత్తమ సేవలు
* బలమైన కార్యకలాపాలు
* పరిశ్రమలోనే అత్యుత్తమ నైపుణ్య సిబ్బంది
* ఉత్తమ నాయకత్వం
* వాణిజ్య సామర్థ్యం-లాభదాయకత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు