ఇప్పటికీ పెద్ద షేర్లే చౌక

బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీలు జీవనకాల రికార్డు స్థాయికి చేరాయి. రోజురోజుకీ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి.

Published : 18 Jul 2023 06:35 IST

స్మాల్‌ క్యాప్‌ షేర్లు ‘ఖరీద’య్యాయి
స్టాక్‌మార్కెట్‌ ఇంకా ప్రమాదకర స్థాయికి చేరలేదు
యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐఓ వెట్రి సుబ్రమణియం

ఈనాడు, హైదరాబాద్‌: బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీలు జీవనకాల రికార్డు స్థాయికి చేరాయి. రోజురోజుకీ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో పెట్టుబడి పెట్టడంపై కొంతమంది మదుపర్లు తేల్చుకోలేకపోతున్నారు. కానీ ఈక్విటీల విలువలు ఇంకా ప్రమాదకర స్థాయికి చేరనందున, కొత్త పెట్టుబడుల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ (సీఐఓ) వెట్రి సుబ్రమణియం అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ స్టాక్‌మార్కెట్‌ సూచీలు రెండేళ్ల నాటి పరిస్థితితో పోల్చితే ఇంకా తక్కువగానే ఉన్నట్లు చెప్పుకోవచ్చన్నారు. ఆయన విశ్లేషణ ప్రకారం..
* రెండేళ్లతో పోల్చితే సూచీలు 5-6 శాతమే పెరిగాయి. అదే సమయంలో కంపెనీల ఆదాయాల్లో 40% వృద్ధి నమోదైంది. అందువల్ల సూచీలు ప్రమాదకర స్థాయికి చేరినట్లు కాదు.
*పెద్ద కంపెనీల (లార్జ్‌ క్యాప్‌) షేర్ల ధరలు ఇంకా చౌకగానే ఉన్నాయి. ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలున్నాయి. కానీ.. చిన్న కంపెనీల (స్మాల్‌ క్యాప్‌) షేర్ల ధరలు తక్కువ సమయంలోనే బాగా పెరిగాయి. అందువల్ల చిన్న కంపెనీల షేర్లపై పెట్టుబడి ఇప్పుడు ఆకర్షణీయం కాదు.
* వాహన రంగంలో సమీప భవిష్యత్తులో మెరుగైన వృద్ధి నమోదు కావచ్చు. స్వల్పకాలంలో ఈ రంగ షేర్లపై పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని అందించొచ్చు.
* ‘కాంట్రా ఇన్వెస్ట్‌మెంట్‌’ కింద ఔషధ కంపెనీలపై పెట్టుబడి పెట్టొచ్చు.
* ఐటీ రంగంలో వృద్ధి అవకాశాలున్నందున, ఈ కంపెనీల షేర్లపై దశల వారీగా పెట్టుబడి పెడితే మంచి ప్రతిఫలాన్ని పొందొచ్చు.


యూటీఐ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌

యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌, కొత్తగా ‘యూటీఐ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌’ పథకాన్ని ఈ నెల 21న ప్రారంభిస్తోంది. దీనికి సచిన్‌ త్రివేది, అనురాగ్‌ మిట్టల్‌ ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. కంపెనీల వాస్తవిక విలువ కంటే, సెంటిమెంట్‌ ఆధారంగానే మదుపరులు ఈక్విటీ పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారని, దానివల్ల కొన్ని సందర్భాల్లో నష్టం జరుగుతుందని వెట్రి సుబ్రమణియం అన్నారు. దీన్ని అధిగమించడానికి బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు దోహదపడతాయని వివరించారు. వాస్తవిక విలువను పరిగణనలోకి తీసుకుని, పెట్టుబడులను ఎప్పటికప్పుడు క్రియాశీలకంగా ఈక్విటీ, రుణ విభాగాల మధ్య మార్చుకుంటూ, సమన్వయ పరుచుకోవడమే బ్యాలెన్స్‌ అడ్వాంటేజ్‌ ఫండ్ల ప్రత్యేకతగా వివరించారు. దీనివల్ల మదుపరులకు దీర్ఘకాలంలో మేలు జరుగుతుందన్నారు. మార్కెట్‌ విలువ పెరిగినప్పుడు ఈక్విటీకి పెట్టుబడులు తగ్గించి, రుణ విభాగంలో పెట్టుబడులు పెంచడం; మార్కెట్‌ విలువలు తగ్గినప్పుడు ఈక్విటీకి పెట్టుబడులు పెంచి, రుణ పెట్టుబడులు తగ్గించడం ద్వారా అధిక లాభాలు నమోదు చేసే అవకాశం ఈ పథకాల్లో ఉంటుందని తెలిపారు.


ఏయూఎం ఇంకా పెరుగుతుంది

దేశంలో మ్యూచువల్‌ ఫండ్ల అజమాయిషీలో ఉన్న నిధుల మొత్తం (ఏయూఎం) గత అయిదేళ్లలో రూ.8.11 లక్షల కోట్ల నుంచి, రూ.44.39 లక్షల కోట్లకు పెరిగింది. ఈ మొత్తం ఇంకా పెరుగుతుందని సుబ్రమణియం అభిప్రాయపడ్డారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తుండటం ఇండుకు కారణమన్నారు.  దేశంలోని మ్యూచువల్‌ ఫండ్లలో 8వ స్థానంలో ఉన్న యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌కు హైబ్రిడ్‌ పథకాల నిర్వహణలో ఎంతో అనుభవం ఉందని వివరించారు. వివిధ పథకాల న్యూ ఫండ్‌ ఆఫర్‌ లలో రూ.2,500 - 5,000 కోట్ల వరకు సమీకరించిన అనుభవం తమకు ఉందని, అంతే స్థాయిలో కొత్త పథకం కింద నిధులు సమీకరించాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని