పన్ను చెల్లింపుదార్ల సగటు ఆదాయం రూ.13 లక్షలు

దేశంలో ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలు చేసే వారి వార్షిక సగటు ఆదాయం   రూ.13 లక్షలకు చేరినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది.

Published : 19 Aug 2023 01:42 IST

2014-23 మధ్య 195% వృద్ధి
ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక

ఈనాడు, దిల్లీ: దేశంలో ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలు చేసే వారి వార్షిక సగటు ఆదాయం   రూ.13 లక్షలకు చేరినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక తెలిపింది. 2014 మదింపు సంవత్సరంలో ఒక్కో రిటర్నుదారు సగటు వార్షికాదాయం రూ.4.4 లక్షలుగా, 2023 నాటికి అది రూ.13 లక్షలకు చేరినట్లు వెల్లడించింది. 2025 నాటికి రూ.17.2 లక్షలకు, 2047 నాటికి రూ.49.7 లక్షలకు చేరనున్నట్లు అంచనా వేసింది. అల్పాదాయవర్గాలు ఎగువ ఆదాయ వర్గానికి చేరడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ప్రతి స్థాయిలోని వారికి ఆదాయాలు పెరుగుతున్నాయని, ప్రతి శ్లాబ్‌లో రిటర్న్‌లు దాఖలు చేసేవారి సంఖ్య 3 రెట్లు పెరిగినట్లు నివేదిక పేర్కొంది.

  • 2023లో మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌ నుంచి అత్యధిక స్థాయిలో రిటర్నులు దాఖలైనట్లు వెల్లడించింది. మొత్తం రిటర్నుల్లో ఈ 5 రాష్ట్రాల వాటానే 48% ఉన్నట్లు తెలిపింది. 2022తో పోలిస్తే 2023లో 64 లక్షల రిటర్నులు అధికంగా వచ్చాయని, వీటిల్లోనూ ఆ 5 రాష్ట్రాల నుంచే ఎక్కువ పెరుగుదల కనిపించిందని వెల్లడించింది. 2047కు 48 కోట్లకు పైగా రిటర్నులు: ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య 2023 ఆర్థిక సంవత్సరంలో 7 కోట్లు కాగా.. 2047కు 48.2 కోట్లకు చేరనున్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా వేసింది. 2047 నాటికి 25% మంది ఐటీ రిటర్నుదారులు, అల్పాదాయ విభాగం నుంచి బయటపడతారని తెలిపింది. దీనివల్ల తలసరి ఆదాయం 2023-47 మధ్య కాలంలో రూ.2 లక్షల నుంచి రూ.14.9 లక్షలకు చేరనున్నట్లు పేర్కొంది. ప్రజల ఆదాయం పెరగడం వల్ల డీమ్యాట్‌ ఖాతాల సంఖ్యా పెరగనున్నట్లు అంచనా వేసింది.

ఆదాయాల పరంగా

  • జీరో ట్యాక్స్‌ లయబిలిటీ ఉన్న రిటర్నుల సంఖ్య 2022లో 65.1% ఉండగా 2023లో అది 64%కి తగ్గినట్లు వివరించింది.
  • 2012 మదింపు ఏడాదితో పోలిస్తే 2023 నాటికి    13.6% మంది అల్పాదాయ విభాగం నుంచి పైకి ఎదిగినట్లు వెల్లడించింది.
  • రూ.5-10 లక్షల ఆదాయం ఉన్నవారి సంఖ్య 8.1%, రూ.10-20 లక్షల ఆదాయం ఉన్న వారి సంఖ్య 3.8%, రూ.20-50 లక్షల ఆదాయం ఉన్నవారి సంఖ్య 1.5%, రూ.50 లక్షలు-కోటి మధ్య ఆదాయ వర్గం 0.2%,   రూ.కోటికిపైగా ఆదాయం ఉన్నవారి నిష్పత్తి 0.02% పెరిగినట్లు వివరించింది.

వలసల కారణంగా 0.4% జీడీపీ కోల్పోనున్న ఏపీ

వలసల కారణంగా 6 రాష్ట్రాల జీఎస్‌డీపీ పెరిగితే, మరో 6 రాష్ట్రాల జీఎస్‌డీపీ తగ్గనున్నట్లు ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. వ్యక్తులు ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న చోటు, పాన్‌, ఆధార్‌కార్డుల్లో ఉన్న చిరునామాల ఆధారంగా ఈ వలసలను లెక్కించినట్లు పేర్కొంది. వీటి ప్రకారం కేరళ (2.5%), దిల్లీ (2.5%), తమిళనాడు (1.3%), గుజరాత్‌ (0.5%), కర్ణాటక (0.5%), మహారాష్ట్ర (0.4%) జీఎస్‌డీపీ 7.8% పెరిగితే.. ఉత్తర్‌ప్రదేశ్‌ (-2.5%), బిహార్‌ (-2.2%), రాజస్థాన్‌ (-1.0%), మధ్యప్రదేశ్‌ (-0.9%), ఒడిశా(-0.6%), ఆంధ్రప్రదేశ్‌ (-0.4%), పశ్చిమబెంగాల్‌(-0.2%)ల జీఎస్‌డీపీ 7.8% తగ్గనున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు