క్యాన్సర్‌.. ఆర్థిక భారం కాకుండా..

క్యాన్సర్‌.. పేరు వింటేనే భయపడే వ్యాధి. గత కొంతకాలంగా దీని బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చికిత్సకూ రూ.లక్షల్లోనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీన్ని తట్టుకోవడం అందరి వల్లా కాకపోవచ్చు. ఆరోగ్య బీమా పాలసీ ఉన్నా.. మొత్తం ఖర్చును చెల్లించకపోవచ్చు.

Updated : 23 Sep 2022 05:54 IST

క్యాన్సర్‌.. పేరు వింటేనే భయపడే వ్యాధి. గత కొంతకాలంగా దీని బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చికిత్సకూ రూ.లక్షల్లోనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీన్ని తట్టుకోవడం అందరి వల్లా కాకపోవచ్చు. ఆరోగ్య బీమా పాలసీ ఉన్నా.. మొత్తం ఖర్చును చెల్లించకపోవచ్చు. ఈ నేపథ్యంలో క్యాన్సర్‌ కోసం ప్రత్యేకంగా వస్తున్న పాలసీలను పరిశీలించాలి. 

క్యాన్సర్‌ చికిత్సకు సగటున రూ.20 లక్షలకు మించే ఖర్చు అవుతాయని ఒక అంచనా. ప్రథమ శ్రేణి నగరాలు, స్పెషాలిటీ ఆసుపత్రులలో ఇది ఇంతకు మించే ఉండొచ్చు. క్యాన్సర్‌ను గుర్తించిన దగ్గర్నుంచి పరీక్షల కోసమే రూ.లక్షలు అవుతుంటాయి. దీనికి తోడు దీర్ఘకాలం మందులు వాడుతూనే ఉండాలి. ఇవన్నీ మన ఆర్థిక పరిస్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. పొదుపు చేయడం తగ్గిపోతుంది. భవిష్యత్‌ లక్ష్యాలపై రాజీ పడాల్సిందే. ఈ సమస్యలు ఎదురు కాకుండా.. ఒక సమగ్ర ఆరోగ్య బీమాతోపాటు.. క్యాన్సర్‌ సంబంధిత చికిత్సల కోసం ప్రత్యేకంగా పాలసీ తీసుకోవడమూ ఇప్పుడు అవసరంగా మారింది.

తీవ్రమైన అనారోగ్యాల చికిత్సకు పరిహారం అందించే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలు అందుబాటులో ఉన్నా.. ప్రత్యేకంగా క్యాన్సర్‌ పాలసీని ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. 

వేచి ఉండే కాలం.. పాలసీ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల నుంచి వర్తిస్తుందనేది చూసుకోండి. సాధారణంగా 90 రోజుల తర్వాత పాలసీ వర్తిస్తుంది. కొన్ని పాలసీలు 180  రోజుల వరకూ వేచి చూసే సమయంగా పేర్కొంటున్నాయి. తక్కువ వ్యవధి ఉన్నవి ఎంచుకోవడం ఉత్తమం. వ్యాధిని గుర్తించిన తర్వాత కొన్ని రోజులు జీవించి ఉండాలనే నిబంధనా ఉంటుంది. దీని గురించీ స్పష్టంగా తెలుసుకోవాలి. సాధారణంగా ఇది 30 రోజుల ఉంచి 180 రోజుల వరకూ ఉంటుంది. 

అన్ని దశల్లోనూ.. కొన్ని పాలసీలు క్యాన్సర్‌ను గుర్తించగానే పరిహారం ఇస్తామని చెబుతాయి. మరికొన్ని వ్యాధి ముదిరిన తర్వాతే పరిహారం చెల్లిస్తాయి. కొన్ని పాలసీలు ప్రాథమిక దశలో కొంత మొత్తం, రెండో దశ, మూడో దశలో మిగతా పాలసీ విలువను అందిస్తాయి. క్యాన్సర్‌ను గుర్తించగానే పరిహారం చెల్లించే పాలసీలను తీసుకోవాలి. 

ఎన్ని రకాలకు.. క్యాన్సర్‌ వచ్చినప్పుడు దాని రకంతో సంబంధం లేకుండా పరిహారం అందించే పాలసీలను తీసుకోవడం ఉత్తమం. లేదా వీలైనన్ని ఎక్కువ రకాలకు వర్తించేలా ఉండాలి. 

అధిక మొత్తం.. దీర్ఘకాలిక, ఖరీదైన వ్యాధి కాబట్టి, పాలసీ మొత్తం వీలైనంత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. శస్త్రచికిత్స, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ తదితర చికిత్సల ఖర్చులను అంచనా వేసుకొని, పాలసీ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి. 

దీర్ఘకాలంపాటు.. వీలైనంత ఎక్కువ కాలం పాలసీ రక్షణ కొనసాగేలా చూసుకోవాలి. చాలా పాలసీలు ఇప్పుడు 80 ఏళ్ల వరకూ కవరేజీనిస్తున్నాయి. 

ఆరోగ్య బీమా పాలసీ ఉన్నప్పటికీ.. దీనికి తోడుగా ఒక క్యాన్సర్‌ పాలసీ లేదా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీనైనా తీసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అన్నది గుర్తించాలి. పాలసీ తీసుకునేటప్పుడు షరతులు, నిబంధనలను పూర్తిగా తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని