రూ.5 కోట్ల ఆరోగ్య బీమా

అంతర్జాతీయంగా ఎక్కడైనా సరే చికిత్స చేయించుకునేందుకు వీలు కల్పించేలా రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది.

Published : 16 Dec 2022 00:19 IST

అంతర్జాతీయంగా ఎక్కడైనా సరే చికిత్స చేయించుకునేందుకు వీలు కల్పించేలా రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. రిలయన్స్‌ హెల్త్‌ ఇన్ఫినిటీ పేరుతో తీసుకొచ్చిన ఈ పాలసీని కనీసం రూ.5లక్షల నుంచి రూ.5 కోట్ల వరకూ తీసుకునే వీలుంది. దీనికి మరో రూ.1.5 కోట్ల అనుబంధ పాలసీలనూ జోడించుకునే వీలుంది. ప్రసూతి ఖర్చులు, ఓపీడీ, ఎలాంటి పరిమితులు లేకుండా గది అద్దె చెల్లింపు, ఎయిర్‌ అంబులెన్స్‌ తదితర ప్రయోజనాలను ఈ పాలసీ కల్పిస్తుంది. కుటుంబంలోని 8 మందికి వర్తించేలా పాలసీని ఎంచుకోవచ్చు. ఏడాది, రెండు, మూడేళ్ల వ్యవధికి తీసుకోవచ్చు. 18-65 ఏళ్ల వారు పాలసీని తీసుకోవచ్చు. పిల్లలను 91 రోజునుంచి పాలసీలో చేర్పించవచ్చు. 55 ఏళ్లు దాటిన వారికి ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాతే పాలసీని ఇస్తుంది. క్రెడిట్‌ స్కోరు 750 దాటిన వారికి, బీఎంఐ సరిగ్గా ఉన్నవారికీ, మహిళా పాలసీదారులకు ప్రీమియంలో రాయితీని అందిస్తోంది.


ప్రభుత్వ సెక్యూరిటీల్లో...

క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నూతన గిల్ట్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది. క్వాంట్‌ గిల్ట్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 19. కనీస పెట్టుబడి రూ.5,000. దీనికి ఫండ్‌ మేనేజర్‌ సంజీవ్‌ శర్మ. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ‘డెట్‌ స్కీమ్‌’ తరగతికి చెందిన పథకం. ప్రధానంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడుతుంది. దాదాపు 80 శాతం సొమ్ము ప్రభుత్వ సెక్యూరిటీలకు కేటాయించి, మిగిలిన సొమ్మును జీ-సెక్‌ ఈటీఎఫ్‌లలో, ఇతర రుణ పత్రాల్లో పెట్టుబడి  పెట్టవచ్చు. ‘క్రిసిల్‌ డైనమిక్‌ గిల్ట్‌ ఇండెక్స్‌’  తో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. గిల్ట్‌ ఫండ్‌ కాబట్టి ఈ పథకంలో నష్టభయం దాదాపు లేదనే చెప్పాలి. రిస్కు లేకుండా స్థిరమైన ప్రతిఫలం సరిపోతుందనుకునే మదుపరులు ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.


తక్కువ నష్టభయంతో...

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ‘డెట్‌ స్కీమ్‌’ తరగతికి చెందిన కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని  ఆవిష్కరించింది. ఎస్‌బీఐ లాంగ్‌ డ్యూరేషన్‌ అనే ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ముగింపు తేదీ ఈ నెల 20. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. రుణ, మనీ మార్కెట్‌ పత్రాల్లో ఇది మదుపు చేస్తుంది. దాదాపు ఏడేళ్లకంటే ఎక్కువ కాల వ్యవధి  కల దీర్ఘకాలిక బాండ్లకు పెట్టుబడులు ఎక్కువగా కేటాయిస్తుంది. భారతీయ కంపెనీలు జారీ చేసే అమెరికన్‌ డిపాజిటరీ రిసీప్ట్స్‌/గ్లోబల్‌ డిపాజిటరీ రిసీప్ట్స్‌ వంటి పత్రాల్లోనూ పెట్టుబడులు పెడుతుంది. తద్వారా మదుపరులకు తక్కువ రిస్కుతో అధిక ప్రతిఫలాన్ని ఆర్జించేందుకు ప్రయత్నిస్తుంది. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బాండ్లపై ప్రతిఫలం తగ్గుతుంది. అదే సమయంలో వడ్డీ రేట్లు తగ్గితే బాండ్లపై రాబడి పెరుగుతుంది. అందువల్ల దీర్ఘకాలంలో వడ్డీ రేట్లు తగ్గితే లాంగ్‌ డ్యూరేషన్‌ పథకాల నుంచి మంచి ప్రతిఫలం లభిస్తుంది. ఈ పథకం స్వల్పకాలానికి కాకుండా పదేళ్ల కంటే ఎక్కువ కాలం పాటు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్న మదుపరులకు అనుకూలంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు