వెండిలో మదుపు చేద్దామా

నమ్మకమైన పెట్టుబడిగా బంగారానికి ఎంతో పేరుంది. ఇప్పుడు ఇదే కోవలో వెండికీ స్థానం లభిస్తోంది. చాలామంది వెండిని వస్తువుల రూపంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

Published : 08 Sep 2023 00:30 IST

నమ్మకమైన పెట్టుబడిగా బంగారానికి ఎంతో పేరుంది. ఇప్పుడు ఇదే కోవలో వెండికీ స్థానం లభిస్తోంది. చాలామంది వెండిని వస్తువుల రూపంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పరిశ్రమల్లోనూ దీని వినియోగం అధికంగానే ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడి, వైవిధ్యం కోసం చూస్తున్న వారు దీన్ని ఒక మదుపు సాధనంగా ఎంచుకునే అంశాన్ని పరిశీలించవచ్చు. సిల్వర్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్‌) ద్వారా వెండిలో సులభంగా మదుపు చేయొచ్చు.

సిడి, వెండి.. ఈ రెండింటికీ ఉన్న ప్రత్యేకత కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పెట్టుబడిదారులకూ ఈ రెండూ వైవిధ్యాన్ని అందిస్తాయి. బంగారంతో పోలిస్తే వెండి ధరలు ఎన్నో కారణాలపై ఆధారపడి ఉంటాయి. ఆర్థిక, పారిశ్రామిక వృద్ధిలాంటివీ దీనిపై ప్రభావం చూపిస్తుంటుంది.

సిల్వర్‌ ఈటీఎఫ్‌లు పెట్టుబడిదారులు అనుకూలమైన, సురక్షిత మార్గంలో వెండిలో పెట్టుబడి పెట్టే మార్గాన్ని అందిస్తాయి. తక్కువ పెట్టుబడి ఖర్చులు, సులభంగా మదుపు చేసే వీలు వల్ల వెండి ఈటీఎఫ్‌లు ఆదరణ పొందుతున్నాయి.

వీటిని దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలుగానే చూడాలి అని నిపుణులు పేర్కొంటున్నారు. స్వల్పకాలంలో వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అమెరికా, చైనా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం ఏర్పడినప్పుడు వీటి ధరలపై ప్రభావం పడుతుంది.  గ్రీన్‌ ఎనర్జీ, విద్యుత్‌ వాహనాల్లో వెండి వినియోగం పెరుగుతుంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమని చెప్పొచ్చు.

పెట్టుబడుల్లో వైవిధ్యం కోరుకునే మదుపరులు వెండి చారిత్రక పనితీరు, అనుకూలతలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒక సురక్షితమైన పెట్టుబడిగా దీన్ని గుర్తించొచ్చు. స్వల్పకాలిక లాభాల కోసం ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ మదుపు చేయొద్దు. వెండి ధరలు స్వల్పకాలంలో చాలా అస్థిరంగా ఉంటాయి. బంగారంతో పోలిస్తే ఇందులో నష్టభయమూ కొంత ఉంటుంది. కాబట్టి, ఇతర పెట్టుబడుల విషయంలో తీసుకునే జాగ్రత్తలు దీనికీ వర్తిస్తాయి. వెండిలో పెట్టుబడి పెట్టే ముందు వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలు, ఆర్థిక పరిస్థితిలాంటివి పరిగణనలోకి తీసుకోవాలి.

10 శాతం వరకూ..

బంగారం, వెండిలో పెట్టుబడులు మీ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వం, సమతుల్యతను అందించేందుకు దోహదం చేస్తాయని అర్థం చేసుకోవాలి. వీటిలో పెద్ద మొత్తంలో మదుపు చేయడం ఎప్పుడూ సరికాదు. పెట్టుబడులకు కేటాయించిన మొత్తంలో 10 శాతం వరకూ ఈ రెండు లోహాలకూ కేటాయించడం ఉత్తమం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని