Health Insurance ఆరోగ్య బీమా..తీసుకున్నారా?

కరోనా పేరు మళ్లీ వినిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాయి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది.

Updated : 22 Dec 2023 03:33 IST

 కరోనా పేరు మళ్లీ వినిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాయి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. అదే సమయంలో ఆర్థికంగానూ కొంత సిద్ధంగా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు చూద్దాం అనుకోకుండా, ఆరోగ్య బీమా పాలసీని వీలైనంత తొందరగా తీసుకోవడమే మంచిది.

 ఆరోగ్యంగానే ఉన్నాం కదా.. ఇప్పుడు ఈ పాలసీలు అవసరమా అనే భావనలో చాలామంది ఉంటారు. నిజానికి ఆరోగ్యంగా ఉన్నప్పుడే పాలసీ తీసుకోవాలి. ఒక్కసారి అనారోగ్యం బారిన పడిన తర్వాత వైద్య బీమా పాలసీ తీసుకోవడం అంత సులభం కాదు. నిబంధనలు, మినహాయింపులు మారిపోతాయి. ప్రీమియంలో లోడింగ్‌ విధించే అవకాశాలూ ఉంటాయి

  • అనుకోని ప్రమాదాలు, అనారోగ్యాలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆరోగ్య బీమా పాలసీ ఉపయోగపడుతుంది.
  •  పాలసీని చిన్న వయసులోనే తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఆసుపత్రిలో చేరకపోతే ప్రీమియం దండగ అనే ఆలోచన మంచిది కాదు.
  •  క్రమం తప్పకుండా పునరుద్ధరణ చేసుకోవాలి. అప్పుడే బీమా సంస్థలు ఎలాంటి అడ్డంకులూ లేకుండా క్లెయింను చెల్లిస్తాయి.
  •  తక్కువ ప్రీమియంతో లభించే పాలసీలు అన్నిసార్లూ మన అవసరాలకు సరిపోకపోవచ్చు. కాబట్టి, మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు మూడు సంస్థల పాలసీలను పోల్చి చూడండి. ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయా పాలసీలు ఏ విధంగా మీకు సహాయం చేస్తాయో పరిశీలించండి. ముఖ్యంగా సహ చెల్లింపు, ఉప పరిమితుల్లాంటివి తనిఖీ చేయండి.
  • ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే పాలసీ రక్షణ ప్రారంభం అవుతుంది. కొన్ని చికిత్సలకు 30 రోజుల తర్వాతే వర్తిస్తుంది. కొన్ని వ్యాధుల చికిత్సకు రెండు నుంచి మూడేళ్ల వరకూ వేచి ఉండే వ్యవధి ఉంటుంది. పాలసీ తీసుకున్న 15 రోజుల తర్వాతే కరోనా వ్యాధి చికిత్సకు పరిహారం అందిస్తాయి బీమా సంస్థలు.
  •  చాలామంది యాజమాన్యం అందించే బృంద బీమా పాలసీ ఉంది కదా.. ప్రత్యేకంగా పాలసీ ఎందుకు అని అంటుంటారు. బృంద బీమా పాలసీల్లో తల్లిదండ్రులకూ రక్షణ లభిస్తుంది. ఈ పాలసీల్లో వేచి ఉండే వ్యవధిలాంటి నిబంధనలు సాధారణంగా ఉండవు. ఉద్యోగంలో కొనసాగుతున్నప్పుడే బీమా రక్షణ ఉంటుంది. కాబట్టి, ఉద్యోగం మారే ఆలోచన ఉన్నవారు సొంతంగా ఒక పాలసీని తీసుకోవడమే మంచిది.

క్లెయిం తిరస్కరించకుండా..

ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేటప్పుడు మీ వైద్య చరిత్ర గురించి కచ్చితమైన సమాచారం ఇవ్వాలి. అన్ని వివరాలూ చెబితే పాలసీ ఇవ్వరని, అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని అనుకోవద్దు. ఆరోగ్య వివరాలు దాచిపెట్టి, పాలసీ తీసుకున్నా తర్వాత ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా ధూమపానం గురించి కచ్చితంగా పాలసీలో తెలియజేయాలి.
నిర్ణీత వ్యవధిలోగా బీమా కంపెనీకి సమాచారం ఇవ్వకపోతే మీ క్లెయింను తిరస్కరించే ఆస్కారం ఉంది. ఆసుపత్రిలో చేరినప్పుడు 24 గంటల్లోపు బీమా సంస్థకు వివరాలు తెలియజేయాలి. ఒకవేళ పాలసీదారుడు వివరాలు తెలియజేసే స్థితిలో లేకపోతే పాలసీదారుడి బదులుగా నామినీ లేదా అధీకృత వ్యక్తులు బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి.
ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకునేటప్పుడు దానికి సంబంధించిన అన్ని నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి. పాలసీ పత్రంలో ఉన్న వివరాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. ప్రతి ఆరోగ్య బీమా పాలసీలో ఎలాంటి పరిస్థితుల్లో బీమా వర్తించదు అనే వివరాలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి, భవిష్యత్తులో చిక్కులు ఎదురుకాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని