పన్ను ఆదాకు యులిప్‌ తీసుకోవచ్చా?

ఆదాయపు పన్ను మినహాయింపు కోసం రూ.60 వేల వరకూ మదుపు చేయాల్సి వస్తోంది. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) ఎంచుకుంటే బాగుంటుందని అంటున్నారు.

Updated : 22 Sep 2023 00:21 IST

  • ఆదాయపు పన్ను మినహాయింపు కోసం రూ.60 వేల వరకూ మదుపు చేయాల్సి వస్తోంది. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) ఎంచుకుంటే బాగుంటుందని అంటున్నారు. ఇది కాకుండా యులిప్‌ తీసుకుంటే మంచిదేనా? నాకు 52 ఏళ్లు. నేను ఏ పథకాలను ఎంచుకోవాలి?

శ్రీధర్‌

ముందుగా మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోండి. ఈ ప్రీమియానికి సెక్షన్‌ 80సీ కింద మినహాయింపు లభిస్తుంది. మిగతా మొత్తానికి ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఎంచుకోండి. వీటికి మూడేళ్ల లాకిన్‌ వ్యవధి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు రెండు రకాల పన్ను పద్ధతులు అమల్లో ఉన్నాయి. పాత పన్ను విధానం ఎంచుకుంటేనే మినహాయింపులతో అవసరం ఉంటుంది. ఒకసారి రెండు పన్ను పద్ధతులనూ పోల్చి చూసుకొని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. బీమా మాత్రం మర్చిపోవద్దు.


  • ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.35 వేలు వస్తున్నాయి. నా వయసు 22. మూడేళ్లపాటు నెలకు రూ.10 వేలు మదుపు చేయాలని ఆలోచిస్తున్నాను. దీనికోసం ఏం చేయాలి?

శ్వేత

సురక్షితంగా ఉండే పథకాల్లో మదుపు చేయాలనుకుంటే బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. కాస్త అధిక రాబడి రావాలి.. కొంత నష్టభయం ఉన్నా ఇబ్బంది లేదు అనుకుంటే.. బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ లేదా హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. మీరు పెట్టుబడిని మూడేళ్లపాటు పెట్టినా, మరో రెండేళ్ల వరకూ వాటిని అలాగే కొనసాగించండి. అప్పుడు మంచి మొత్తం జమ అవుతుంది.


  • మరో 4 నెలల్లో పదవీ విరమణ చేయబోతున్నాను. నెలకు కనీసం రూ.40 వేలు వచ్చేలా ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. దీనికోసం ఎంత మొత్తం అవసరం అవుతుంది?

కృష్ణారావు

మీకు నెలకు రూ.40వేలు రావాలంటే.. మీ దగ్గర కనీసం రూ.69 లక్షల వరకూ ఉండాలి. ఈ మొత్తాన్ని 7 శాతం రాబడి వచ్చేలా పెట్టుబడి పెట్టాలి. మీకు 60 ఏళ్లు ఉంటే.. పోస్టాఫీసు పెద్దల పొదుపు పథకంలో రూ.30 లక్షల వరకూ జమ చేయొచ్చు. నెలకు రూ.20వేల వరకూ వడ్డీ వస్తుంది. దీన్ని ప్రతి మూడు నెలలకోసారి చెల్లిస్తారు. దీంతోపాటు దీర్ఘకాలం పాటు బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలో మదుపు చేయండి. మీకు అవసరమైన మొత్తాన్ని క్రమానుగతంగా వెనక్కి తీసుకోండి.


  • నా వయసు 27. రూ.10 లక్షల వార్షిక వేతనం ఆర్జిస్తున్నాను. ఇప్పటివరకూ ఎలాంటి బీమా పాలసీలూ లేవు. రూ. కోటిన్నర వరకూ టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. సాధ్యమవుతుందా?

గోవింద్‌

టర్మ్‌ పాలసీ తీసుకోవాలన్న మీ ఆలోచన మంచిదే. సాధారణంగా బీమా సంస్థలు పాలసీదారుడి ఆదాయం, వయసు, ఇతర అంశాల ఆధారంగా వార్షికాదాయానికి 25 రెట్ల వరకూ టర్మ్‌ పాలసీని ఇస్తాయి. మీ వార్షికాదాయం రూ.10లక్షల వరకూ ఉంది. కాబట్టి, మీకు రూ.కోటిన్నర బీమా వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని ఒకే కంపెనీ నుంచి కాకుండా రూ.75 లక్షల చొప్పున రెండు బీమా సంస్థల నుంచి తీసుకోండి. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న బీమా సంస్థలను ఎంచుకోండి. దరఖాస్తు పత్రంలో మీ ఆరోగ్య వివరాలతోపాటు, ఇతర అంశాలన్నీ జాగ్రత్తగా నమోదు చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని