BEML ప్రైవేటీకరణకు డిసెంబరులో బిడ్ల ఆహ్వానం!

రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని ‘భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (BEML)’ ప్రైవేటీకరణకు ఆర్థిక బిడ్లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు....

Published : 30 Aug 2022 00:32 IST

దిల్లీ: రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని ‘భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (BEML)’ ప్రైవేటీకరణకు తుది ఆర్థిక బిడ్లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు త్రైమాసికంలో ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

BEML ఆస్తులను భూమి, కీలకేతర ఆస్తుల కింద విభజించి బీఈఎంఎల్‌ ల్యాండ్‌ అసెట్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఈ నెల ఆరంభంలో అనుమతించింది. ఈ పూర్తి ప్రక్రియ సెప్టెంబరు ఆఖరు లేదా అక్టోబరు తొలినాళ్లలో పూర్తవుతుందని తెలిపింది. ఆ తర్వాతే ఆర్థిక బిడ్లను ఆహ్వానిస్తామని అధికారి తెలిపారు. షేర్ల కొనుగోలు ఒప్పంద ముసాయిదాను కూడా అదే సమయంలో ఖరారు చేస్తారని పేర్కొన్నారు.

BEMLలో యాజమాన్య నియంత్రణ సహా 26 శాతం వాటాల విక్రయానికి ప్రభుత్వం గత ఏడాది జనవరిలో ప్రాథమిక బిడ్లను ఆహ్వానించింది. అనేక ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు అందాయి. దీంతో పెట్టుబడిదారుల సూచనల మేరకు ఆస్తుల విభజన ప్రక్రియను ప్రారంభించారు. ఇది పూర్తయితే, తుది బిడ్లను ఆహ్వానిస్తామని సదరు అధికారి తెలిపారు.

ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం BEMLలో 26 శాతం వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.2,000 ఆదాయం సమకూరనుంది. 2016లో ఈ కంపెనీలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు రూ.24,544 కోట్లను సమీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని