Union Budget 2024: స్మార్ట్‌ఫోన్‌ పరికరాల దిగుమతిపై సుంకాలు తగ్గించొద్దు: GTRI

Union Budget 2024: స్మార్ట్‌ఫోన్ల తయారీ కోసం దిగుమతి చేసుకుంటున్న పరికరాలపై సుంకాలను తగ్గించొద్దని వచ్చే బడ్జెట్‌పై అంచనాల్లో భాగంగా జీటీఆర్‌ఐ ప్రభుత్వానికి సూచించింది.

Updated : 29 Jan 2024 16:42 IST

దిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ తయారీలో ఉపయోగించే పరికరాల దిగుమతిపై భారత్‌ ప్రస్తుతం సుంకాలు విధిస్తోంది. దేశీయంగా తయారీదారులను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. అయితే, వచ్చే బడ్జెట్‌లో (Union Budget 2024) ఈ సుంకాల్లో ఎలాంటి కోత పెట్టొద్దని ‘గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (GTRI)’ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థ సత్ఫలితాలిస్తున్న నేపథ్యంలో ఎలాంటి మార్పులు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. లేదంటే భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో నమోదవుతున్న వృద్ధి దెబ్బతింటుందని వివరించింది. స్మార్ట్‌ఫోన్‌ పరికరాల దిగుమతిపై ప్రస్తుతం 7.5 నుంచి 10 శాతం సుంకం అమలవుతోంది.

దిగుమతి చేసుకున్న పరికరాలతో తయారుచేసిన వస్తువులను ఎగుమతి చేసేటట్లయితే సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వొచ్చని జీటీఆర్‌ఐ సూచించింది. అలాకాక భారత్‌లోనే విక్రయిస్తే మాత్రం టారిఫ్‌లు ఉండాల్సిందేనని తెలిపింది. ఇందుకోసం ముందస్తు అనుమతి, ఎగుమతి ఆధారిత సెజ్‌ల ఏర్పాటు వంటి విధానాలను అవలంబించొచ్చని వివరించింది. 2022లో 7.2 బిలియన్‌ డాలర్లు విలువ చేసే స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి కాగా.. 2023 నాటికి ఆ విలువ 13.9 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు గుర్తుచేసింది. భారత్‌లో అమ్ముడైన ఫోన్లలో 98 శాతం దేశీయంగా తయారుచేసినవేనని పేర్కొంది. ‘ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల పథకం (PLI scheme)’ వల్లే ఇది సాధ్యమైనట్లు వివరించింది.

యాపిల్‌ వంటి దిగ్గజ సంస్థలు సెజ్‌లలోని వసతులను ఉపయోగించుకొని తయారీ చేపడుతున్నాయని జీటీఆర్‌ఐ తెలిపింది. వాటిని ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నాయని పేర్కొంది. దీంతో కంపెనీ దిగుమతి చేసుకుంటున్న పరికరాలపై ఎలాంటి సుంకం ఉండడం లేదని వెల్లడించింది. యాపిల్‌ భారత్‌లో ఫాక్స్‌కాన్‌, విస్ట్రాన్‌ కాంట్రాక్ట్‌ తయారీ సంస్థల ద్వారా ఉత్పత్తి చేపడుతోంది. ఈ రెండు కంపెనీల యూనిట్లు సెజ్‌లలో ఉన్నాయి. మరోవైపు దేశీయంగా విక్రయాలు చేపట్టే వస్తువుల్లో ఉపయోగించే పరికరాలపై సుంకం ఎత్తివేస్తే స్థానికంగా పలు అసెంబ్లింగ్‌ కేంద్రాలు పుట్టుకొస్తాయని వివరించింది. దీనివల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థకు కలిగే ప్రయోజనం చాలా తక్కువని తెలిపింది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఎత్తివేస్తే అవన్నీ కనుమరుగవుతాయని పేర్కొంది.

ఎలక్ట్రానిక్‌ పరికరాల దిగుమతి బిల్లు 24.4 బిలియన్‌ డాలర్ల నుంచి 30.7 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు జీటీఆర్‌ఐ తెలిపింది. దేశీయ తయారీ కేంద్రాల్లో దిగుమతి చేసుకున్న పరికరాలను అధికంగా ఉపయోగించడమే దీనికి కారణమని పేర్కొంది. ఈ తరుణంలో సుంకాలను ఎత్తివేస్తే కంపెనీలన్నీ పూర్తిగా పరికరాల దిగుమతిపైనే ఆధారపడతాయని.. కేవలం అసెంబ్లింగ్ మాత్రమే ఇక్కడ చేపడతాయని వివరించింది. సుంకాలు అలాగే కొనసాగిస్తే రానున్న రోజుల్లో పరికరాల తయారీ సైతం దేశీయంగా చేపట్టే అవకాశం ఉందని వివరించింది.

‘ఇండియా సెల్యులార్‌ అండ్ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌’ (ICEA) డిమాండ్‌ మాత్రం జీటీఆర్‌ఐ వాదనకు భిన్నంగా ఉంది. దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే దేశీయంగా ఫోన్ల తయారీ విలువ 28 శాతం పెరిగి 82 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. దీనివల్ల ఎగుమతులు భారీగా పుంజుకుంటాయని వివరించింది.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని