Hyundai: జనరల్‌ మోటార్స్‌ ప్లాంట్‌ కొనుగోలుకు హ్యుందాయ్‌ ఒప్పందం

Hyundai: మహారాష్ట్రలో ఉన్న తలెగావ్‌లోని జనరల్‌ మోటార్స్‌ ( General Motors India) తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేసేందుకు ‘టర్మ్‌ షీట్‌’పై సంతకం చేసినట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (Hyundai Motor India) లిమిటెడ్‌ సోమవారం ప్రకటించింది.

Published : 13 Mar 2023 13:46 IST

దిల్లీ: మహారాష్ట్రలో ఉన్న తలెగావ్‌లోని జనరల్‌ మోటార్స్‌ ( General Motors India) తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేసేందుకు ‘టర్మ్‌ షీట్‌’పై సంతకం చేసినట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (Hyundai Motor India- HMIL) లిమిటెడ్‌ సోమవారం ప్రకటించింది. భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర సామగ్రి.. కొనుగోలు ఒప్పందంలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందం విలువ ఎంత అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ ఒప్పందం ఇంకా ప్రాథమిక దశ మాత్రమేనని పేర్కొంది. నియంత్రణా సంస్థల అనుమతికి ముందే ఇంకా కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపింది. అవన్నీ ఖరారైతేనే కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేసింది.

హ్యుందాయ్ మోటార్‌ ఇండియా (Hyundai Motor India) గత 26 ఏళ్లుగా చెన్నై ప్లాంట్‌లోనే వాహనాల తయారీ చేపడుతోంది. ఆ ప్లాంట్‌ వార్షిక సామర్థ్యం 7.50 లక్షల యూనిట్లు. గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో తయారీ సామర్థ్యాన్ని సైతం పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. పైగా హ్యుందాయ్‌ మోటార్‌ కార్పొరేషన్‌కు హెచ్‌ఎంఐఎల్‌ ప్రధాన ఎగుమతి వనరుగా ఉంది. ప్రస్తుతం ఇక్కడి నుంచే ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్‌ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా- పసిఫిక్‌ ప్రాంతాలకు వాహనాలు ఎగుమతి అవుతున్నాయి. హైదరాబాద్‌లో హ్యుందాయ్‌కి పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని