Boeing 737 Max: అమెరికా నిర్ణయం.. భారత వైమానిక రంగానికి బ్యాడ్‌ న్యూస్‌

బోయింగ్‌పై అమెరికాలో ఎఫ్‌ఏఏ విధించిన ఆంక్షలు భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. దీంతో మూడు ప్రధాన విమానయాన సంస్థలకు డెలివరీలు జాప్యం కావచ్చు. 

Published : 26 Jan 2024 17:09 IST

ఇంటర్నెట్‌డెస్క్: బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల తయారీని పరిమితం చేయాలంటూ అమెరికా వైమానిక రంగ నియంత్రణ సంస్థ తీసుకొన్న నిర్ణయం భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, స్పైస్‌జెట్‌, ఆకాశ్‌ ఎయిర్‌ సంస్థలు వందల సంఖ్యలో ఈ విమానాల కొనుగోలుకు ఆర్డర్లు పెట్టాయి. 

ఇటీవల అలస్కా ఎయిర్‌లైన్స్‌ విమానం గాల్లో ఉండగానే డోర్‌ప్లగ్‌ ఊడిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. నాణ్యతాపరంగా ఇప్పటికే మ్యాక్స్ విమానాల్లో పలు లోపాలు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 737 మ్యాక్స్ విమానాల తయారీని విస్తరించొద్దని తాజాగా అమెరికా ఎఫ్‌ఏఏ (ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌) ఆదేశించింది. ‘‘ఈ విమానాల తయారీ విస్తరణకు సంబంధించి బోయింగ్‌ నుంచి వచ్చే ఏ ప్రతిపాదనలను మేం అంగీకరించం. తనిఖీల్లో విమానాల నాణ్యత సంతృప్తికరంగా ఉందని మేం భావించేవరకు ఇలానే కొనసాగుతుంది’’ అని ఎఫ్‌ఏఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

ఈ నిర్ణయం భారత్‌లోని మూడు ప్రధాన విమానయాన సంస్థల ఆర్డర్లపై ప్రభావం చూపనుంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ 181 విమానాలను గతేడాది ఆర్డర్‌ చేసింది. ఇక ఆకాశ్ఎ‌యిర్‌ 204,  స్పైస్‌ 142 ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు ఒప్పందాలు జరిగాయి. వీటి డెలివరీలపై ఎఫ్‌ఏఏ నిర్ణయం ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్‌కు చెందిన డీజీసీఏ ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్న 737 శ్రేణి విమానాల్లో తనిఖీలను పూర్తి చేసింది. దేశంలో వాడుతున్న మొత్తం 40 విమానాలకు గాను ఒక దానిలో చిన్న వాషర్‌ లేనట్లు గుర్తించారు. 

 కొత్తగా అప్పు తీసుకుంటున్నారా?

ఐదేళ్ల క్రితం నెలల వ్యవధిలోనే ఇండోనేషియా, ఇథియోపియాల్లో రెండు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు కూలి 346 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 20 నెలల పాటు ఈ రకం విమానాలను పక్కనపెట్టారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కార్పొరేట్‌ విషాదంగా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని