Railway Insurance: రైలు ప్రయాణమా.. రూ.10 లక్షల బీమా.. ఈ విషయాలు తెలుసుకోండి!

రైలు ప్రయాణం చేసేవారికి రూ.10 లక్షల బీమా సౌకర్యం ఉంటుంది. అయితే, టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే ఆ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

Published : 30 Dec 2022 15:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విహార యాత్ర, శుభకార్యాలు, పుణ్యక్షేత్రాల సందర్శన.. ఇలా జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం రైలు ప్రయాణం చేస్తుంటాం. 1,10,000 కి.మీ నెట్‌వర్క్‌తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశం భారత్‌. తక్కువ ధరలో అత్యధిక మందికి అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గం ఇది. నిత్యం వేలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం భారత రైల్వే విభాగం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రయాణ సమయంలో ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే.. బీమా సదుపాయం కూడా కల్పిస్తోంది.

అయితే, చాలా మంది టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలో ఇన్సూరెన్స్‌ ఆప్షన్‌ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రమాదాల గురించి అప్పుడప్పుడూ వింటూనే ఉన్నా.. బీమా తీసుకోవడంపై మాత్రం పెద్దగా శ్రద్ధ పెట్టరు. కానీ, ఊహించని ప్రమాదం సంభవిస్తే కష్టసమయంలో కుటుంబానికి భరోసా ఉండాలంటే బీమా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలోనే ఐఆర్‌సీటీసీ ‘ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ’ పేరిట ప్రయాణికులకు బీమా సదుపాయం కల్పిస్తోంది. కేవలం 35 పైసలతో రూ.10 లక్షల బీమా అందిస్తోంది.

  • ప్రయాణికుడు మరణించినా లేక శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ.10 లక్షల బీమా
  • పాక్షిక అంగవైకల్యానికి రూ.7.50 లక్షలు
  • గాయాలపాలైతే ఆసుపత్రి ఖర్చులకు రూ.2 లక్షలు
  • ప్రమాదవశాత్తూ ప్రయాణికుడు మరణిస్తే మృతదేహ తరలింపు ఖర్చుల కింద రూ.10,000

ఉగ్రవాద దాడులు, దొంగతనం, దోపిడీ, అల్లర్లు, ప్రమాదవశాత్తూ ప్రయాణికుడు రైలు నుంచి పడిపోవడం, రైళ్లు ఢీకొనడం, పట్టాలు తప్పడం.. వంటి ప్రమాదాలన్నింటికీ బీమా వర్తిస్తుంది. అయినప్పటికీ.. టికెట్‌ బుక్‌ చేసుకునే ముందు ఒకసారి బీమా కల్పిస్తున్న సంస్థ నియమ నిబంధనలు, షరతులను క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది.

ఎవరు అర్హులు..

భారత రైల్వేలో ప్రయాణించే ఎవరైనా ఈ బీమా సదుపాయాన్ని పొందొచ్చు. అయితే, ఆన్‌లైన్‌ లేదా మొబైల్‌ యాప్‌లో రిజర్వేషన్‌ చేసుకునే వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. విదేశీయులు, ఐదేళ్లలోపు పిల్లలు బీమా సదుపాయానికి అర్హులు కాదు. ఇన్సూరెన్స్‌ ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేసుకొని టికెట్‌ బుక్‌ చేసుకుంటే కన్ఫర్మ్‌ అయిన వెంటనే మీ మొబైల్‌, ఇ-మెయిల్‌కు సందేశం వస్తుంది. తర్వాత నామినీ వివరాలు నమోదు చేయడానికి ఓ లింక్‌ను కూడా పంపుతారు. క్యాన్సిల్‌ చేసుకోవడానికి వీలుండదు. ఒకే పీఎన్‌ఆర్‌ కింద చేసుకునే అన్ని బుకింగ్స్‌కు బీమా వర్తిస్తుంది.

ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా చేసుకునే బుకింగ్స్‌కు మాత్రమే ఈ బీమా సదుపాయం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ సదుపాయం లేనివారు ఈ సౌకర్యాన్ని పొందలేరు. అలాగే నేరుగా రైల్వేస్టేషన్‌కి వెళ్లి కౌంటర్‌లో టికెట్‌ తీసుకున్నా బీమా ఉండదు.

కేవలం భారతీయులకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. భారత్‌లో పనిచేస్తున్న లేదా పర్యటిస్తున్న విదేశీయులు బీమా తీసుకోవడానికి వీలులేదు.

మరణం, అంగవైకల్యం, గాయాలు.. వీటికి మాత్రమే బీమా వర్తిస్తుంది. లగేజీ చోరీ, రైలు ఆలస్యం వల్ల సంభవించే నష్టం, రైలు ఆలస్యమైనప్పుడు అయ్యే నివాస, భోజన ఖర్చులకు బీమా ఉండదు.

ఐఆర్‌సీటీసీ ఎంపిక చేసిన కొన్ని కంపెనీలు మాత్రమే బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. మనకు నచ్చిన సంస్థ నుంచి ఇన్సూరెన్స్‌ తీసుకునే అవకాశం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని