Russian Crude Oil: భారత్‌కు రష్యా చమురు.. 7 నెలల కనిష్ఠానికి దిగుమతులు

Russian Crude Oil: వర్షాకాలం నేపథ్యంలో చమురుకు గిరాకీ తగ్గింది. దీంతో రష్యా నుంచి దిగుమతి అవుతున్న చమురు పరిమాణం సైతం తగ్గుతూ వస్తోంది.

Published : 03 Sep 2023 15:20 IST

దిల్లీ: రష్యా నుంచి భారత చమురు దిగుమతులు (Imports of Russian oil) వరుసగా మూడోనెలా తగ్గాయి. ఆగస్టులో ఏడు నెలల కనిష్ఠానికి తగ్గాయి. రోజుకి 1.46 మిలియన్‌ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. అంతక్రితం నెల ఇది 1.91 మిలియన్‌ బ్యారెళ్లుగా నమోదైంది.

భారత చమురు శుద్ధి సంస్థలు ఇరాక్‌ నుంచి కూడా చమురు దిగుమతుల (Imports of Crude oil)ను తగ్గించుకున్నాయి. జులైలో రోజుకి 8.91 లక్షల బ్యారెళ్ల చమురు రాగా.. ఆగస్టులో అది 8.66 లక్షల బ్యారెళ్లకు తగ్గింది. అయితే, సౌదీ నుంచి వస్తున్న చమురు రోజుకి 4.84 లక్షల బ్యారెళ్ల నుంచి 8.20 లక్షల బ్యారెళ్లకు పెరగడం గమనార్హం. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా చమురుపై ఐరోపా దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో రష్యా తక్కువ ధరకే చమురు విక్రయించడం ప్రారంభించింది. దేశ ప్రయోజనాలరీత్యా దీన్ని అదనుగా భావించిన భారత్‌.. పెద్ద మొత్తంలో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది మే నెలలో గరిష్ఠంగా రోజుకి రెండు మిలియన్‌ బ్యారెళ్లు భారత్‌కు అందాయి. అయితే, వర్షాకాలం నేపథ్యంలో డిమాండ్‌ తగ్గుముఖం పట్టడంతో దిగుమతులు సైతం తగ్గుతూ వస్తున్నాయి. మరోవైపు కొన్ని సంస్థలు వార్షిక మరమ్మతులో భాగంగా శుద్ధి ప్రక్రియను పరిమితం చేసుకున్నాయి. ఇది కూడా దిగమతులు తగ్గడానికి ఓ కారణం.

మొత్తంగా భారత చమురు దిగుమతులు ఆగస్టులో రోజుకి 4.35 మిలియన్‌ బ్యారెళ్లకు తగ్గాయి. క్రితం నెలతో పోలిస్తే 7 శాతం తగ్గుదల నమోదైంది. అక్టోబర్‌ నుంచి చమురుకు డిమాండ్‌ తిరిగి పుంజుకుంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని