బ్యాటరీ లైఫ్‌పై యాపిల్‌ ఫోకస్‌.. బిగ్‌ బ్యాటరీతో ఐఫోన్‌ 15 సిరీస్‌!

iPhone 15 series with Larger Batteries: యాపిల్ త్వరలో తీసుకురాబోతున్న ఐఫోన్‌ 15 సిరీస్‌లో బ్యాటరీ లైఫ్‌పై యాపిల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే, కెమెరా విషయంలోనూ కొన్ని మార్పులు తీసుకురానుంది.

Published : 05 Jul 2023 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ ఐఫోన్లు అనగానే ప్రీమియం క్వాలిటీకి పెట్టింది పేరు. హుందాతనానికి సింబాలిక్‌గా భావించి చాలా మంది ఈ ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే, యాపిల్‌ ఐఫోన్ల విషయంలో ఇప్పటికీ చాలా మందికి ఉన్న ఫిర్యాదు ఏంటంటే.. దీంట్లో వినియోగించే బ్యాటరీ. ఆండ్రాయిడ్‌ ఫోన్లతో పోలిస్తే బ్యాటరీ లైఫ్‌ యాపిల్‌ ఫోన్లలో తక్కువ. అలాగని యాపిల్‌ ఎప్పుడూ తమ ఫోన్లలో ఇంత సామర్థ్యంతో కూడిన బ్యాటరీ వినియోగించామని ఎప్పుడూ పేర్కొన్నదీ లేదు. అయితే, ఏళ్లుగా ఉన్న వినియోగదారుల నుంచి ఈ ఫిర్యాదును తాజాగా యాపిల్‌ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో తీసుకురాబోయే ఐఫోన్‌ 15 సిరీస్‌లో (iPhone 15) బ్యాటరీపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

యాపిల్‌ తన ఐఫోన్‌ 15 సిరీస్‌లో నాలుగు ఫోన్లను తీసుకొస్తోంది. ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ పేరుతో వీటిని ఈ ఏడాది లాంచ్‌ చేయనుంది. అయితే వీటిలో వినియోగించే బ్యాటరీకి సంబంధించి కీలక సమాచారం బయటకొచ్చింది. ఈ సారి ఐఫోన్లలో బ్యాటరీ పరిమాణంపై యాపిల్‌ ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ 15 సిరీస్‌లో బేస్‌ మోడల్‌లో ఈ సారి 3,877mAh బ్యాటరీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ 14లో 3,279mAh బ్యాటరీని ఇచ్చారు. అలాగే ఐఫోన్‌ 14 ప్లస్‌లో 4,323mAh బ్యాటరీని వినియోగించగా.. ఐఫోన్‌ 15 ప్లస్‌ను 4,912mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారని తెలిసింది. ఐఫోన్‌ 14 ప్రోలో 3200 mAh బ్యాటరీ ఇవ్వగా.. 15 ప్రోలో 3,877mAh ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌లో 4,323mAh బ్యాటరీని ఇవ్వగా.. 15 ప్రో మ్యాక్స్‌ను ఏకంగా 4,852mAh బ్యాటరీతో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

కేవలం బ్యాటరీపైనే కాకుండా కెమెరా విషయంలో యాపిల్‌ కొన్ని మార్పులు చేయబోతోంది. గతేడాది రిలీజ్‌ చేసిన ఐఫోన్‌ 14 సిరీస్‌లో ఐఫోన్‌ 14, 14 ప్లస్‌ మోడళ్లలో కేవలం 12 ఎంపీ కెమెరాను మాత్రమే అమర్చారు. మిగిలిన వాటిలో 48 ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఈసారి అన్ని మోడళ్లలోనూ 48 మెగాపిక్సల్‌ ప్రధాన కెమెరా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పైగా  రెండో జనరేషన్‌ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ అందించనున్నారని సమాచారం. వీటితో పాటు కొత్తగా ఐఫోన్‌ 15 సిరీస్‌లో ఇంకేం మార్పులు తీసుకొస్తున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని