SBI Services: ఎస్‌బీఐ సర్వర్‌ డౌన్‌? ఆన్‌లైన్‌ సేవల్లో అంతరాయం!

SBI Services: ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ సేవల్లో అంతరాయం వస్తున్నట్లు పలువురు కస్టమర్లు సోషల్‌ మీడియా వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు.

Updated : 03 Apr 2023 16:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)’ ఆన్‌లైన్‌ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. యూపీఐ లావాదేవీలు, నెట్‌ బ్యాంకింగ్‌, అధికారిక యోనో యాప్‌.. వినియోగంలో సమస్యలు తలెత్తుతున్నట్లు పలువురు కస్టమర్లు సోషల్‌ మీడియా వేదికగా తమ అసౌకర్యాన్ని తెలియజేశారు.

ఔటేజ్‌ ట్రాకింగ్ వెబ్‌సైట్‌ డౌన్‌ డిటెక్టర్‌ ఇండియా సైతం ఎస్‌బీఐ (SBI) కస్టమర్లు సమస్యను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఈరోజు ఉదయం దాదాపు 9 గంటల నుంచి కస్టమర్ల ఫిర్యాదులు ప్రారంభమైనట్లు తెలిపింది. కొంత మంది మాత్రం ఆదివారం నుంచే తాము సమస్య ఎదుర్కొంటున్నట్లు ట్విటర్‌లో రాసుకొచ్చారు. మరికొందరైతే రెండు, మూడు రోజుల నుంచి తాము ఎస్‌బీఐ (SBI) ఆన్‌లైన్‌ లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఎస్‌బీఐ (SBI) తమ ఆన్‌లైన్‌ సేవలకు ఏప్రిల్‌ ఒకటో తేదీన స్వల్ప విరామం ఇచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యోనో లైట్‌, యోనో బిజినెస్‌, యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని ట్విటర్‌ వేదికగా ప్రకటన విడుదల చేసింది. వార్షిక ఖాతాల ముగింపు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అయితే, అప్పటి నుంచి తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు కస్టమర్లు ట్విటర్‌లో పేర్కొనడం గమనార్హం.

దీనిపై ఇప్పటి వరకు ఎస్‌బీఐ (SBI) మాత్రం స్పందించలేదు. దీనిపై కస్టమర్లు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు సేవల్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తారని ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని