PSB: ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!

ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భవిష్యత్‌ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది.

Updated : 26 May 2024 15:50 IST

ఎన్నికల తర్వాత కొన్ని బ్యాంకుల విలీనం
ఆర్థిక శాఖ వర్గాల వెల్లడి

దిల్లీ: ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భవిష్యత్‌ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. ప్రైవేటీకరణకు బదులుగా, మరికొన్ని పీఎస్‌బీల విలీనం ద్వారానే బ్యాంకింగ్‌ రంగాన్ని బలోపేతం చేయాలని చూస్తోంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులను విలీనం చేసి, పెద్ద బ్యాంకులుగా మార్చడాన్ని ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు గుర్తు చేశారు. 2021-22 సాధారణ బడ్జెట్‌లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రణాళికలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించినా, అమలు కాలేదు. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా విక్రయించడంలోనూ విఫలమయ్యారు. పీఎస్‌బీలను కొనుగోలు చేసేందుకు, ఆసక్తి-తగిన పెట్టుబడులున్న వారు లభించడంపైనా ధీమా లేనందునే, ప్రైవేటీకరణ ప్రణాళికపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా విక్రయిస్తే గనుక, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు మార్గం సులభతరం అవుతుందని భావించారు. అయితే కొవిడ్‌ పరిణామాలు, పీఎస్‌బీలపై పెట్టుబడిదార్లలో ఆసక్తి తగ్గడం ప్రతికూల ప్రభావం చూపాయి. 

గత రెండేళ్లలో లాభాల పంట 

గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు మంచి లాభాలను నమోదుచేశాయి. ఒక సమయంలో మొండి బకాయిలతో కుదేలైన ఈ బ్యాంకులు, ప్రస్తుతం గణనీయంగా పుంజుకున్నాయి. 2016-17 నుంచి 2021-22 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులకు దాదాపు రూ.3 లక్షల కోట్ల మూలధన సాయాన్ని ప్రభుత్వం అందించింది. కొన్ని త్రైమాసికాలుగా ఇవి ఆకర్షణీయ ఫలితాలను నమోదు చేయడంతో పాటు ప్రభుత్వానికి భారీగా డివిడెండ్‌ చెల్లిస్తున్నాయి. 2023-24లో 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.1.4 లక్షల కోట్లుగా నమోదైంది. 2022-23లో బ్యాంకులు ఆర్జించిన రూ.1 లక్ష కోట్లతో పోలిస్తే ఇది 35% అధికం. 

ప్రజా వాటా నిబంధన అందుకునేందుకూ

ప్రభుత్వ రంగంలోని పెద్ద బ్యాంకులతో కొన్ని చిన్న బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తే, సెబీ ప్రజా వాటా నిబంధనలను అందుకునేందుకూ దోహదపడనుంది. అన్ని నమోదిత సంస్థల్లో కనీసం 25% ప్రజా వాటా ఉండాలన్నది సెబీ నిబంధన. ప్రస్తుతం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా, ప్రజా వాటా నిబంధనలను 5 బ్యాంకులు అందుకోవడం లేదు. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 13.54%, సెంట్రల్‌ బ్యాంక్‌లో 6.92%, యూకో బ్యాంక్‌ 4.61%, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ 3.62%, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లో 1.75% చొప్పునే ప్రజలకు వాటాలు ఉండటం గమనార్హం.


ప్రైవేటీకరణ లేదా విలీనంపై స్పందించలేం

ఆర్థిక సేవల కార్యదర్శి ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం లేదా ప్రైవేటీకరణపై స్పందించలేమని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్‌ జోషి పేర్కొన్నారు. ఇటువంటి అంశాలపై ఇప్పుడు మాట్లాడటం సరికాదని అన్నారు. ఇప్పటి వరకు రెండు దఫాల్లో బ్యాంకుల విలీనాలను ప్రభుత్వం చేపట్టింది. 2019 ఏప్రిల్‌ 1న విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనమయ్యాయి. 2020 ఏప్రిల్‌ 1న మరో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి 4 పెద్ద బ్యాంకులుగా ఏర్పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు