ఫ్లెక్సీ క్యాప్‌.. మల్టీ క్యాప్‌.. పెట్టుబడి ఏ విభాగంలో?

పెట్టుబడులు పెట్టేవారికి అందుబాటులో ఉన్న మ్యూచువల్‌ఫండ్‌ పథకాల్లో ఇప్పుడు మల్టీక్యాప్‌, ఫ్లెక్సీ క్యాప్‌ అందరినీ ఆకర్షిస్తున్నాయి.

Updated : 22 Sep 2023 02:01 IST

పెట్టుబడులు పెట్టేవారికి అందుబాటులో ఉన్న మ్యూచువల్‌ఫండ్‌ పథకాల్లో ఇప్పుడు మల్టీక్యాప్‌, ఫ్లెక్సీ క్యాప్‌ అందరినీ ఆకర్షిస్తున్నాయి. పలు ఫండ్‌ కంపెనీలు ఇటీవలి కాలంలో వీటిలో కొత్త ఫండ్లను తీసుకొచ్చాయి. వీటిలోకి పెట్టుబడులూ పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో మదుపరుల అవసరాలకు ఏది సరిపోతుందో తెలుసుకుందాం.

మార్కెట్లో ఎన్నో కంపెనీల షేర్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో సెబీ మార్గదర్శకాల ప్రకారం వివిధ మార్కెట్‌ క్యాపిటలైజేషన్లలో అంటే.. లార్జ్‌ క్యాప్‌ (మార్కెట్‌ విలువ పరంగా మొదటి 100 కంపెనీలు), మిడ్‌ క్యాప్‌ ( 101 నుంచి 250 వరకూ), స్మాల్‌ క్యాప్‌ (251 నుంచి) షేర్లలో మదుపు చేసే వాటిని మల్టీ క్యాప్‌ ఫండ్లుగా పిలుస్తారు. ప్రతి తరగతిలో కనీసం 25 శాతం పెట్టుబడులు పెడుతుంది. ఫ్లెక్సీ క్యాప్‌ విషయానికి వస్తే... వృద్ధి అవకాశాలు ఎక్కడ ఉన్నాయో గమనిస్తూ ఫండ్‌ మేనేజర్లు పెట్టుబడులు పెడుతుంటారు. ఏ తరగతిలో ఎంత మదుపు చేయాలనే విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

మల్టీ క్యాప్‌ ఫండ్లు లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు తప్పనిసరిగా కేటాయింపులు చేయాలి. కాబట్టి, అంతర్నిర్మిత వైవిధ్యతను అందిస్తాయి. దీనివల్ల అధిక రాబడి అవకాశం ఇస్తుంది.  అదే సమయంలో మార్కెట్లోని ఒక విభాగం పనితీరు అంత బాగాలేనప్పుడు ఫండ్‌ మేనేజర్లకు తమ వ్యూహాలను అమలు చేసేందుకు తక్కువ అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు 50 శాతం కేటాయింపులు ఉండటం వల్ల కొన్నిసార్లు అస్థిరతకు కారణం కావచ్చు. కాబట్టి, స్వల్పకాలంలో కాస్త నష్టభయం ఉంటుంది.

ఫ్లెక్సీ క్యాప్‌ విషయానికి వస్తే.. పెట్టుబడుల కేటాయింపుల పరంగా ఫండ్‌ మేనేజర్లకు కొంత సౌలభ్యాన్ని అందిస్తాయి. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ప్రతిస్పందించేందుకు వీలు కల్పిస్తాయి. సాధారణంగా లార్జ్‌ క్యాప్‌ షేర్లలో అధికంగా మదుపు చేస్తుంటాయి. దీనివల్ల పోర్ట్‌ఫోలియోకు కొంత స్థిరత్వం వస్తుంది. అస్థిరమైన మార్కెట్‌ పరిస్థితుల్లోనూ ఫండ్‌ మేనేజర్‌ సురక్షిత ఆస్తులకు మార్చుకోవచ్చు. కాబట్టి, అనిశ్చిత మార్కెట్‌ పరిస్థితులకు ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లు సరిపోతాయి. ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ పనితీరు ఫండ్‌ మేనేజర్‌ నైపుణ్యాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఒక నిర్దిష్ట మార్కెట్‌ విభాగానికి ఎక్కువగా పెట్టుబడులు పెట్టే ఆస్కారమూ ఉంది. మదుపరుల నష్ట భయాన్ని భరించే సామర్థ్యానికి ఇది
సరిపోకపోవచ్చు.

ఏది ఎంచుకోవాలి?

పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండాలి, కాస్త నష్టం వచ్చినా తట్టుకోగలం అనుకున్నప్పుడు మల్టీ క్యాప్‌ ఫండ్లు సరైన ఎంపిక కావచ్చు. అధిక రాబడిని కోరుకునే వారు వీటిని పరిశీలించవచ్చు. పెట్టుబడుల కేటాయింపు నిర్ణయాలను తీసుకునే ఫండ్‌ మేనేజర్‌పై నమ్మకం ఉన్న వారు ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మార్కెట్లో హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నప్పుడు ప్లెక్సీ క్యాప్‌ ఫండ్లు సరిపోతాయి. మల్టీ క్యాప్‌ ఫండ్లతో పోలిస్తే ఫ్లెక్సీ క్యాప్‌ పథకాల్లో తక్కువ నష్టభయం ఉండే అవకాశాలున్నాయి.

మదుపు చేసే ముందు మీ నష్టభయాన్ని భరించే సామర్థ్యం, మీ ఆర్థిక లక్ష్యాల గురించి స్పష్టంగా తెలుసుకోండి. కనీసం అయిదేళ్లకు మించి మదుపు చేయాలనుకున్నప్పుడే ఈ ఫండ్లలో పెట్టుబడులు పెట్టాలి. మీ మొత్తం ఆర్థిక వ్యూహానికి ఈ ఫండ్లు ఎంత మేరకు సరిపోతాయో చూసుకోండి. రెండు రకాల ఫండ్లలోనూ క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయడం ఎప్పుడూ మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని