IT Notice: ట్యాక్స్ ఫైలింగ్‌ చేశాక ఐటీ నోటీసులా?

మీరు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌(ITR)లో వ్యత్యాసాలు, లోపాలు, తప్పుడు క్లెయింలు ఉన్నప్పుడు ఆదాయపు పన్ను శాఖ నోటిసును జారీ చేస్తుంది.

Published : 18 Aug 2023 16:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పన్నులు చెల్లించి, గడువులోపు రిటర్నులు దాఖలు చేసినప్పటికీ కొందరికి ఐటీ శాఖ నోటీసులు అందుతుంటాయి. ఇటీవల రిటర్నులు ఫైల్ చేసిన వారిలో దాదాపు లక్ష మందికి పైగా నోటీసులను అందించింది. ఈ నోటీసులకు కొన్ని సాధారణ కారణాలు ఉండొచ్చు. వీటితో పాటు ఆస్తులు లేదా ఆదాయంపై సరికాని సమాచారం; వాస్తవ, ప్రకటిత ఆదాయాల మధ్య వ్యత్యాసాలు; పెట్టుబడి మొత్తాలలో ఊహించని మార్పులు; లావాదేవీల్లో అధిక ఆదాయం వంటి ఇతర కారణాలూ ఉండొచ్చు. ఐటీఆర్‌ను ఆలస్యంగా దాఖలు చేయడం, గత సంవత్సరాల్లో బకాయిలు చెల్లించకపోవడం, పన్నులు ఎగవేయడం లాంటి వాటి వల్ల నోటీసులు అందొచ్చు. వీలైనంత వరకు నల్లధనాన్ని అడ్డుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ అనేక చర్యలు తీసుకుంటోంది. దేశం లోపల, వెలుపల మీ మొత్తం ఆదాయం, ఆస్తి సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిందిగా మీకు నోటీసు అందొచ్చు. 

ఎలాంటి నోటీసులు అందుతాయి?

అసెస్‌మెంట్‌ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆదాయపు పన్ను శాఖ రిటర్నులు దాఖలు చేసినవారి నుంచి మరింత సమాచారం లేదా పత్రాలను కోరుతుంటుంది. మీ రిటర్న్‌లో పూర్తి సమాచారం లేకపోయినా, తప్పుడు సమాచారం ఉన్నా, సెక్షన్‌ 139 (1) కింద నోటీసు అందుకోవచ్చు. ఇలా నోటీసు అందినట్లయితే రిటర్నుల్లో లోపాన్ని 15 రోజుల్లో సరిదిద్దుకోవాలి. మీరు సమర్పించిన పత్రాలు లేదా సమాచారంతో పన్ను అధికారి సంతృస్తి చెందనప్పుడు సెక్షన్‌ 143 (2) కింద నోటీసు జారీ చేస్తారు. పన్ను చెల్లింపుదారులు తదుపరి పరిశీలన కోసం అదనపు సమాచారాన్ని అందించాలి. మీరు ఏదైనా పన్ను, వడ్డీ, జరిమానా లేదా మరేదైనా మొత్తానికి బకాయిపడినప్పుడు ఐటీ శాఖ సెక్షన్‌ 156 కింద నోటీసు జారీ చేస్తుంది. ఈ నోటీసులో బకాయి మొత్తం స్పష్టంగా ఉంటుంది. మీరు మునుపటి సంవత్సరాల నుంచి చెల్లించని పన్నులను చెల్లించాల్సి ఉందని ఐటీ ఆధికారి విశ్వసించినప్పుడు సెక్షన్‌ 245 కింద నోటీసు జారీ చేస్తారు. చివరిగా మీ ఆదాయాన్ని కచ్చితంగా వెల్లడించలేదని ఐటీ శాఖ అనుమానించినట్లయితే, సెక్షన్‌ 148 కింద అధికారి నోటీసు జారీ చేయొచ్చు. ఈ విషయంలో ఆదాయాన్ని తిరిగి అంచనా వేసే హక్కు ఐటీ అధికారికి ఉంటుంది.

క్లెయింలో తప్పులు..

కొన్ని సార్లు వ్యక్తులు తమ పన్ను రిటర్నుల్లో ఇంటి అద్దె అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ), గృహ రుణం మినహాయింపు రెండింటినీ తప్పుగా క్లెయిం చేస్తారు. ఉద్యోగరీత్యా కొందరు తమ సొంతింట్లో కాకుండా వేరే నగరంలో ఇల్లు అద్దెకి తీసుకుని ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులలో ఏకకాలంలో హెచ్‌ఆర్‌ఏ, హౌస్‌ లోన్‌ తగ్గింపులను క్లెయిం చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ, రెండు తగ్గింపులను క్లెయిం చేసిన వారికి ఐటీ శాఖ నోటీసును జారీ చేయొచ్చు. ఇలాంటి వారి నుంచి మరింత సమాచారం కోరడం కోసమే నోటీసు పంపుతుంటారు. ఇంటి అద్దె అలవెన్స్‌ క్లెయిం చేసే పన్ను చెల్లింపుదారులు.. వార్షిక ఇంటి అద్దె రూ.1 లక్ష కంటే ఎక్కువ ఉంటే, ఇంటి యాజమానికి సంబంధించిన పాన్‌, పేరు, చిరునామాను తప్పనిసరిగా అందించాలి. పాన్‌ అందించకుండా హెచ్‌ఆర్‌ఏ తగ్గింపులను క్లెయిం చేస్తున్న వారికి పన్ను శాఖ నోటీసులు పంపే అవకాశం ఉంది. LTA, HRA లేదా సెక్షన్‌ 80C/80D మినహాయింపుల కోసం సపోర్టింగ్‌ డాక్యుమెంట్‌లను కూడా కోరవచ్చు.

TDSలో వ్యత్యాసం

TDS (ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌) అంటే.. ఉద్యోగుల ఆదాయం ప్రకారంగా సంస్థ ప్రభుత్వానికి చెల్లించిన పన్ను. ఈ పన్నును సంస్థ ఉద్యోగుల జీతం నుంచి కట్‌ చేస్తుంది. మీ రిటర్నుల్లో క్లెయిం చేసిన TDS క్రెడిట్‌, మీ ఫారం 26ASలో పొందుపరిచిన మొత్తాన్ని మించకూడదు. అలాకాని పక్షంలో ఐటీ శాఖ నుంచి నోటీసు వస్తుంది. TDSలో వ్యత్యాసం, రిటర్న్స్‌ ప్రాసెస్‌ చేయడంలో అనవసరమైన జాప్యాలకు కారణం అవుతుంది.

విలువైన లావాదేవీలు

మీరు విలువైన ఆస్తులను కొనుగోలు చేసినా/ అమ్మినా, అధిక మొత్తంలో క్రెడిట్‌ కార్డు లావాదేవీలు ఉన్నా.. మీ బ్యాంకు ఖాతాలో అధిక విలువ గల లావాదేవీలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ శాఖ నుంచి నోటీసు అందుకోవచ్చు. పిల్లల (మైనర్‌) పేరు మీద పెట్టుబడులు పెడితే, వాటిపై పొందిన రాబడి మీ ఆదాయానికి జత చేస్తారు. కాబట్టి, ఇలాంటి వాటిని రిటర్న్స్‌లో తప్పనిసరిగా పొందుపరచాలి.

ఇతర ఆదాయాలు

పన్ను చెల్లింపుదారులు తమకు వచ్చే ఏదైనా ఇతర అదనపు ఆదాయాన్ని ప్రత్యేకంగా నివేదించాలి. ఉదాహరణకు బ్యాంకు వడ్డీల ద్వారా, ఇతర సేవలు అందించినప్పుడు వచ్చే ఆదాయాన్ని కూడా రిటర్నుల్లో సమర్పించాలి. మీ పత్రాల వాస్తవికతను తెలుసుకోవడానికి ఐటీ శాఖ ఆటోమేషన్‌ను ఉపయోగిస్తుంది. ఎగవేసిన పన్నులకు రెట్టింపు జరిమానా చెల్లించే బదులు పన్ను చెల్లింపుదారులు క్లెయింల గురించి కచ్చితంగా ఉండడం మేలు. పన్ను నోటీసులకు ప్రతిస్పందనగా సవరించిన రిటర్నులను వీలైనంత త్వరగా ఫైల్‌ చేయాలి.

చివరిగా: ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చినప్పుడు, గడువులోగా అవసరమైన పత్రాలను సమర్పించండి. లేదా సర్దుబాట్లు చేసిన తర్వాత రిటర్నులు దాఖలు చేయండి. పన్ను అధికారి రిటర్నుల్లో (లేదా సవరించిన రిటర్న్స్‌) లోపాలుంటే వ్యక్తిగతంగా హాజరు కావాలని మిమ్మల్ని కోరవచ్చు. ఇలాంటి పరిస్థితులను నివారించడానికి పన్ను సలహాదారు (పన్ను ట్యాక్స్‌ కన్‌సల్టెంట్‌)ను నియమించుకోవడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని