WhatsApp: వాట్సాప్‌నకు నోటీసులు పంపుతాం.. స్పామ్‌ కాల్స్‌పై స్పందించిన కేంద్రం

WhatsApp International Spam Calls: వాట్సాప్‌లో రోజురోజుకీ పెరుగుతున్న ఇంటర్నేషనల్‌ స్పామ్‌ కాల్స్‌పై కేంద్రం స్పందించింది. నోటీసులు పంపుతామని తెలిపింది. 

Published : 11 May 2023 23:18 IST

WhatsApp | దిల్లీ: వాట్సాప్‌ (Whatsapp)లో అంతర్జాతీయ నంబర్ల నుంచి వస్తున్న స్పామ్‌ కాల్స్‌పై కేంద్రం స్పందించింది. దీనిపై వాట్సాప్‌ కంపెనీకి నోటీసులు పంపుతామని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ గురువారం తెలిపారు. యూజర్ల భద్రతను కాపాడాల్సిన బాధ్యత డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌పైనే ఉందని మంత్రి స్పష్టం చేశారు. ‘పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా (PAFI)’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

యూజర్ల గోప్యతకు భంగం కలిగించే ప్రతి అంశంపై కేంద్రం స్పందిస్తుందని రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. అలాగే స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లపై వాట్సాప్‌ (Whatsapp) చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నిబంధన ఏ సామాజిక మాధ్యమానికైనా వర్తిస్తుందని పేర్కొన్నారు. ‘‘అసలు స్పామ్‌ కాల్స్‌ చేసేవారికి వాట్సాప్‌ (Whatsapp) ఉన్న ఫోన్‌నంబర్లు ఎలా తెలిశాయి. వారి దగ్గర ఏదైనా సమాచారం ఉందా? లేక గుడ్డిగా చేసేస్తున్నారా? ఒకవేళ వారి దగ్గర సమాచారం ఉంటే అది పూర్తిగా గోప్యతా నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. దీనిపై కచ్చితంగా డిజిటల్‌ వేదికలు దృష్టిసారించాల్సిన అసవరం ఉంది’’ అని రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

దేశంలో గత కొద్ది రోజులుగా వాట్సాప్‌ (Whatsapp) యూజర్లను అంతర్జాతీయ కాల్స్‌ (International Calls) వేధిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మలేసియా, కెన్యా, వియత్నాం, ఇథియోపియా వంటి ఐఎస్‌డీ కోడ్‌లు కలిగిన నంబర్లతో ఈ ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో కొన్ని ఆడియో కాల్స్ కాగా.. మరికొన్ని వీడియో కాల్స్‌ ఉంటున్నాయి. ఇంతకీ ఈ కాల్స్‌ ఎవరు చేస్తున్నారు? వారి అసలు ఉద్దేశం ఏమిటి? వారికి ఈ నంబర్లు ఎలా చేరాయి?అనే వివరాలు ప్రస్తుతానికైతే తెలియరాలేదు. అయితే, గత కొన్ని రోజులుగా దీనిపై యూజర్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యవహారంపై వాట్సాప్ కూడా స్పందించింది. ఇటువంటి కాల్స్‌ వచ్చినప్పుడు వెంటనే సదరు నంబర్‌ను బ్లాక్‌ చేసి రిపోర్ట్‌ చేయాలని వినియోగదారులకు సూచించింది. రిపోర్ట్‌ చేసిన వెంటనే ఆ నంబర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని