LIC Dhan Vriddhi: ఎల్‌ఐసీ సింగిల్‌ ప్రీమియం ప్లాన్‌ నెలాఖరు వరకే

LIC Dhan Vriddhi plan end on Sep 30: పొదుపు, బీమా కాంబినేషన్‌లో ఎల్‌ఐసీ తీసుకొచ్చిన ధన వృద్ధి ప్లాన్‌ సెప్టెంబర్‌ 30తో ముగియనుంది.

Updated : 25 Sep 2023 16:15 IST

DHAN VRIDDHI PLAN | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) తీసుకొచ్చిన సింగిల్‌ ప్రీమియం బీమా ప్లాన్‌ ధన వృద్ధి (LIC Dhan Vriddhi) గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ ఏడాది జూన్‌లో తీసుకొచ్చిన ఈ పరిమితకాలపు ప్లాన్‌ గడువు సెప్టెంబర్‌ 30తో ముగుస్తోందని ఎల్‌ఐసీ ఎక్స్‌ (ట్విటర్‌) ద్వారా తెలియజేసింది. పొదుపు+ బీమా కాంబినేషన్‌లో వస్తున్న ఈ పాలసీ కావాలనుకునేవారు ఏజెంట్లను లేదా బ్రాంచ్‌ను సంప్రదించాలని, ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చని ఎల్‌ఐసీ సూచించింది.

ఏమిటీ ప్లాన్‌?

ఎల్‌ఐసీ తీసుకొచ్చిన ధన వృద్ధి (Plan no 869) అనేది నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌, ఇండివిడ్యువల్‌, సేవింగ్స్‌తో కూడిన సింగిల్‌ ప్రీమియంతో వస్తున్న లైఫ్‌ ప్లాన్‌. ఇటు బీమాతో పాటు సొమ్ముకు రాబడి హామీ ఉంటుంది. ఈ పాలసీ కాలవ్యవధిలో పాలసీదారు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు మెచ్యూరిటీ సమయంలో గ్యారెంటీ మొత్తం లభిస్తుంది.

₹2 వేల నోట్ల మార్పిడికి ఇంకా 5 రోజులే గడువు!

రెండు ఆప్షన్లు..

ధన వృద్ధి ప్లాన్‌ రెండు ఆప్షన్లలో లభిస్తుంది. మొదటి ఆప్షన్‌లో పాలసీదారు మరణిస్తే 1.25 రెట్లు చెల్లిస్తారు. రెండో ఆప్షన్‌లో ఈ మొత్తం 10 రెట్లుగా ఉంటుంది. ఈ ప్లాన్‌ 10, 15, 18 ఏళ్ల కాలవ్యవధితో వస్తోంది. కనీస వయసు టర్మ్‌ను బట్టి 90 రోజులుగా నిర్ణయించారు. టర్మ్‌, ఆప్షన్‌ ఆధారంగా గరిష్ఠ వయసు 32 ఏళ్ల నుంచి 60 ఏళ్లుగా నిర్ధారించారు. ఆప్షన్‌-1లో గరిష్ఠ వయసు 60 ఏళ్లు కాగా ఆప్షన్‌-2లో 40 ఏళ్లుగా పేర్కొన్నారు. కనీస హామీ మొత్తాన్ని రూ.1.25 లక్షలుగా ఎల్‌ఐసీ నిర్ణయించింది. ఆపై రూ.5 వేల చొప్పున సమ్‌ అష్యూర్డ్‌ మొత్తాన్ని పెంచుకోవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా ఎంచుకోవచ్చు.

తొలి ఆప్షన్‌లో ప్రతి వెయ్యి రూపాయలకి ఎంచుకున్న టర్మ్‌ ఆధారంగా ఏడాదికి రూ.60-75 వరకు గ్యారెంటీడ్‌ అడిషన్‌ లభిస్తుంది. ఆప్షన్‌-2లో అయితే ఈ మొత్తం టర్మ్‌ బట్టి రూ.25-40 మధ్య ఉంటుంది. మెచ్యూరిటీ/ డెత్‌ సమయంలో ఐదేళ్ల కాలానికి విడతల వారీగా (నెల, త్రైమాసికం, 6 నెలలు, సంవత్సరం) సెటిల్‌మెంట్‌ మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్లాన్‌పై రుణ సదుపాయం కూడా లభిస్తుంది. పాలసీ తీసుకున్న మూడు నెలల తర్వాత ఎప్పుడైనా రుణం తీసుకోవచ్చు. సెక్షన్‌ 80సి కింద మినహాయింపులు పొందొచ్చు. సింగిల్‌ ప్రీమియం కాబట్టి ల్యాప్స్‌ అనే మాటే తలెత్తదు.

ఎలా కొనాలి?

ఎల్‌ఐసీ ధనవృద్ధి స్కీమ్‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఎల్‌ఐసీ కామన్‌ సర్వీస్‌ సెంటర్లలోనూ పాలసీని కొనుగోలు చేయొచ్చు. లేదంటే నేరుగా ఎల్‌ఐసీ ఇండియా వెబ్‌సైట్‌కి వెళ్లి కూడా కొనుగోలు చేయొచ్చు. పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాలకు ఎల్‌ఐసీ సేల్స్‌ బ్రోచర్‌ కోసం క్లిక్‌ చేయండి. ఆన్‌లైన్‌ కొనుగోలుకు ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

  • ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ఆప్షన్‌-1 కింద 15 ఏళ్ల టర్మ్‌కు గానూ రూ.10 లక్షల హామీ మొత్తాన్ని ఎంచుకుంటే సింగిల్‌ ప్రీమియం కింద రూ.8.96 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది (జీఎస్టీతో కలిపి). అదే 30 ఏళ్ల వ్యక్తి రూ.10 లక్షలకు హామీ మొత్తం కోసం ఆప్షన్‌-2 ఎంచుకుంటే జీఎస్టీతో కలిపి రూ.8.05 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ₹10 లక్షల సమ్‌ అష్యూర్డ్‌ కోసం ఏ వయసు వారు ఎంతెంత చెల్లించాలో ఈ పట్టికలో చూడొచ్చు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని