Adani గ్రూప్‌లో LIC పెట్టుబడుల విలువ రూ.44,670 కోట్లకు

జనవరి- మార్చి త్రైమాసికంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఏకీకృత నికర లాభం 5 రెట్లకు పైగా పెరిగి రూ.13,191 కోట్లకు చేరింది.

Updated : 25 May 2023 10:18 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌నకు చెందిన ఏడు కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడుల మార్కెట్‌ విలువ రూ.44,670 కోట్లకు పెరిగింది. అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం కనిష్ఠాలకు చేరిన అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల విలువలు మళ్లీ పుంజుకోవడమే ఇందుకు కారణం. అదానీ షేర్లలో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ ఏప్రిల్‌లో దాదాపు రూ.5,500 కోట్ల మేర పుంజుకుంది.

* అదానీ పోర్ట్స్‌లో ఎల్‌ఐసీకి అత్యధికంగా 9.12% షేర్లున్నాయి. బీఎస్‌ఈలో బుధవారం ఈ షేరు రూ.717.95 వద్ద ముగియగా, ఈ ప్రకారం ఎల్‌ఐసీ విలువ రూ.14,145 కోట్లుగా నమోదైంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎల్‌ఐసీకి ఉన్న 4.25% వాటా విలువ రూ.12,017 కోట్లుగా ఉంది. అదానీ టోటల్‌ గ్యాస్‌, అంబుజా సిమెంట్‌ కంపెనీల్లో ఎల్‌ఐసీకి రూ.10,500 కోట్ల విలువైన షేర్లున్నాయి.

* అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ రూ.30,127 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. ఈ ఏడాది జనవరి 27కు వీటి విలువ రూ.56,142 కోట్లకు చేరింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక వల్ల ఫిబ్రవరి 23కు ఆ పెట్టుబడుల విలువ దాదాపు రూ.27,000 కోట్లకు పడిపోయినా, మళ్లీ కోలుకుంది.

* మూడు రోజుల దూకుడు తర్వాత అదానీ గ్రూప్‌లోని 7 షేర్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 5.90%, అదానీ విల్మర్‌ 2.15%, అదానీ పోర్ట్స్‌ 2.13%, అదానీ పవర్‌ 1.63%, అంబుజా సిమెంట్స్‌ 1.25%, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 0.52% చొప్పున నష్టాలు నమోదుచేశాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 5%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 5%, ఎన్‌డీటీవీ 4.98% లాభపడ్డాయి.

* గురువారం నుంచి స్వల్పకాలిక ఏఎస్‌ఎం నియమావళిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను పెడుతున్నట్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రకటించాయి.


ఎల్‌ఐసీ లాభంలో 5 రెట్లకు పైగా వృద్ధి

జనవరి- మార్చిలో రూ.13,191 కోట్లు
రూ.3 తుది డివిడెండు

దిల్లీ: జనవరి- మార్చి త్రైమాసికంలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఏకీకృత నికర లాభం 5 రెట్లకు పైగా పెరిగి రూ.13,191 కోట్లకు చేరింది. 2021-22 ఇదే కాలంలో నికర లాభం రూ.2,409 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.2,15,487 కోట్ల నుంచి తగ్గి రూ.2,01,022 కోట్లకు పరిమితమైంది. 

* పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2022-23) ఎల్‌ఐసీ నికర లాభం పలు రెట్లు పెరిగి రూ.35,997 కోట్లకు చేరింది. 2021-22లో నికర లాభం రూ.4,125 కోట్లు మాత్రమే.

* 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.3 (30%) తుది డివిడెండును ఎల్‌ఐసీ బోర్డు సిఫారసు చేసింది. ఎల్‌ఐసీ స్థూల నిరర్థక ఆస్తులు 6.03 శాతం నుంచి 2.56 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 0.04 శాతం నుంచి సున్నాకు తగ్గాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు