Meta: ఒక్కోరోజే 25% పతనమైన మెటా షేరు.. ఏడాదిలో ₹55 లక్షల కోట్లు ఆవిరి

సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చడంతో మెటా షేరు గురువారం భారీగా పతనమైంది. దీంతో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వ్యక్తిగత సంపద సైతం భారీగా తరిగిపోయింది.

Published : 28 Oct 2022 19:00 IST

వాషింగ్టన్‌: ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ షేరు విలువ గురువారం 25 శాతం పడిపోయింది. ఫిబ్రవరి తర్వాత కంపెనీకి ఇదే ఒకరోజు అతిపెద్ద నష్టం. కంపెనీ ఇప్పటికే ప్రకటనల ఆదాయం విషయంలో సవాళ్లు ఎదుర్కొంటోందని సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. ఈ తరుణంలో భవిష్యత్తులో ఫలాలు ఇచ్చే వేదికలపై సంస్థ పెట్టుబడులు భారీగా పెరుగుతోందని గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే షేరు ధర భారీగా కుంగింది. సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు ఆదాయాలపైనా ఆయన నిరాశపరిచే అంచనాలను ప్రకటించారు. జుకర్‌బర్గ్‌ వ్యక్తిగత సంపద గురువారం 11.2 బిలియన్‌ డాలర్లు (రూ.92.32 వేల కోట్లు) తగ్గి 37.7 బిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఆయన బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ సూచీలో 28వ స్థానంలో కొనసాగుతున్నారు.

వర్చువల్‌ రియాలిటీ, మెటావర్స్‌, కృత్రిమ మేధ వల్ల తమ సామాజిక మాధ్యమాల్లో చాలా మార్పులు రాబోతున్నాయని జుకర్‌బర్గ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందన్నారు. అయితే, షార్ట్‌ వీడియో, బిజినెస్‌ మెసేజింగ్‌, మెటావర్స్‌పై పెట్టిన పెట్టుబడులు సరైన ఫలితాలు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, అవి ఎప్పుడు, ఎంత మొత్తంలో లబ్ధిచేకూర్చుతాయనేది మాత్రం చెప్పలేమన్నారు. ఈ ఏడాది ఇప్పటికే మెటా స్టాక్‌ ధర 71 శాతానికి పైగా తగ్గింది. అయినా, కొనుగోళ్ల జాడ మాత్రం కనబడటం లేదు. దీంతో ఈ ఏడాది కంపెనీ కంపెనీ మార్కెట్‌ విలువ 676 బిలియన్‌ డాలర్లు (రూ.55.72 లక్షల కోట్లు) తగ్గింది. ఫలితంగా అమెరికాలో విలువపరంగా అతిపెద్ద 20 కంపెనీల జాబితాలో స్థానం కోల్పోయింది.

ఈ సవాళ్లన్నింటిలో ఒక్కో దానికి ఒక్కో సమయంలో కచ్చితంగా పరిష్కారం లభిస్తుందని జుకర్‌బర్గ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో ఓపికగా ఉంటూ తమ కంపెనీలో పెట్టుబడులుతున్న వారిని ఆయన అభినందించారు. కచ్చితంగా వారందరికీ ఫలితం లభిస్తుందన్నారు. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మెటా ఆదాయం వార్షిక ప్రాతిపదికన 4.5 శాతం తగ్గింది. విక్రయాలు వరుసగా రెండో త్రైమాసికంలోనూ తగ్గుముఖం పట్టాయి. వచ్చే మూడు నెలల్లోనూ ఇదే తీరు కొనసాగే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేసింది. ఈ ఏడాది కంపెనీ వ్యయాలు 85-87 బిలియన్‌ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా వేసింది. వచ్చే ఏడాది అది 96-101 బిలియన్‌ డాలర్లకు వరకు చేరొచ్చని తెలిపింది.

మార్కెట్‌లోని అస్థిర పరిస్థితుల కారణంగా మెటా ప్రకటనల ఆదాయం ఇప్పటికే తగ్గింది. మరోవైపు యాపిల్‌ గోప్యతా విధానాల్లో మార్పులు చేయడంతో అన్ని సామాజిక మాధ్యమాల ప్రకటనలపై ప్రభావం పడింది. దీంతో నియామకాల్లో తగ్గింపు వంటి చర్యల ద్వారా మెటా వ్యయ నియంత్రణకు దిగింది. ఒక్క ఈ కంపెనీయే కాకుండా ఆల్ఫాబెట్‌, స్నాప్‌ వంటి కంపెనీల ప్రకటనల ఆదాయంపైనా ప్రభావం పడింది. అయితే, మెటా మాత్రం విక్రయాల నుంచి వస్తున్న ప్రతి 10 డాలర్లలో ఒక డాలర్‌ను భవిష్యత్తు వర్చువల్‌ టెక్నాలజీపై ఖర్చు చేస్తోంది. అది ఎప్పటికి ఫలితాలిస్తుందనే విషయంపై స్పష్టత లేకపోవడంతో మదుపర్లలో ఆందోళన నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని