Best Companies 2023: ప్రపంచ అత్యుత్తమ 100 కంపెనీల్లో భారత్‌ నుంచి ఒకే ఒక్కటి!

TIME World’s Best Companies 2023: టైమ్‌ 100 అత్యుత్తమ కంపెనీల జాబితా (TIME World’s Best Companies 2023)లో మైక్రోసాఫ్ట్‌ (Microsoft) అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి ఒకే ఒక్క కంపెనీ చోటు దక్కించుకుంది.

Published : 15 Sep 2023 17:32 IST

TIME World’s Best Companies 2023 | ఇంటర్నెట్‌ డెస్క్‌: టైమ్‌ మ్యాగజైన్‌ స్టాటిస్టాతో కలిసి ప్రపంచంలో 100 అత్యుత్తమ కంపెనీల జాబితా (TIME World’s Best Companies 2023)ను విడుదల చేసింది. దీనిలో మైక్రోసాఫ్ట్‌ (Microsoft) అగ్రస్థానంలో నిలిచింది. యాపిల్‌ (Apple), గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌, మెటా ప్లాట్‌ఫామ్స్‌ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో కేవలం ఒకే భారత కంపెనీ స్థానం దక్కించుకుంది. దేశీయ టెక్‌ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ (Infosys) టైమ్‌ 100 అత్యుత్తమ కంపెనీల జాబితా (World’s Best Companies 2023)లో 64వ స్థానంలో నిలిచింది.

ఇన్ఫోసిస్‌ (Infosys)ను ఏడుగురు యువ ఇంజినీర్లు 1981లో స్థాపించారు. వీరిలో ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి, నందన్‌ నీలేకని అందరికీ సుపరిచితులే. వీరితో పాటు ఎస్‌.డి.శిబులాల్‌, గోపాలకృష్ణన్‌, అశోక్‌ అరోడా, కె.దినేశ్‌, ఎన్‌.ఎస్‌.రాఘవన్‌ కంపెనీని స్థాపించిన వారిలో ఉన్నారు. 2020 నాటికి ఆదాయాల ప్రకారం భారత్‌లో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్‌ అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్‌ విలువ దాదాపు రూ.6.26 లక్షల కోట్లు. యూఎస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయిన మొదటి భారత కంపెనీ కూడా ఇదే కావడం విశేషం. టైమ్‌ తాజా జాబితా (TIME World’s Best Companies 2023)లో చోటు దక్కించుకున్న మూడో ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ కంపెనీగానూ ఇన్ఫోసిస్‌ నిలిచింది. యాక్సెంచర్‌, డెలాయిట్‌ దీనికంటే ముందున్నాయి. ఇన్ఫోసిస్‌ షేరు విలువ ఈరోజు 0.34 శాతం పెరిగి రూ.1,512 దగ్గర స్థిరపడింది.

క్రెడిట్‌ కార్డు బిల్లు అధికంగా చెల్లిస్తున్నారా?ఇకపై కుదరదు!

ఉద్యోగుల సంతృప్తి, ఆదాయాల్లో వృద్ధి, సుస్థిరత (ESG) ఆధారంగా టైమ్‌.. ఈ కంపెనీలకు ర్యాంకింగ్‌ ఇచ్చింది. 58 దేశాల్లో మొత్తం 1.5 లక్షల ఉద్యోగులను సర్వే చేసినట్లు తెలిపింది. గత మూడేళ్ల ఆర్థిక ఫలితాల ఆధారంగా ఆదాయ వృద్ధిని పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. కర్బన ఉద్గారాలు, వాటిని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు, మానవ హక్కుల విధానాలు, డైరెక్టర్ల బోర్డులో మహిళల సంఖ్య వంటి వివరాల ఆధారంగా సుస్థిరతను అంచనా వేసినట్లు వివరించింది.

100 అత్యుత్తమ కంపెనీల్లో తొలి 10 ఇవే..

  • మైక్రోసాఫ్ట్‌
  • యాపిల్‌
  • ఆల్ఫాబెట్‌
  • మోటా ప్లాట్‌ఫామ్స్‌
  • యాక్సెంచర్‌
  • ఫైజర్‌
  • అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌
  • ఎలక్ట్రిసైట్‌ డి ఫ్రాన్స్‌
  • బీఎండబ్ల్యూ గ్రూప్‌
  • డెల్‌ టెక్నాలజీస్‌

750లో 8 భారత కంపెనీలు..

ప్రపంచవ్యాప్తంగా టైమ్‌ పరిగణనలోకి తీసుకున్న అత్యుత్తమ 750 కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్‌ (Infosys) సహా భారత్‌ నుంచి మరో ఏడు కంపెనీలు ఉన్నాయి.

  • ఇన్ఫోసిస్‌-64
  • విప్రో- 174
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌- 248
  • హెచ్‌సీఎల్‌- 262
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌- 418
  • డబ్ల్యూఎన్‌ఎస్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌- 596
  • ఐటీసీ- 672
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని