Credit card: క్రెడిట్‌ కార్డు బిల్లు అధికంగా చెల్లిస్తున్నారా? ఇకపై కుదరదు!

Credit card overpay: క్రెడిట్‌ కార్డు బిల్లు కంటే అధికంగా చెల్లిస్తున్నారా? అయితే ఇకపై అలా చెల్లించలేరు. ఒకవేళ చెల్లించినా ఆ మొత్తాన్ని బ్యాంకులు తిరిగి రిఫండ్‌ చేస్తాయి. 

Published : 15 Sep 2023 14:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రెడిట్‌ కార్డు (Credit card) వినియోగదారుల్లో కొందరు ఆ నెల చెల్లించాల్సి బిల్లు కంటే ఎక్కువ మొత్తం పే (Overpayment) చేస్తుంటారు. తదుపరి నెల ఎక్కువ మొత్తంలో చెల్లింపులు జరపాల్సిన సందర్భాల్లో క్రెడిట్‌ లిమిట్‌లో ఇబ్బందులు రాకుండా ఈ పని చేస్తుంటారు. కానీ, ఇకపై అలా కుదరదు. ఒకవేళ మీరు బిల్లు మొత్తం కంటే అధికంగా చెల్లిస్తే బ్యాంకులు ఆ మొత్తాన్ని మీకు తిరిగి చెల్లించేస్తాయి.

క్రెడిట్‌ కార్డు (Credit card) యూజర్లలో ఎక్కువ మంది బిల్లు చెల్లించాల్సిన మొత్తాన్నే పే చేస్తారు. కొందరైతే మినిమమ్‌ బిల్లు మాత్రమే పే చేస్తుంటారు. కొందరు మాత్రం అధికంగా బిల్లు పే చేస్తుంటారు. దీనివల్ల మనీలాండరింగ్‌, మోసాలు జరుగుతున్నట్లు బ్యాంకులు గుర్తించాయి. అందుకే ఈ నిబంధన తీసుకొచ్చాయి. ముఖ్యంగా విదేశీ కొనుగోళ్లను ఈ నిబంధన నివారిస్తుంది. ఖాతాల్లో కొట్టేసిన సొమ్మును మోసగాళ్లు క్రెడిట్‌ కార్డులకు తరలిస్తున్నారని, తద్వారా విదేశీ లావాదేవీలకు వినియోగిస్తున్న ఉదంతాలను బ్యాంకులు గుర్తించాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఈ నిర్ణయానికి వచ్చాయి.

బ్యాంకు ఖాతాలో డబ్బులేవా..? అయినా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు

ఇప్పటికే కొన్ని బ్యాంకులు బిల్లు మొత్తం కంటే అధికంగా చెల్లించకుండా నివారిస్తున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ వంటి బ్యాంకులు తమ యాప్‌ల ద్వారా బిల్లు కంటే అధిక మొత్తం చెల్లించకుండా తమ కస్టమర్లను నిలువరిస్తున్నాయి. ఇతర మార్గాల ద్వారా బిల్లు మొత్తం కంటే అధికంగా చెల్లించినా ఆ మొత్తాన్ని నిర్దేశిత గడువులోగా బ్యాంకులు తిరిగి చెల్లించనున్నాయి. ఒకవేళ క్రెడిట్‌ లిమిట్‌ కావాలంటే ఏదైనా వస్తువును కొనుగోలు చేసిన తర్వాత వెంటనే చెల్లింపులు చేసుకుని, మరుసటి కొనుగోళ్లకు ఆ లిమిట్‌ వినియోగించుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని