IRCTC: ఆర్డర్‌ చేయని ఫుడ్‌ ఐటమ్‌కూ బిల్‌.. ప్రయాణికురాలి ఎక్స్‌ పోస్ట్‌పై స్పందించిన IRCTC

IRCTC: రైళ్లలో ఆర్డర్‌పై అందించే ఆహారంతో పాటు, అసలు ఆర్డరే ఇవ్వని దానికీ బిల్‌ వేసి డబ్బులు వసూలు చేస్తున్నారని చేసిన ఫిర్యాదుపై ఐఆర్‌సీటీసీ స్పందించింది.

Updated : 10 Dec 2023 16:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రైలు ప్రయాణంలో ఆర్డర్‌ చేసిన ఆహారంతో పాటు, అసలు ఆర్డర్‌ చేయని ఫుడ్‌ను కూడా కలిపి చూపించి, డబ్బులు వసూలు చేస్తున్నారని ఓ మహిళ ‘ఎక్స్‌’ వేదికగా ఐఆర్‌సీటీసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆ సంస్థ వెంటనే స్పందించింది. ఇకపై అలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

రుచి కొచ్చ అనే మహిళా రచయిత తన కుటుంబంతో కలసి పట్నా నుంచి దిల్లీకి బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. తన ప్రయాణంలో ఎదురైన సంఘటనను ‘ఎక్స్‌’లో పంచుకుంది. ‘10 మందితో కలిసి దిల్లీకి బయలుదేరాం. ఆహారం కోసం ఐఆర్‌సీటీసీ కేటరింగ్‌ నుంచి వెజ్‌ థాలి ఆర్డర్‌ చేశా. ఆహారం తెచ్చే సమయంలో బిల్‌ని కచ్చితంగా ఇవ్వాలని స్పష్టంగా చెప్పాం. అయితే వాళ్లు ఇచ్చిన బిల్‌లో రూ.80 థాలీ + రూ.70 పనీర్‌ సబ్జీ = రూ.150గా ఉంది.  కేవలం వెజ్‌ థాలి మాత్రమే ఆర్డర్‌ చేశానని సిబ్బందికి చెప్పినా వినిపించుకోకుండా గంట సేపు వాదించారు. ఆ తర్వాత ఓ అధికారి వచ్చి వెజ్‌ థాలికి రూ.80 బిల్లు ఇచ్చారు’ అని వెల్లడించారు.

New Cars: ధరలు.. ‘కారు’ చౌకగా

ఆర్డర్‌ చేసిన దానికి మాత్రమే బిల్లు ఇవ్వకుండా ఆర్డర్‌ చేయని ఆహారాన్ని కూడా తన బిల్లులో వేసి డబ్బుని వసూలు చేస్తున్నారంటూ ఆమె తన పోస్ట్‌ ద్వారా మండిపడ్డారు. ఇలాంటి వారి ప్రవర్తన భారతీయ రైల్వే ప్రతిష్ఠను దిగజార్చుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌ కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ఐఆర్‌సీటీసీ స్పందించింది. ‘ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు సర్వీస్‌ ప్రొవైడర్‌పై భారీ జరిమానా విధిస్తాం’ అంటూ ఐఆర్‌సీటీసీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని