BillDesk: బిల్‌డెస్క్‌ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న పేయూ

డిజిటల్‌ చెల్లింపుల ప్రొవైడర్‌ బిట్‌డెస్క్‌తో కుదిరిగిన కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పేయూ మాతృసంస్థ ప్రోసస్‌ ఎన్‌వీ ప్రకటించింది.

Published : 03 Oct 2022 15:59 IST

దిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల ప్రొవైడర్‌ బిల్‌డెస్క్‌తో కుదిరిన కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పేయూ మాతృసంస్థ ప్రోసస్‌ ఎన్‌వీ సోమవారం ప్రకటించింది. కొన్ని షరతులకు లోబడి ఈ ఒప్పందం కుదిరిందని గుర్తుచేసింది. వాటిలో కొన్నింటిపై సెప్టెంబరు 30నాటికి అంగీకారం కుదరాల్సి ఉండగా.. అది జరగలేదని పేర్కొంది. దీంతో ఒప్పందంలోని నిబంధనల ప్రకారం కొనుగోలు రద్దయినట్లు తెలిపింది. ఈ ఒప్పందానికి గతనెల 5న ‘కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI)’ అనుమతి కూడా లభించినట్లు పేర్కొంది. 

బిల్‌డెస్క్‌-పేయూ కొనుగోలు ఒప్పందాన్ని భారత వినియోగదారు ఇంటర్నెట్‌ రంగంలో అతిపెద్ద కొనుగోలు లావాదేవీగా పేర్కొంటున్నారు. బిల్‌డెస్క్‌ను తమ ఫిన్‌టెక్‌ వ్యాపారం పేయూ 4.7 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.34,376.2 కోట్ల)కు కొనుగోలు చేయనున్నట్లు అంతర్జాతీయ సంస్థ అయిన ప్రోసస్‌ ఎన్‌వీ గత ఏడాది ఆగస్టు 31న ప్రకటించింది. నెదర్లాండ్స్‌లో స్థాపితమై అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగించే ప్రోసస్‌, భారత్‌లో బైజూస్‌, మీషో, స్విగ్గీ, అర్బన్‌ కంపెనీ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే సిట్రస్‌పే, పేసెన్స్‌, విబ్‌మో వంటి చెల్లింపుల సంస్థలను పేయూ కొనుగోలు చేసింది. 2000లో ఏర్పాటైన బిల్‌డెస్క్‌లో జనరల్‌ అట్లాంటిక్‌, వీసా, టీఏ అసోసియేట్స్‌, క్లియర్‌స్టోన్‌ వెంచర్‌, టెమాసెక్‌ వంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని