FMCG రంగంలోకి రిలయన్స్‌ గ్రూప్‌.. ‘ఇండిపెండెన్స్‌’ పేరుతో ఉత్పత్తులు

Reliance Independence: రిలయన్స్‌ ఏజీఎంలో ప్రకటించినట్లుగానే రిలయన్స్‌ గ్రూప్‌ ఎఫ్‌ఎంసీజీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇండిపెండెన్స్‌ పేరుతో ఉత్పత్తులను తీసుకొస్తోంది.

Published : 15 Dec 2022 17:50 IST

దిల్లీ: ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్‌ గ్రూప్‌ (Reliance) ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (FMCG) రంగంలోకి అడుగుపెట్టింది. ఎఫ్‌సీఎం ఉత్పత్తులకు ఇండిపెండెన్స్‌ (Independence) అని నామకరణం చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గురువారం ఈ బ్రాండ్‌ను లాంచ్‌ చేశారు. శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసరాలను ఇండిపెండెన్స్‌ పేరుతో విక్రయించనున్నారు. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ ఈ బ్రాండ్‌ను తీసుకొచ్చింది.

వంట నూనెలు, పప్పులు, తృణ ధాన్యాలు, బిస్కెట్లు వంటి ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర సరకులను ఈ బ్రాండ్‌పై విక్రయించనున్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ డైరెక్టర్‌ ఇషా అంబానీ తెలిపారు. నాణ్యతకు పెద్ద పీట వేస్తూ అందుబాటు ధరలోనే ఈ ఉత్పత్తులను తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే కొన్ని నెలల్లో గుజరాత్‌ వ్యాప్తంగా బ్రాండ్‌ను విస్తరించనున్నారు. తర్వాత దేశవ్యాప్తంగా ఈ బ్రాండ్‌ను తీసుకెళ్లాలని కంపెనీ నిర్ణయించింది. ఇటీవల జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏజీఎంలో తొలుత ఎఫ్‌సీఎంజీ గురించి ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆ కంపెనీ ఈ బ్రాండ్‌ను లాంచ్‌ చేసింది. రిలయన్స్‌ రిటైల్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,500 స్టోర్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని