Retirement Plan: రిటైర్‌మెంట్‌ ప్లాన్‌.. ఏ వయసులో ఎలా?

Retirement Plan: రిటైర్‌మెంట్‌ తర్వాత జీవితం సాఫీగా సాగాలంటే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి. అప్పటి అవసరాలకు సరిపడా నిధిని యుక్త వయసు నుంచే కూడబెట్టుకోవాలి. మరి రిటైర్‌మెంట్‌ కోసం ఏ వయసులో ఎలా ప్లాన్‌ చేసుకోవాలో చూద్దాం..!

Updated : 17 Oct 2023 16:07 IST

Retirement Plan | భారత్‌లో ఇప్పటికీ చాలా మంది యువత రిటైర్‌మెంట్‌ లక్ష్యాల (Retirement Goals)పై అంతగా దృష్టి సారించడం లేదని హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్‌ సర్వేలో తేలింది. 30 ఏళ్ల వయసు రాకముందే పదవీ విరమణ ప్రణాళిక (Retirement Plan)పై సీరియస్‌గా ఆలోచించాలని సర్వేలో పాల్గొన్నవారిలో కేవలం 20 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. అలాగే చాలా మంది తమ వార్షిక ఆదాయానికి 10 రెట్ల నిధి రిటైర్‌మెంట్ తర్వాతి అవసరాలకు సరిపోతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అసలు రిటైర్‌మెంట్‌ ప్రణాళిక (Retirement Plan) ఎప్పటి నుంచి ప్రారంభించాలి? ఒకవేళ ఆలస్యమైతే.. ఏ వయసులో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో చూద్దాం..!

ఇవి అడ్డంకి కావొద్దు..

చాలా మందికి ప్రస్తుతం ఉండే అవసరాలు రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌ (Retirement Plan)కు అడ్డంకిగా మారుతుంటాయి. నెలవారీ ఆదాయంలో చాలా వరకు లోన్‌ ఈఎంఐలకే సరిపోతుంది. కార్లు, ఇల్లు ఇలా రకరకాల రుణాలు చెల్లించడానికే ఆదాయాన్ని కేటాయిస్తుంటారు. దీంతో రిటైర్‌మెంట్‌కు కావాల్సిన నిధులను పక్కనపెట్టేందుకు సరిపడా డబ్బు ఉండడం లేదు. కొంత మంది ఉద్యోగులైతే ఉద్యోగ భవిష్య నిధి నుంచి కూడా డబ్బును తీసుకొని వాడుకుంటుంటారు. అయితే, ఇవేవీ రిటైర్‌మెంట్‌ లక్ష్యానికి అడ్డంకిగా మారకుండా చూసుకోవాలి.

ఎంత కావాలి?

రిటైర్‌మెంట్‌ (Retirement) తర్వాత జీవితం సాఫీగా సాగడానికి ఎంత మొత్తం నిధి కావాలో చాలా మంది నిర్ధారించుకోలేరు. రిటైర్‌మెంట్‌కు ఇంకా కొన్ని దశాబ్దాల సమయం ఉన్నవారు తమ వార్షిక ఆదాయానికి కనీసం 30 రెట్ల సొమ్మును పోగు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు మీ నెలవారీ ఖర్చులు రూ.1లక్ష అనుకుంటే.. ఏడాదికి రూ.12 లక్షల చొప్పున మీరు రూ.3.6 కోట్ల నిధిని రిటైర్‌మెంట్‌ తర్వాత జీవితం కోసం ఆదా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ అవసరాలు తగ్గిపోతాయని.. సాధారణ జీవనశైలికి అలవాటుపడుతుంటామనే అపోహలో చాలా మంది ఉంటారు. కానీ, వాటి స్థానంలో ఆరోగ్య సమస్యలు, ద్రవ్యోల్బణం వంటివి వచ్చి చేరతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

20ల్లో.. ముందస్తు ప్రయోజనాలు..

చిన్న వయసులోనే మీ రిటైర్‌మెంట్‌ లక్ష్యం (Retirement Goals) ఏంటో నిర్ణయించుకోవాలి. దాన్ని చేరుకోవాలంటే ఎంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలో అంచనా వేయాలి. ప్రతి నెలా కొంత మొత్తం పక్కకు తీసి మదుపు చేస్తే కాంపౌండింగ్‌ వల్ల భారీ నిధిని పోగు చేసుకోవచ్చు. పైగా తక్కువ వయసులోనే ప్రారంభిస్తే ఈక్విటీల వంటి రిస్క్‌ ఉండే ఆర్థిక సాధనాల్లోనూ పెట్టుబడి పెట్టొచ్చు. దీంతో రాబడిని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే అనుకోకుండా సంభవించే అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఆరోగ్య బీమా కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే మీ రిటైర్‌మెంట్‌ ప్లాన్‌కు పెద్ద గండిపడే ప్రమాదం ఉంది. అలాగే కనీసం ఆరునెలల వ్యయాలకు సరిపడా అత్యవసర నిధినీ వేరేగా కూడబెట్టుకోవాలి.

30, 40ల్లో.. స్థిరంగా..

కావాలంటే ఆర్థిక నిపుణుల సహకారంతో ఒక పక్కా రిటైర్‌మెంట్‌ ప్లాన్‌ను సెట్‌ చేసుకోవాలి. అప్పటికే మీకు ఒక జీవనశైలి అలవాటై ఉంటుంది గనక దాన్ని బట్టి ఎంత మొత్తం కావాలో నిర్ధారించుకోవాలి. ఏటా మదుపు మొత్తాన్ని 20- 25 శాతం పెంచుకునేలా ప్లాన్‌ చేసుకోవాలి. పూర్తిగా రిస్క్‌తో కూడిన సాధనాల్లో కాకుండా.. ఈక్విటీ, మ్యూచువల్‌ ఫండ్లు, బంగారం, ఇన్విట్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వంటి విభిన్న మార్గాలను పరిశీలించొచ్చు. అదే సమయంలో ఎన్‌పీఎస్‌, ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌ వంటి రిటైర్‌మెంట్‌ ప్లాన్లనూ కొనసాగించాలి.

50ల్లో.. తొందరపడాలి..

వివిధ కారణాల వల్ల 50ల్లోకి అడుగుపెట్టే వరకు కొంతమంది రిటైర్‌మెంట్‌కు ప్లాన్‌ చేసుకోలేరు. వారు కూడా పక్కా ప్రణాళికతో వెళితే.. కావాల్సిన సొమ్మును పోగు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వయసులో అవసరాలు, సౌకర్యాలు, విలాసాలను కుదించుకోవాల్సిందే. తద్వారా రెగ్యులర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు అదనపు సొమ్మును మదుపు చేసేందుకు వీలుంటుంది. అవసరమైతే చిన్నాచితకా ఆస్తులేమైనా ఊరికే పడి ఉంటే విక్రయించి రిటైర్‌మెంట్‌ కోసం మరో చోట మదుపు చేయడం మేలని నిపుణుల సలహా. అయితే, పిల్లల అవసరాలు, తల్లిదండ్రుల ఖర్చులను మేనేజ్‌ చేసుకుంటూ ఈ వయసులో రిటైర్‌మెంట్‌ నిధిని పోగు చేసుకోవడం కొంత సవాల్‌తో కూడిన అంశమే. పిల్లల పెళ్లిళ్లు, ఇంట్లో శుభకార్యాల వంటి విషయంలో ఆడంబరాలకు వెళ్లపోవడమే మేలు.

రిటైర్‌మెంట్‌ తర్వాతి జీవితం కోసం సరైన ప్రణాళికను రూపొందించుకోవడంలో వెనుకబడినవారు.. చేస్తున్న పనిని పదవీవిరమణ తర్వాత కూడా కొనసాగించడంపై దృష్టి సారించాలి. అయితే, శారీరక, మానసికంగా సామర్థ్యం ఉందనుకుంటేనే ఈ దిశగా అడుగేయాలి. ఈపీఎఫ్‌లో టాపప్‌, పీపీఎఫ్‌ను పునరుద్ధరించడం, లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం వంటి మార్గాలనూ పరిశీలించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని