Health Insurance: ఏ వయసులో ఆరోగ్య బీమా పాల‌సీ కొనుగోలు చేయాలి?

అనారోగ్య‌ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఎవ‌రినైనా ఎప్పుడు తాకుతుందో తెలియ‌దు.

Updated : 15 Jul 2022 17:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల కార‌ణంగా ఆర్థిక ఇబ్బందులు ప‌డ‌కుండా మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌డానికి స‌రైన స‌మ‌యంలో మంచి ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌డం మంచిది. చిన్న వ‌య‌స్సులో అనారోగ్యాలు, ఆసుప‌త్రి ఖ‌ర్చులు ఏముంటాయి? అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు ఎప్పుడూ చెప్పిరావు. అనుకోని సంఘ‌ట‌న‌లు ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు. ఒకవేళ కొత్తగా ఉద్యోగంలో చేరి.. ఎటువంటి నగదు నిల్వా లేని సమయంలో ఏదైనా జరిగి ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి చిన్న వయసులోనే ఆరోగ్య బీమా తీసుకోవడం చాలా ముఖ్యం. కొవిడ్‌ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ సమయంలో చాలా మంది చిన్న వయసులోనే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

చిన్న వ‌య‌స్సులోనే ఆరోగ్య బీమా: ఎవ‌రైనా యుక్త వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు త‌క్కువ ఖ‌ర్చుతో ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఆ వ‌య‌స్సుకు వ్యాధులు వ‌చ్చే అవకాశం త‌క్కువ కాబ‌ట్టి రెన్యువ‌ల్ జ‌రిగేట‌ప్పుడు ప్రీమియం త‌క్కువ పెరిగే అవ‌కాశ‌ముంది. సాధార‌ణంగా, మీరు య‌వ్వ‌నంలో ఉన్న‌ప్పుడు ఏదైనా తీవ్ర‌మైన ఆరోగ్య ప‌రిస్థితిలో బాధ‌ప‌డే అవ‌కాశం త‌క్కువ. కానీ మీరు ముందుగా ఉన్న అనారోగ్యాల‌కు ఎలాంటి ప‌రిమితులూ లేకుండా ఆరోగ్య పాల‌సీని పొందొచ్చు. చిన్న వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నార‌ని నిరూపించ‌డానికి ఎలాంటి వైద్య ప‌రీక్షలూ అక్క‌ర్లేదు. కానీ 45 ఏళ్లు పైబ‌డి ఉన్న‌ప్పుడు బీమాను కొనుగోలు చేస్తే, బీమా కంపెనీ ఆరోగ్య పాల‌సీని జారీ చేసే ముందు అనేక వైద్య త‌నిఖీల‌ను చేయ‌మ‌ని మిమ్మ‌ల్ని అడుగుతుంది. 

నో క్లెయిమ్ బోన‌స్ (NCB): మీరు ఆరోగ్య బీమాను ముందుగానే కొనుగోలు చేసి, పాల‌సీ సంవ‌త్స‌రంలో ఎలాంటి క్లెయిమ్ చేయ‌లేదు అనుకుందాం. అప్పుడు ఆరోగ్య బీమా కంపెనీ ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు లేకుండా అటువంటి ప్ర‌తి క్లెయిమ్‌-ఫ్రీ సంవ‌త్స‌రానికి మీ క‌వ‌ర్ ప‌రిమాణాన్ని పెంచ‌డం ద్వారా మీకు నో-క్లెయిమ్ బోన‌స్ (NCB) ఇస్తుంది. ఆ త‌ర్వాత సంవ‌త్స‌రం NCB ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు. అదే ప్రీమియం చెల్లించి అధిక ఆరోగ్య క‌వ‌రేజీని పొందొచ్చు.

ఆర్థిక ప్ర‌ణాళిక‌ల‌కు అడ్డంకులుండ‌వు: ఇత‌ర ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌తో ఆరోగ్య బీమా పాల‌సీ ముడిప‌డి ఉంటుంది. మీరు ఆర్థిక ప్ర‌ణాళిక‌ క‌లిగి ఉన్న‌ప్పుడు, అనారోగ్య విష‌యాల్లో ఖ‌ర్చులు ఎక్కువ‌యినా కూడా ఆరోగ్య బీమా చూసుకుంటుంది. అప్పుడు ఆర్థిక ప్ర‌ణాళిక‌ ఏ అడ్డంకులూ లేకుండా స‌జావుగా సాగుతుంది.

ప‌న్ను మిన‌హాయింపు: ఆరోగ్య బీమాతో మ‌రో ప్ర‌యోజ‌నం ఏమిటంటే ప్రీమియంల చెల్లింపు మీకు సెక్ష‌న్ 80డి కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.25 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపుల‌ను క్లెయిమ్ చేయ‌వ‌చ్చు.

ఆరోగ్య ప‌రీక్ష‌లు, నిరీక్ష‌ణ వ్య‌వ‌ధి: మీకు 45 సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ వ‌య‌స్సు ఉన్న‌ట్ల‌యితే.. ఆరోగ్య రుగ్మ‌త‌లు లేకుంటే బీమా కంపెనీ సూచించిన ఆరోగ్య ప‌రీక్ష‌ను చేయించుకోవ‌డం ద్వారా ఆరోగ్య పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు. మీకు ఇప్ప‌టికే వ్యాధులుంటే ఆరోగ్య పాల‌సీని కొనుగోలు చేసే ముందు వాటిని త‌ప్ప‌నిస‌రిగా వెల్ల‌డించాలి. అయినా కూడా మీరు ఆరోగ్య బీమా పాల‌సీని పొందుతారు. అయితే ఆ పాల‌సీలో ముందుగా ఉన్న వ్యాధుల‌కు చికిత్స‌ పొంద‌డానికి సుమారు 2 నుంచి 4 సంవ‌త్స‌రాల నిరీక్ష‌ణ వ్య‌వ‌ధి ఉంటుంది.

స‌హ-చెల్లింపు (క్లెయిమ్‌లో వాటా): ఎవ‌రైనా పెద్ద‌య్యాక ఆరోగ్యం క్షీణించ‌డం వ‌ల్ల ఆరోగ్య పాల‌సీని పొంద‌డం మ‌రింత స‌వాలుగా మారుతుంది. మీరు 60 ఏళ్లు దాటిన త‌ర్వాత, ఆరోగ్య బీమా పాల‌సీ ఎంపిక‌లు త‌గ్గిపోతాయి. సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన పాల‌సీని అధిక ప్రీమియంల‌తో మీకు అందించిన‌ప్ప‌టికీ కొన్ని బీమా కంపెనీలు నిర్దిష్ట వ్యాధుల చికిత్స‌ను ప‌రిమితం చేయ‌వ‌చ్చు లేదా క్లెయిమ్ ఉన్న‌ప్పుడు స‌హ‌-చెల్లింపు (క్లెయిమ్‌లో మీ వాటా) చెల్లించ‌మ‌ని మిమ్మ‌ల్ని అడ‌గొచ్చు.

చివ‌రిగా: చిన్న వ‌య‌స్సులోనే ఆరోగ్య బీమాను కొనుగోలు చేయ‌డం వ‌ల్ల త‌క్కువ ప్రీమియంల నుంచి ప్ర‌యోజ‌నం పొందొచ్చు. స‌హ చెల్లింపు, ఇత‌ర వ‌య‌సు ఆధారిత ప‌రిమితులు లేకుండా మీరు ఆరోగ్య ర‌క్ష‌ణ‌ను ఆస్వాదించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని