Amazon: మరోసారి అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల కోత!

ఈ ఏడాది ఆర్థికపరమైన నిర్ణయాల్లో అమెజాన్‌ (Amazon) కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. అతి పెద్ద వ్యాపార విభాగాలైన రిటైల్‌, వెబ్‌ సర్వీసెస్‌లలో పెట్టుబడుల విషయంలో ఆశాజనంగా ఉన్నట్లు యాండీ జెస్సీ (Andy Jassy) తెలిపారు.

Published : 20 Mar 2023 22:18 IST

వాషింగ్టన్‌: అమెజాన్‌(Amazon)లో లేఆఫ్‌(Layoffs)ల పర్వం కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం భయాలతో ఈ ఏడాది ఆరంభం నుంచి సుమారు 18,000 మందిని తొలగించిన అమెజాన్‌, తాజాగా మరో 9,000 మందికి ఉద్వాసన పలకనుంది. ఈ మేరకు కంపెనీ సీఈవో యాండీ జెస్సీ (Andy Jassy) ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘రాబోయే రోజుల్లో మరింత అస్థిరత నెలకొనే అవకాశాలు ఉండటంతో కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా మరికొంతమంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించాం. వచ్చే నెలలో ఈ తొలగింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. త్వరలోనే దీనిపై ఉద్యోగులకు సమాచారం అందిస్తాం’’ అని జెస్సీ చెప్పారు. అమెజాన్‌ రెండో విడత వార్షిక ప్రణాళిక ప్రక్రియ సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. 

అమెజాన్‌ తాజా నిర్ణయంతో క్లౌడ్‌ కంప్యూటింగ్‌, మానవ వనరుల విభాగం, ప్రకటనలు, ట్విచ్‌ లైవ్‌స్ట్రీమింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది. గతంలో తొలగించిన 18,000 మందిలో రిటైల్‌, డివైజెస్‌, నియామకాలు, మానవ వనరుల విభాగాలకు చెందినవారు ఉన్నారు. కంపెనీపై ఆర్థికపరమై భారాన్ని తగ్గించుకునేందుకు అమెజాన్‌ ఇప్పటికే పలు ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌లను నిలిపివేసింది. దాంతోపాటు కొత్తగా ఎలాంటి నియామకాలు చేపట్టబోమని స్పష్టం చేసింది. ఈ ఏడాది కంపెనీ ఆర్థికపరమైన నిర్ణయాల్లో  కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, అతి పెద్ద వ్యాపార విభాగాలైన రిటైల్‌, వెబ్‌ సర్వీసెస్‌లలో పెట్టుబడుల విషయంలో ఆశాజనకంగా ఉన్నట్లు జెస్సీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని