Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 128, నిఫ్టీ 37 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. 

Updated : 02 May 2024 15:51 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. రికార్డు జీఎస్టీ వసూళ్లు, త్రైమాసిక ఫలితాలు సూచీలను ముందుకు నడిపించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడం మరో పాజిటివ్‌ అంశం. ఆటో, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌ షేర్లు రాణించగా.. బ్యాంక్‌, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 74,391.73 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. తర్వాత కోలుకుంది. ఒడుదొడుకులు ఎదుర్కొన్నా రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 74,812.43 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 128.33 పాయింట్ల లాభంతో 74,611.11 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 37.80 పాయింట్ల లాభంతో 22,642.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.46గా ఉంది. సెన్సెక్స్‌లో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర 84.21 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 

52 వారాల కనిష్ఠానికి కోటక్ షేర్లు

ప్రైవేటు రంగ బ్యాంక్‌ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు గురువారం కుంగాయి. కంపెనీ జాయింట్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీఎస్‌ మణియన్‌ తక్షణమే ఆ బాధ్యతల నుంచి వైదొలిగినట్లు ఆ బ్యాంక్ ప్రకటించడం ఇందుక్కారణం. దాదాపు మూడు దశాబ్దాలుగా కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు మణియన్‌ సేవలందిస్తున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌ ద్వారా కొత్త కస్టమర్లు చేర్చుకోవడం, క్రెడిట్‌ కార్డుల జారీపై ఆర్‌బీఐ ఇప్పటికే ఆంక్షలు విధించిన సంగతి విదితమే. ఈ క్రమంలో కోటక్‌ షేరు ఓ దశలో 4 శాతం మేర క్షీణించి 52 వారాల కనిష్ఠానికి చేరింది. చివరికి బీఎస్‌ఈలో 2.78 శాతం నష్టంతో 1578.65 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని