Facebook: 11.9కోట్ల నుంచి 10వేలకు.. అనూహ్యంగా తగ్గిన జుకర్‌బర్గ్‌ ఫాలోవర్లు..!

ఫేస్‌బుక్‌ యూజర్ల ఫాలోవర్ల సంఖ్య అనూహ్యంగా తగ్గుతోంది. కొందరి ఖాతాలను అనుసరించేవారి సంఖ్య కోట్ల నుంచి వేలకు పడిపోయింది.

Updated : 12 Oct 2022 15:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సోషల్‌మీడియా మాధ్యమం ఫేస్‌బుక్‌లో ఫాలోవర్ల సంఖ్య అనూహ్యంగా తగ్గుతోంది. ఉన్నట్టుండి తమ ఖాతాలను అనుసరించే వారి సంఖ్య అమాంతం పడిపోయిందంటూ పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. మెటా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ ఖాతాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవ్వడం గమనార్హం.

జుకర్‌బర్గ్‌ అధికారిక ఖాతాకు గతంలో 119 మిలియన్ల (11.9కోట్ల)కు పైగా ఫాలోవర్లు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 10వేల దిగువకు చేరింది. ప్రస్తుతం ఆయన ఖాతాను 9,995 మంది అనుసరిస్తున్నారు. అటు బంగ్లాదేశ్‌ రచయిత తస్లీమా నస్రీన్‌ కూడా దీనిపై ట్విటర్‌లో స్పందించారు. తన ఖాతాను 9లక్షల మందికి పైగా అనుసరించగా.. ఇప్పుడు కేవలం 9వేల మంది మాత్రమే ఫాలోవర్లు ఉన్నారని ఆమె ట్వీట్‌ చేశారు.

దీనిపై మెటా అధికారిక ప్రతినిధి స్పందించారు. ‘‘కొంతమంది ఫేస్‌బుక్‌ ప్రొఫైళ్లలో అనూహ్యంగా ఫాలోవర్లు తగ్గడం మా దృష్టికి వచ్చింది. ఈ అసౌకర్యానికి గాను యూజర్లకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. వీలైనంత త్వరగా పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని వెల్లడించారు. అయితే ఫాలోవర్ల సంఖ్య ఎందుకు తగ్గిందన్న విషయాన్ని మాత్రం ఆ ప్రతినిధి వెల్లడించలేదు. కాగా.. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే జుకర్‌బర్గ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య మళ్లీ పాత స్థితికి చేరింది. అటు తస్లీమా నస్రీన్‌ ఫాలోవర్ల సంఖ్య కూడా సుమారు ఆమె చెప్పిన పాత సంఖ్యకు చేరుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని