Stock Market Closing Bell: మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Closing Bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం మిశ్రమంగా ముగిశాయి..

Published : 10 Aug 2022 16:02 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజులో దాదాపు ఎక్కువ భాగం అదే బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. మరోవైపు అమెరికాలో నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లు అప్రమత్తంగా కదలాడాయి. పైగా దేశీయంగా ఎలాంటి బలమైన సానుకూల సంకేతాలు లేకపోవడం కూడా మదుపర్లపై ప్రభావం చూపింది.

* నిఫ్టీ ఉదయం 17,566.10 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,566.10 వద్ద గరిష్ఠాన్ని, 17,442.80 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 9.65 పాయింట్ల స్వల్ప లాభంతో 17,534.75 వద్ద స్థిరపడింది. 58,977.34 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 58,984.32 - 58,583.36 మధ్య కదిలింది. చివరకు 35.78 పాయింట్లు నష్టంతో 58,817.29 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.51 వద్ద ట్రేడయ్యింది.

* సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి. 

మార్కెట్‌లోని ఇతర విశేషాలు..

* జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో షుగర్‌ కంపెనీలు బలహీన ఫలితాలను ప్రకటించాయి. దీంతో ఈ రంగంలోని షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో బలరాంపూర్‌ చినీ మిల్స్‌ 6 శాతం, శ్రీ రేణుకా షుగర్స్‌ షేర్లు 7 శాతం పడిపోయాయి.

* భవిష్యత్తులో బలమైన వ్యాపార వృద్ధి అంచనాలతో ఎవరెడీ ఇండస్ట్రీస్‌ షేర్లు ఈరోజు ఇంట్రాడేలో 4.5 శాతానికి పైగా లాభపడి రూ.374.50 వద్ద 5 నెలల గరిష్ఠానికి చేరాయి.

* జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా కెమికల్స్‌ బలమైన కార్పొరేట్‌ ఫలితాలను ప్రకటించింది. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు 12 శాతానికి పైగా ఎగబాకి రూ.1,086.55 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేశాయి.

* హిందాల్కో ఈరోజు జూన్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఏకీకృత లాభాలు 47.7 శాతం పెరిగి రూ.4,119 కోట్లకు చేరింది. కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద త్రైమాసిక లాభం కావడం విశేషం. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు ఈరోజు 4.44 శాతం లాభపడి రూ.440.10 వద్ద స్థిరపడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని