Sweets-snacks: ₹1.25 లక్షల కోట్లకు స్వీట్లు, స్నాక్స్‌ వ్యాపారం!

ఈ ఆర్థిక సంవత్సరంలో విక్రయాల విలువ రూ.1.25 లక్షల కోట్ల వద్ద జీవితకాల గరిష్ఠానికి చేరుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి...

Published : 04 Sep 2022 16:14 IST

స్వీట్లు, నమ్కీన్‌ తయారీ సమాఖ్య అంచనా

ఇండోర్‌: కరోనా సంక్షోభం నుంచి బయటపడడంతో ఈసారి పండగ సీజన్‌లో ‘స్వీట్లు, స్నాక్స్‌’ విక్రయాలు గణనీయంగా పుంజుకునే అవకాశం ఉందని ‘స్వీట్లు, నమ్కీన్‌ తయారీ సమాఖ్య’ డైరెక్టర్‌ ఫిరోజ్‌ హెచ్‌ నక్వీ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విక్రయాల విలువ రూ.1.25 లక్షల కోట్ల వద్ద జీవితకాల గరిష్ఠానికి చేరుతుందని అంచనా వేశారు.

గత నెల రక్షాబంధన్‌ సందర్భంగా స్వీట్లు, స్నాక్స్‌ వ్యాపారంలో గణనీయ వృద్ధి నమోదైందని ఫిరోజ్‌ తెలిపారు. గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా మోదక్‌ వంటి స్వీట్ల విక్రయాలు బాగా పెరిగాయని వెల్లడించారు. రానున్న దసరా, దీపావళి, హోలీ పండగ సమయంలోనూ ఇదే పోకడ కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కొనుగోళ్లపై ద్రవ్యోల్బణ ప్రభావం గురించి స్పందిస్తూ.. ‘‘ప్రజలు ఆభరణాలు, దుస్తులపై చేసే ఖర్చును తగ్గించుకోవచ్చేమోగానీ.. స్వీట్లు, నమ్కీన్‌ పండగ సీజన్‌లో తప్పనసరి ఉండాల్సినవి’’ అని అన్నారు.

కరోనా వల్ల స్వీట్లు, స్నాక్స్‌ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని ఫిరోజ్‌ తెలిపారు. 2020-21లో ఈ రంగం రూ.35 వేల కోట్ల నష్టాన్ని చవిచూసిందన్నారు. 2021-22లో పరిస్థితులు చక్కబడ్డాయని.. వ్యాపారం రూ.1.10 లక్షల కోట్లకు పుంజుకుందని తెలిపారు. ఈ ఏడాది మరింత వృద్ధి నమోదవుతుందని ధీమా వ్యక్తం చేశారు. పాల ఆధారిత స్వీట్లను యూకే, కెనడా, న్యూజిలాండ్‌ వంటి దేశాలకు పంపడంలో ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో స్వీట్ల ఎగుమతుల విలువ రూ.2000-3000 కోట్లకు మాత్రమే పరిమితమైందని తెలిపారు. భారత ప్రభుత్వం వీటిని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఫలితంగా స్థానిక స్వీట్ల తయారీదారులకేగాక పాల ఉత్పత్తిదారులకూ లాభదాయకంగా ఉంటుందన్నారు. ‘డ్రై ఫ్రూట్స్‌’ ద్వారా తయారయ్యే ‘కాజూ కట్లీ’ వంటి స్వీట్లకు గల్ఫ్‌ దేశాల్లో మంచి గిరాకీ ఉందన్నారు. స్వీట్లు, నమ్కీన్‌ పరిశ్రమ ద్వారా దేశంలో ప్రత్యక్ష, పరోక్ష మార్గాన ఏటా కోటి మందికి ఉపాధి లభిస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని