Stock Market: ఆర్‌బీఐ ప్రకటనకు ముందు సూచీల్లో అప్రమత్తత!

Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటనకు ముందు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి.

Updated : 07 Dec 2022 09:47 IST

ముంబయి: ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటనకు ముందు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉండడం కూడా సూచీలపై ప్రభావం చూపుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. మెటా షేర్లు ఆరు శాతం మేర నష్టపోవడం అక్కడి సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా- పసిఫిక్‌ మార్కెట్లు సైతం నేడు నష్టాల్లో చలిస్తున్నాయి. నేడు వెలువడనున్న ఆర్‌బీఐ రెపోరేటు పెంపు, ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు అంచనాలపై మదుపర్లు దృష్టి సారించనున్నారు.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 44 పాయింట్ల నష్టంతో 62,582 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయి 18,628 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.57 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎస్‌బీఐ, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎన్‌టీపీసీ, విప్రో, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

గమనించాల్సిన స్టాక్స్‌..

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ: కంపెనీ ప్రమోటర్‌ ఏబీఆర్‌డీఎన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ తమ 10.2 శాతం వాటాను పూర్తిగా విక్రయించనుంది. ఫలితంగా హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ కో-స్పాన్సర్‌ హోదాను వదులుకోనుంది.

వొడాఫోన్‌ ఐడియా: కంపెనీ నిధుల సమీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. కంపెనీ బకాయిల్ని ఈక్విటీలుగా మార్చుకోవడంపై ప్రభుత్వం ఇంకా జాప్యం చేస్తుండడమే దీనికి కారణం.

ఐడీబీఐ బ్యాంక్‌: ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతానికి మించి (మెజార్టీ) వాటా కలిగి ఉండేందుకు విదేశీ ఫండ్స్‌, పెట్టుబడుల సంస్థల బృందానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌: దీర్ఘకాల బాండ్ల జారీ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించే యోచనలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉంది. యాక్సిస్‌ బ్యాంక్‌ సైతం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల జారీ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు