TikTok: టిక్‌టాక్‌కు ఈయూ షాక్‌.. నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీ జరిమానా!

Tiktok fined: వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌కు ఈయూలో భారీ జరిమానా పడింది. గోప్యతా నిబందనలు ఉల్లంఘించడమే ఇందుకు కారణం.

Published : 16 Sep 2023 01:56 IST

లండన్‌: చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌కు (TikTok) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలు దేశాల్లో నిషేధం ఎదుర్కొంటున్న ఈ యాప్‌నకు యూరప్‌లో చుక్కెదురైంది. యూరప్‌ కఠిన గోప్యతా నిబంధనలు ఉల్లంఘించినందుకు అక్కడి నియంత్రణ సంస్థ భారీ జరిమానా విధించింది. చిన్నారుల గోప్యతా నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ దాదాపు రూ.3 వేల కోట్లు (368 మిలియన్‌ డాలర్లు) జరిమానా వేసింది. ఈయూ నిబంధనలు ఉల్లంఘించినందుకు టిక్‌టాక్‌కు ఇంత భారీ మొత్తంలో జరిమానా విధించడం ఇదే తొలిసారి.

ఈయూ తీసుకొచ్చిన గోప్యతా నిబంధనలను 2020లో టిక్‌టాక్‌ ఉల్లంఘించిందని ఐర్లాండ్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ తెలిపింది. టీనేజీ పిల్లలు లాగిన్‌ అయినప్పుడు వారికీ డిఫాల్డ్‌ సెట్టింగ్స్‌ ఉంటున్నాయి. దీనివల్ల టీనేజీ చిన్నారుల వీడియోలను అందరూ వీక్షించేలా, కామెంట్‌ చేసేందుకు అనుమతిస్తున్నట్లు విచారణలో కమిషన్‌ గుర్తించింది. 13 ఏళ్లలోపు వారు లాగిన్‌ అవ్వడానికి వీల్లేనప్పటికీ.. వారినీ అనుమతిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పాటు తల్లిదండ్రుల కోసం రూపొందించిన ‘ఫ్యామిలీ పెయిరింగ్’ ఫీచర్‌లో కూడా లోపాలు ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో టిక్‌టాక్‌కు భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును సవరించిన ఎస్‌బీఐ

అయితే, తమకు జరిమానా విధించడాన్ని టిక్‌టాక్‌ తప్పుబట్టింది. 2021 సెప్టెంబరులో దర్యాప్తు ప్రారంభించకముందే టిక్‌టాక్‌లో సెట్టింగ్స్‌లో మార్పులు చేపట్టామని తెలిపింది. 16 ఏళ్లలోపు వారందరికీ డిఫాల్ట్‌ సెట్టింగ్స్‌ అమలు చేశామని, 13-15 ఏళ్ల చిన్నారులకు డైరెక్ట్‌ మెసేజ్‌ చేయడానికి వీల్లేకుండా చేశామని పేర్కొంది. ఇవన్నీ 2021 నుంచే అమల్లోకి తెచ్చామని తెలిపింది. గతంలో ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌కు సైతం నిబంధనల ఉల్లంఘన కింద యూరప్‌ భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని