Uber: నచ్చిన ధరకే రైడ్‌.. కొత్త ఫీచర్‌ కోసం ఉబర్‌ సన్నాహాలు!

Uber: ఆన్‌లైన్‌లోనూ బేరమాడే సదుపాయం ఉంటే ఎంత బాగుంటుందో కదా? అచ్చం అలాంటి ఫీచర్‌నే తన కస్టమర్లకు అందించేందుకు ఉబర్‌ సిద్ధమవుతోంది. అసలేంటా ఫీచర్‌? ఎలా ఉపయోగపడుతుంది?

Published : 07 Jan 2024 06:49 IST

Uber Flex service | ఇంటర్నెట్‌డెస్క్‌: క్యాబ్‌ బుక్‌ చేసే సమయంలో ప్రయాణ దూరం, సమయం బట్టి ఛార్జీలు ఉండటం మనం గమనిస్తుంటాం. ఒక్కోసారి తక్కువ దూరానికీ ఎక్కువ ధర చూపిస్తుంటుంది. అలాంటి సమయంలో ఛార్జి తగ్గించాలని బేరమాడే సదుపాయం ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఆన్‌లైన్‌లో సాధారణంగా అలాంటి సౌకర్యం ఉండదు. రైడ్‌ బుక్‌ చేసుకున్న సమయంలో చూపించే మొత్తమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాబ్‌ సర్వీసులు అందించే ఉబర్‌ (Uber) కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. యూజర్‌ ఎంత ధర పెట్టాలనుకుంటున్నాడో అంతకే క్యాబ్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

‘ఉబర్‌ ఫ్లెక్స్‌’ (Uber Flex) పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. రైడ్ బుక్‌ చేసుకున్నప్పుడు సాధారణంగా కనిపించే ధరలకు బదులుగా తొమ్మిది విభిన్న ధర ఎంపికలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి మాత్రం డీఫాల్ట్‌గా ఉంటుంది. ఇక రైడ్‌ బుక్‌ చేసుకున్న వ్యక్తి ఈ తొమ్మిదింట్లో తనకు నచ్చిన ధరను ఎంచుకోవచ్చు. రైడర్‌ ఎంచుకున్న ధర డ్రైవర్‌కి నచ్చితే తన ప్రతిపాదనను అంగీకరిస్తాడు. లేదా తిరస్కరించవచ్చు. ఇలా నచ్చిన ధరతో రైడ్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఇకపై డ్రైవర్లకు, కస్టమర్లకు రైడ్‌ ధరను ఎంచుకొనే విషయంలో స్వేచ్ఛ ఉండనుందన్నమాట.

ఏథర్‌ నుంచి కొత్త స్కూటర్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 157 km

ఉబర్‌ కస్టమర్లు తమ రైడ్‌ ధరల ఎంపికపై నియంత్రణ కల్పించటం కోసం ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తక్కువ ధరకే రైడర్లు ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. ప్రయాణించిన తర్వాత నగదు లేదా డిజిటల్ పద్ధతి ద్వారా చెల్లింపులు చేయొచ్చు. గతేడాది అక్టోబరులోనే ఫ్లెక్స్‌ ఫీచర్‌ టెస్టింగ్‌ను ఉబర్‌ ప్రారంభించింది. ఔరంగాబాద్‌, ఆజ్మీర్‌, బరేలీ, చండీగఢ్‌, కోయంబత్తూర్‌, దేహ్రాదూన్‌, గ్వాలియర్‌, ఇందౌర్‌, జోధ్‌పుర్‌, సూరత్‌ ప్రాంతాల్లో పరీక్షించినట్లు ఉబర్‌ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో దిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో ఈ సేవల్ని పరీక్షించనుంది. భారత్‌తో పాటు లెబనాన్‌, కెన్యా, లాటిన్‌ అమెరికా వంటి దేశాల్లో ఈ ఫీచర్‌ని పరీక్షిస్తోంది.

సేఫ్టీ టూల్‌ కిట్‌..

ఇటీవల ఉబర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకున్న ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ‘ఫోన్‌లో వీడియో చూస్తూ డ్రైవర్‌ వాహనం నడుపుతున్నాడు. ఇది భయం కలిగిస్తోంది’ అంటూ తనకెదురైన అనుభవాన్ని ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. దీనిపై ఉబర్‌ స్పందించింది. ఇలాంటి సమయాల్లో మీరు సేఫ్టీ టూల్‌కిట్‌ ఆప్షన్‌ని ఎంచుకోవాలని, అప్పుడు తమ ప్రత్యేక భద్రతా బృందం సంప్రదించి మీకు సాయపడుతుందని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని