జనరల్‌ మోటార్స్, ఫోర్డును దాటేసిన వియత్నాం కార్ల కంపెనీ..!

అమెరికా మార్కెట్‌లో లిస్ట్‌ అయిన ఓ సంస్థ తొలి రోజే ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. మార్కెట్‌ విలువలో జనరల్‌ మోటార్స్‌, ఫోర్డును దాటేసింది.

Updated : 16 Aug 2023 11:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కార్ల తయారీలో ఫోర్డు, జనరల్‌ మోటర్స్ అమెరికా మార్కెట్‌ను ఏలుతున్నాయి. కానీ, వియత్నాంకు చెందిన ఓ కంపెనీ న్యూయార్క్‌ స్టాక్‌మార్కెట్‌లో లిస్టింగ్‌ రోజునే ఈ రెండు కంపెనీల మార్కెట్‌ విలువను దాటేసింది. ఈ షేర్లను కొన్న ఇన్వెస్టర్లకు తొలిరోజే 255 శాతం లాభాన్ని ఇచ్చింది. ఆ ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ పేరు ‘విన్‌ఫాస్ట్‌’(VinFast).

వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ విన్‌ఫాస్ట్‌ ఎస్పీఏసీ ఒప్పందం కింద న్యూయార్క్‌లోని నాస్‌డాక్‌లో లిస్టింగ్‌ అయింది. ఈ సందర్భంగా కంపెనీ షేర్ల విలువ 255 శాతం పెరిగి కంపెనీ ఛైర్మన్‌ ఫామ్‌ నాట్‌ వుంగ్‌ సంపదకు 39 బిలియన్‌ డాలర్లను జోడించింది. దీంతో విన్‌ఫాస్ట్‌ మార్కెట్‌ విలువ జనరల్‌ మోటార్స్‌, మెర్సిడెస్‌ బెంజ్‌ ఏజీ, ఫోర్డును దాటేసింది. ప్రస్తుతం ఫామ్‌ సంపద.. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం 44.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇప్పటికే  వుంగ్‌ వియత్నాంలో అత్యంత సంపన్నుడిగా నిలిచాడు.

ఓలా కొత్త విద్యుత్‌ స్కూటర్లు,బైౖకులు

వాస్తవానికి వుంగ్‌ తొలుత కంపెనీని సాధారణ పబ్లిక్‌ ఆఫర్‌ కింద అమెరికాలో లిస్టింగ్‌ చేద్దామనుకొన్నాడు. కానీ, గతేడాది చాలా స్టార్టప్‌ల్లో నష్టాలు రావడంతో ఇన్వెస్టర్లు ఆసక్తిగా లేరని గమనించి.. ఎస్పీఏసీ (స్పెషల్‌ పర్పస్‌ అక్విజేషన్‌ కంపెనీ) ఒప్పందం ద్వారా షేర్లను విక్రయించారు. దీనిని క్యాసినో మొఘల్‌గా పేరున్న లారెన్స్‌ హోకు చెందిన బ్లాక్‌ స్పాడ్‌ అక్విజేషన్‌లో విలీనం చేసేందుకు అంగీకరించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. స్టాక్‌ ఎక్స్‌ఛేంజిలో లేని కంపెనీని.. స్టాక్‌ ఎక్స్‌ఛేంజిలో ఉన్న కంపెనీతో విలీనం చేయడమన్నమాట. స్టార్టప్‌లు సంప్రదాయ షేర్ల విక్రయ మార్గం కాకుండా.. ఎస్పీఏసీ మార్గాన్ని ఎంచుకొంటున్నాయి. మరోవైపు ఇతర ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ చేయడానికి విన్‌ఫాస్ట్‌ షేర్లు అతి తక్కువగానే అందుబాటులో ఉండటం కూడా దీని ధరలో భారీ తేడాలకు కారణమవుతోంది. మంగళవారం 185 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు ట్రేడ్‌ అయ్యాయి. వుంగ్‌ 2017లో సింగపుర్‌ కేంద్రంగా విన్‌ఫాస్ట్‌ను ప్రారంభించారు. ఇది ఆయన వ్యాపార సామ్రాజ్యమైన విన్‌గ్రూప్‌లో ఓ భాగం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని