China: చైనాలోని ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌లో తీవ్ర ఉద్రిక్తత?

చైనాలో కరోనా కేసులు మరోసారి భారీ ఎత్తున నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం జీరో కొవిడ్‌ విధానాన్ని అమలు చేస్తోంది. కఠిన లాక్‌డౌన్‌లతో విసుగెత్తిన ప్రజలు ఆందోళనలకు దిగుతున్నట్లు సమాచారం. 

Updated : 23 Nov 2022 13:19 IST

బీజింగ్‌: చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. రోజుకి దాదాపు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మహమ్మారి కట్టడి నిమిత్తం చైనా ప్రభుత్వం ‘జీరో కొవిడ్‌’ విధానాన్ని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా కఠిన లాక్‌డౌన్‌లు అమలు చేస్తోంది. క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి అనుమానితుల్ని వాటికి పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా అనేక వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి.

మరోవైపు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఫ్యాక్టరీల్లో తయారీని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కంపెనీల్లోనే క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి కార్మికులు, సిబ్బందిని అందులోనే ఉంచుతున్నారు. నెలల తరబడి ఇదే పరిస్థితులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఫ్యాక్టరీల ప్రహరీలకు ఇనుప కంచెలు ఏర్పాటు చేసి సిబ్బంది తప్పించుకోకుండా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. మరోవైపు కంపెనీలు, ఫ్యాక్టరీల వెలుపల భారీ ఎత్తున సెక్యూరిటీ సిబ్బందిని కూడా మోహరించినట్లు తెలుస్తోంది. ఫలితంగా నెలలుగా క్వారంటైన్‌ కేంద్రాల్లో మగ్గిపోతున్న కార్మికులు, సిబ్బంది ఆందోళనలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా యాపిల్‌ ప్రధాన తయారీ భాగస్వామి అయిన ఫాక్స్‌కాన్‌కు చెందిన ప్లాంట్లలో కార్మికులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవుతున్న వీడియోలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ సహా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వీరిని నిలువరించేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందితో వారు ఘర్షణకు దిగినట్లు సమాచారం. దీంతో జెంగ్‌ఝౌలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారులపై బాష్పవాయువు కూడా ప్రయోగించినట్లు సోషల్‌ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తమ వసతిగృహాల నుంచి బుధవారం వేకువజామున కార్మికుల ఒక్కసారిగా బయటకు వచ్చి నిరసనలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న కొంతమంది కార్మికులపై సెక్యూరిటీ సిబ్బంది చేయిచేసుకుంటున్న వీడియోలూ దర్శనమిస్తున్నాయి. అయితే, ఈ వీడియోలను ధ్రువీకరించడానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేకపోవడం గమనార్హం.

దాదాపు నెలన్నర క్రితం కొవిడ్‌ లాక్‌డౌన్లకు భయపడి అనేక మంది సిబ్బంది జెంగ్‌ఝౌ ప్లాంట్‌ నుంచి పారిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్లాంటులో దాదాపు రెండు లక్షలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది బయటకు వెళ్లిపోవడంతో.. కంపెనీ భారీ ఎత్తున కొత్త సిబ్బందిని నియమించుకుంది. తాజాగా వీరే ఆందోళన చేస్తున్నట్లు సమాచారం. నెలక్రితం వచ్చిన తమని అసలు బయటకు అనుమతించడం లేదని.. పైగా చేసిన పనికి డబ్బులు కూడా చెల్లించడం లేదని పలువురు సామాజిక మాధ్యమాల్లో వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని