Petrol Diesel Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలూ తగ్గుతాయా?

Petrol Diesel Price: వంటగ్యాస్‌ ధర తగ్గిన నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా తగ్గుముఖం పట్టొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. వరుస ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందించొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Updated : 30 Aug 2023 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర (LPG Price) తగ్గిన నేపథ్యంలో ఇప్పుడు అందరి ఆశలు పెట్రోల్‌, డీజిల్‌పైకి మళ్లాయి. గ్యాస్‌ ధర తగ్గింపుతో ద్రవ్యోల్బణం దిగిరావొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి వాహన ఇంధన ధరల (Petrol Diesel Prices) కోత కూడా తోడైతే అన్ని నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. సామాన్యులు కూడా ఇదే ఆశిస్తున్నారు. అయితే, ఇవన్నీ నిజమయ్యే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సంస్థ సిటీ గ్రూప్‌ అంచనా వేసింది.

రాబోయే పండగల సీజన్‌తో పాటు వరుస ఎన్నికల నేపథ్యంలో కేంద్రం పెట్రో ధరల (Petrol Diesel Prices) తగ్గింపుపై సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని సిటీ గ్రూప్‌ అంచనా వేసింది. వంట గ్యాస్‌ ధర తగ్గించాలన్న కేంద్రం నిర్ణయంతో ద్రవ్యోల్బణం దాదాపు 30 బేసిస్‌ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక వేత్తలు సమీరన్‌ చక్రవర్తి, బకార్‌ ఎం.జైదీ తెలిపారు. ఇటీవల టమాటాల ధరలు దిగివచ్చిన నేపథ్యంలో సెప్టెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

బండ భారం తగ్గింది

జులైలో 15 నెలల గరిష్ఠానికి చేరిన నిత్యావసరాల ధరలు తగ్గుముఖం పట్టేందుకు కేంద్రం అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు చెప్పారు. తాజాగా గ్యాస్‌ ధర తగ్గించడం అందులో భాగమేనని వివరించారు. మరోవైపు ఇప్పటికే బియ్యం, గోధుమలు, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ చర్యలకు పెట్రో ధరల తగ్గింపు కూడా జత అయితే ద్రవ్యోల్బణం దిగొస్తుందని ఆశిస్తున్నారు.

ఈ ఏడాది చివరలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, మిజోరం సహా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిత్యావసరాల ధరల తగ్గుదల దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాదిగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో తీవ్ర ఒడుదొడుకులు ఉన్నాయి. మన దగ్గర మాత్రం దాదాపు సంవత్సరం నుంచి పెట్రో ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడం ద్వారా ధరల్ని సవరించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్‌లో బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66గా, డీజిల్‌ ధర రూ.97.82గా ఉంది. విజయవాడలో ఈ ధరలు వరుసగా.. రూ.111.76, రూ.99.51గా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని