Year Ender 2022: ఈ ఏడాది వచ్చిన కీలక ఆర్థిక మార్పులివే..!

క్రెడిట్‌ కార్డు కొత్త రూల్స్‌, టోకనైజేషన్‌, డిజిటల్‌ రూపాయి.. ఇలా 2022లో ఆర్థికంగా అనేక మార్పులు వచ్చాయి. వీటిపై ఓ లుక్కేద్దాం...

Published : 28 Dec 2022 11:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది ఆర్థికపరంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వీటిలో కొన్ని సామాన్యులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపేవైతే.. మరికొన్ని పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. ఆర్‌బీఐ (RBI) రేట్ల పెంపుతో నెలవారీ వాయిదాల భారం పెరగ్గా.. టోకనైజేషన్‌ రూపంలో వినియోగదారులకు బ్యాంకులు మరింత భద్రతను కల్పించేందుకు ముందుకు వచ్చాయి. మరోవైపు క్రిప్టోల (Cryptocurrency)తో పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం.. అధిక పన్నులతో మదుపర్లను రక్షించే ప్రయత్నం చేశాయి. ఇలా.. ఈ ఏడాది చోటుచేసుకున్న కీలక ఆర్థిక పరిణామాలపై ఓ లుక్కేద్దాం...


ఆర్‌బీఐ ముందు చూపు.. క్రిప్టోలపై పన్ను

క్రిప్టో కరెన్సీ వంటి వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులకు సంబంధించిన లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయాల మీద 30 శాతం పన్ను అమల్లోకి వచ్చింది. ఒక పరిమితికి మించిన వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల బదిలీపై 1 శాతం టీడీఎస్‌ (మూలంలో పన్ను కోత) వసూలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించారు. క్రిప్టో ఆదాయాలను, వాటిపై వచ్చిన నష్టాలతో సర్దుబాటు చేయటానికీ వీల్లేదు. అదేవిధంగా షేర్లు, కమొడిటీల వంటి ఇతర ఆస్తులపై వచ్చిన నష్టాలతోనూ సర్దుబాటు చేయలేరు. అంతేకాకుండా ఈ ఆదాయంపై పన్ను మినహాయింపు కూడా ఉండదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ ప్రతిపాదనలు అమల్లోకి వచ్చాయి.


క్రెడిట్‌ కార్డుపై మరింత పట్టు

క్రెడిట్‌ కార్డుల విషయంలో కీలక మార్పులు వచ్చాయి. ఆర్‌బీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. క్రెడిట్‌ కార్డు సంస్థలు.. కార్డు వినియోగదారుడిని సంప్రదించకుండా.. కొత్తగా పరిమితి పెంచడం, కొత్త కార్డులను పంపించడంలాంటివి చేసేందుకు వీల్లేదు. దీంతోపాటు.. కార్డుదారుడు తన వెసులుబాటును బట్టి, బిల్లింగ్‌ సైకిల్‌ను మార్చుకోవచ్చు. అయితే, దీనికి ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. క్రెడిట్‌ కార్డును రద్దు చేయాల్సిందిగా వినియోగదారుడు కోరినప్పుడు ఎలాంటి బాకీలు లేకపోతే ఏడు పనిదినాల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆలస్యం అయితే.. రోజుకు రూ. 500 చొప్పున వినియోగదారుడికి కార్డు సంస్థ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


టెలికాంలో నవశకం..

దేశ టెలికాం రంగంలో ఒకరకంగా చెప్పాలంటే ఈ ఏడాదే నవశకం మొదలైంది. దేశంలో 5జీ సేవలు అక్టోబరు 1న ప్రారంభమయ్యాయి. 5జీ (5G) సేవలు తొలుత ఎంపిక చేసిన 13 నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. దశలవారీగా ఇతర నగరాలకూ విస్తరిస్తున్నాయి.  తొలి దశలో భాగంగా అహ్మదాబాద్‌, బెంగళూరు, చండీగఢ్‌, చెన్నై, దిల్లీ, గాంధీనగర్‌, గురుగ్రామ్‌, హైదరాబాద్‌, జామ్‌నగర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, పుణె నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. 4జీతో పోలిస్తే 7-10 రెట్ల డేటా వేగం 5జీ (5G) సేవల్లో లభిస్తుంది. దేశంలోని మూడు ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ సేవల కోసం రూ.1.5 లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. 5జీ రాకతో సాంకేతిక రంగంలో అనూహ్య మార్పులు రానున్నాయి. ముఖ్యంగా మెటావర్స్‌, ఆటోమేషన్‌ వంటి అత్యాధునిక సాంకేతికతలు మనిషిని కొత్త శకంలోకి తీసుకువెళ్లనున్నాయి.


డిజిటల్‌ రూపాయితో ప్రయోగాలు..!

దేశంలో తొలిసారిగా అధీకృత ‘డిజిటల్‌ రూపాయి’ నవంబరు 1 నుంచి వినియోగంలోకి వచ్చింది. ప్రయోగాత్మకంగా టోకు వినియోగానికి తొలుత అనుమతించారు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీలు ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీల కోసం డిజిటల్‌ రూపాయిని జారీ చేశాయి. ఆ తర్వాత డిజిటల్‌ రూపాయి- రిటైల్‌ విభాగంలో తొలి ప్రయోగాత్మక ప్రాజెక్టును డిసెంబరు 1న ఎంపిక చేసిన ప్రాంతాల్లో.. పరిమిత వినియోగదార్లు-వ్యాపారుల బృందాలకు ప్రారంభించాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) అనేది ప్రస్తుత కరెన్సీ నోట్లకు డిజిటల్‌ రూపం మాత్రమే. వీటికి ప్రత్యామ్నాయం కాదు. ప్రస్తుత నగదు కొనసాగుతుంది. అదనపు చెల్లింపు అవకాశాలను కల్పించేందుకే సీబీడీసీని తీసుకొచ్చినట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.


ధరలు పెరిగే.. వడ్డీరేట్లూ పెరిగే..

దేశంలో అదుపు తప్పిన ధరల్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. మే నెలలో అనూహ్యంగా భేటీ అయి రెపోరేటును 0.40 శాతం పెంచింది. తర్వాత జరిగిన ప్రతి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచుతూ వచ్చింది. ఇప్పటి వరకు రెపోరేటు 2.25 శాతం పెరిగింది. బ్యాంకులు ఈ పెంపును వినియోగదారులపైకి బదిలీ చేశాయి. దీంతో సామాన్యులపై ఈఎంఐల భారం గణనీయంగా పెరిగింది. అయినా ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. వరుసగా 9 నెలల పాటు ద్రవ్యోల్బణం లక్షిత పరిధి అయిన 6 శాతం ఎగువన నమోదవ్వడంతో చరిత్రలో తొలిసారి ఆర్‌బీఐ ద్రవ్యపరపతి కమిటీ కేంద్ర ప్రభుత్వానికి అక్టోబరులో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 


టోకనైజేషన్‌తో మన కార్డుకు మరింత భద్రత..

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చేసే ఆన్‌లైన్‌ చెల్లింపు లావాదేవీల్లో భద్రతను పెంచడమే లక్ష్యంగా టోకనైజేషన్‌ను ఈ ఏడాదిలోనే తీసుకొచ్చారు. టోకనైజేషన్‌తో కార్డు వివరాల నిల్వ పరిమితంగా ఉంటుంది. తాజాగా అన్ని ఆన్‌లైన్‌ చెల్లింపు గేట్‌వేలు, వ్యాపారులు, ఇ-కామర్స్‌ కంపెనీలు తమ వినియోగదార్లకు చెందిన కార్డుల టోకనైజేషన్‌ను అమలు చేయాలని ఆర్‌బీఐ కోరింది. మర్చంట్లు తమ సర్వర్లలో వినియోగదారు కార్డు వివరాలను నిల్వ చేయకుండా, ప్రత్యామ్నాయంగా సీఓఎఫ్‌(కార్డ్‌ ఆన్‌ ఫైల్‌) టోకనైజేషన్‌ను అందిపుచ్చుకోవాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు