logo

లక్షణమైన నటన.. కోటి మంది వీక్షణ

ఒకప్పుడు సినిమాల్లో నటించే వారికే గుర్తింపు వచ్చేది. ఆ రంగంలోని దర్శకులు, నిర్మాతలే వెలుగొందే వారు. నటన, రచనా రంగంలో ఎంత ప్రతిభ ఉన్నా సామాన్యులకు, సాధారణ ప్రజానీకానికి అవకాశాలు అందని ద్రాక్షగానే మిగిలేది.

Updated : 16 Mar 2024 06:29 IST

గొడిసిర్యాల చిన్నారుల ప్రతిభ

బాలనట బలగంతో విష్ణు

మామడ/దస్తురాబాద్‌, న్యూస్‌టుడే: ఒకప్పుడు సినిమాల్లో నటించే వారికే గుర్తింపు వచ్చేది. ఆ రంగంలోని దర్శకులు, నిర్మాతలే వెలుగొందే వారు. నటన, రచనా రంగంలో ఎంత ప్రతిభ ఉన్నా సామాన్యులకు, సాధారణ ప్రజానీకానికి అవకాశాలు అందని ద్రాక్షగానే మిగిలేది. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌్ ఛానళ్లు అందుబాటులోకొచ్చాక ప్రతిభ ఉంటే ఎవరైనా, ఎక్కడి నుంచైనా .హీరోలుగా మారేందుకు, దర్శకత్వం వహించేందుకు దారులు దగ్గరయ్యాయి. నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌ మండలం గొడిసిర్యాలకు చెందిన ఓ యువకుడి మార్గదర్శనంలో తెరమీద ఇరగదీస్తున్న చిన్నారుల సన్నివేశాలు ఇందుకు నిదర్శనం.

‘స్వాతి’ ఏ పాత్రలోనైనా జీవిస్తుంది..

తెర వెనక విష్ణు..

గొడిసిర్యాలకు చెందిన సౌధాని విష్ణు డిగ్రీ పూర్తి చేశారు. అంగవైకల్యంతో ఆయన చిన్నప్పటి నుంచి అనేక కష్టనష్టాలెదుర్కొన్నారు. ఉన్నత తరగతులకు పక్క ఊరి బడికెళ్లేందుకు సైకిల్‌ నడపలేని పరిస్థితి. అవిటితనం బాధపెట్టినా పని చేయకుంటే కుదరని పేదరికం. ఎన్ని అడ్డంకులెదురైనా పక్క గ్రామానికి వెళ్లి పదో తరగతి, ఆ తర్వాత జన్నారం, జగిత్యాలలో ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పుడు సొంతూరులో ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇంతకే పరిమితమై ఉంటే అతడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించి బాల నటులచే భళా అనిపిస్తూ తెర వెనక ఆయన చేస్తున్న కృషి అభినందనీయం.

మదిలో మెదిలిన ఆలోచనలతో..

ఆధునిక పోకడలతో అంతరించి పోతున్న పల్లె పదాలు, జానపదాలు, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను బతికించాలన్న తపన విష్ణులో బలంగా ఉంది. ఇందుకు యూట్యూబ్‌ను వేదిక చేసుకున్నారు. ‘ఎస్‌వీవై ఎడిటింగ్స్‌’ అనే ఛానల్‌ను 2022లో ప్రారంభించారు. నటనలో ప్రతిభ కనబరిచే అదే గ్రామానికి చెందిన పది మంది పిల్లలతో అద్భుతమైన, సందేశాత్మక లఘుచిత్రాలను తీస్తున్నారు. వాస్తవానికి దగ్గరగా ఉండే గ్రామీణ కుటుంబ నేపథ్యమున్న ఆయన కథాంశాలు, చిన్నారుల మహానటన లక్షల మందిని ఆకట్టుకుంటోంది. ‘నాయి దొరో’ అనే పాటను 5 లక్షల మంది వీక్షించారంటే మాటలా మరి.

భళా బాల నటులు..

అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక ఏ మాత్రం ప్రతిభ ఉన్నా అది విశ్వవ్యాప్తమవుతోంది. తన రచనా శైలిలో విష్ణు, నటనా ప్రతిభతో గొడిసిర్యాల చిన్నారుల పాటలు, లఘుచిత్రాలను ఇప్పటి వరకు 1,43,33,771 మంది వీక్షించారంటే ఈ ఇంటర్నెట్‌ ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చిందనడంలో అతిశయోక్తి లేనట్లే.. ఆ యువకుడి దర్శకత్వంలో చిన్నారులు స్వాతి, నాగరాజు, రాహిణి, వినీష, వినయ్‌, నిషాంత్‌, విశ్వంత్‌, అక్షిత్‌, లల్లి, అభిరామ్‌, క్రిష్‌ నటనలో ఇప్పటి వరకు చిత్రీకరించిన ‘నాతో పెట్టుకోకు మరి, దుబాయ్‌ షేక్‌, బతుకమ్మ ఆడనివ్వక పోతే, ఆకాశి పండగకు అవ్వగారింటికి పోత, యారాండ్ల కొట్లాట, అప్పుతోటి తిప్పలు, వదినోళ్ల బర్రె సచ్చిపాయే, బస్సులేక బడికి ఇబ్బంది’ వంటి వీడియోలు జనాదారణ పొందాయి. పిల్లల చదువుకు ఇబ్బంది కాకుండా ఆదివారాల్లో, సెలవు దినాల్లో తల్లిదండ్రుల అనుమతితో ఊరి చుట్టూనే చిత్రీకరిస్తుంటారు. తమ గ్రామ పిల్లలు ఇంత బాగా నటిస్తారా అని ఎక్కడెక్కడో ఉండే వారు ఆసక్తితో చూస్తుంటారు.

సంతృప్తిగా ఉంది: విష్ణు

ఉన్నచోటే ఉండి పోతే ఈ రోజుల్లో ఎవరూ పట్టించుకోరు. పనిచేస్తూనే అదనంగా ఆసక్తి ఉన్న రంగంలో రాణిస్తే గుర్తింపు వస్తుంది. ఒకప్పుడు వైకల్యంతో ఇంటి నుంచి బయటకు వెళ్లలేని నేను ఈ రోజు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే లఘు చిత్రాలు తీస్తున్నాను. మా ఊరి పిల్లలు అద్భుతంగా నటిస్తుండడంతో యూట్యూబ్‌లో నా ఛానల్‌కు చక్కని పేరొచ్చింది. పెద్దగా ఖర్చు లేకుండా చరవాణిని చిన్న స్టాండ్‌కు బిగించి స్థానికంగా తీస్తున్న సన్నివేశాలను వీక్షకులు ఆదరించడం సంతృప్తినిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని